ఒమిక్రాన్ మనల్ని వదిలిపోయినట్లు,కరోనా అంతమై పోయినట్లు భావించకండి అంటూ
డబ్ల్యూ హెచ్ ఓ ( ప్రపంచ ఆరోగ్య సంస్థ ) మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తోంది.మొన్నటి వరకూ తీవ్రస్థాయిలో విజృంభించిన ఈ వేరియంట్ గత కొన్నాళ్ళుగా తగ్గుముఖం పట్టింది.
ఈ నేపథ్యంలో,చాలామంది కరోనా జాగ్రత్తలను అనుసరించడం మానేశారు.భౌతిక దూరం పాటించడం,మాస్కులు ధరించడం మరచిపోయారు.వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉందని అనుకొని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలను కూడా ఎత్తివేశారు.దీనితో ఆ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, స్వల్పం విరామం తర్వాత కేసులు మళ్ళీ పెరుగుతున్నాయని
డబ్ల్యూ హెచ్ ఓ వెల్లడించింది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉధృతి మళ్ళీ పెరుగుతోంది. మార్చి 7-13 వ తేదీ మధ్య ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు 8శాతం పెరిగాయి.
దక్షిణ కొరియా,వియత్నాం, జర్మనీ దేశాల్లో ఉధృతి ఎక్కువగా ఉంది.చైనాలో గత కొద్ది రోజులుగా నమోదవుతున్న కొత్త కేసులు రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరువగా వచ్చాయి.ఈ ప్రభావంతో చైనా ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది.సుమారు 3కోట్లమంది లాక్ డౌన్ లోకి వెళ్లిపోయారు.
దక్షిణా కొరియాలో అత్యధికంగా బుధవారం ఒక్కరోజులోనే 4,00,714 కేసులు నమోదయ్యాయి.
ఆ దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం.కరోనాకు పుట్టినిల్లు చైనా.ఆ పాపం ఆ దేశాన్ని వదలడం లేదు.’స్టెల్త్ ఒమిక్రాన్’ రూపంలో చైనీయులను కోవిడ్ వణికిస్తోంది.వారం రోజుల నుంచి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 13 మహానగరాలను మూసివేసింది.ప్రజారవాణాను కూడా ఆపివేసింది.
ఈ నేపథ్యంలో,మనం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరీక్షలు,జీనోమ్ స్వీక్వెన్సింగ్స్,వ్యాక్సినేషన్ ను మరింతగా పెంచాల్సిఉంది.
వ్యాక్సిన్ల వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది,ప్రాణాపాయ ముప్పు తప్పుతుంది తప్ప, వ్యాప్తి ఆగదు.మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నిబంధనలను పాటించడమే ప్రధాన కర్తవ్యం. స్వయంక్రమశిక్షణ దానికి ఆలంబనం.అన్ని డోసుల వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకోవడం అత్యంత ముఖ్యం.అన్ని వయసులవారికీ త్వరితగతిన టీకాప్రక్రియ ముగియాలి.బూస్టర్ డోసులు కూడా మొదలయ్యాయి కానీ,వీటి విషయంలో మరింత స్పష్టత రావాల్సివుంది.
పోస్ట్ కోవిడ్ ( కరోనా వచ్చిన తర్వాత ) పరిణామాలు కొందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.ఆకస్మిక మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
ఈ దుష్ప్రభావాలు కలవరపెడుతున్నాయి. వ్యాక్సిన్ల రూపకల్పనలో ఇంకా అభివృద్ధి సాధించాల్సివుంది. సామర్ధ్యంలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి.కరోనాకు సంబంధించిన వైద్య విధానంలోనూ ఇంకా పరిపక్వత రావాల్సివుంది.
వైద్యులు,నిపుణులలో అవగాహన పెరగాల్సివుంది. గతంతో పోల్చుకుంటే పరిణితిని సాధించినప్పటికీ, అది సరిపోదు.కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలలో భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి.నిరంతర అధ్యయనం,పరిశీలన, ఆచరణతో కరోనాను కట్టడి చెయ్యాలి. గుంపులుగుంపులుగా జమకూరడానికి స్వస్తి పలకాలి.ప్రభుత్వాలు, ప్రజలు ఉమ్మడిగా ఈ పాడుకాలాన్ని అధిగమించాలి.