- కోవిడ్ రెండో తరంగం అనూహ్యమైనది, అత్యంత ప్రమాదకరమైంది
- ఒమిక్రాన్ వ్యాపిస్తోంది, ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి
కొత్త సంవత్సరం, పండుగల సీజన్ దగ్గరకు వచ్చేసింది. సరిగ్గా పోయిన సంవత్సరం ఇదే సమయానికి మంచిరోజులు త్వరలోనే రానున్నాయనే అనందంలో ఉన్నాం. కరోనా వైరస్ కలకలం తగ్గుముఖం పడుతుందనే విశ్వాసంలో ఉన్నాం. కానీ తర్వాత వచ్చిన పరిణామాలు అలా జరగనివ్వలేదు. మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వ్యాప్తి గణనీయంగా తగ్గడం, పెరగడం రెండూ జరిగాయి. ప్రధమార్ధంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా, సక్రమంగా వినియోగం జరుగలేదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఆచరణలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, సహకారం ఆశించిన మేరకు జరుగలేదు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజలు విశృంఖలంగా ప్రవర్తించారు. ఈ కారణంతో ఉన్నపళంగా కేసులు బాగా పెరిగాయి. మరణాలు సంభవించాయి. డెల్టా వేరియంట్ ను అంత సమర్ధంగా ఎదుర్కోలేకపోయాం. వ్యాక్సినేషన్ విషయంలోనూ, ఆ యా కంపెనీల వ్యాక్సిన్ల అంశంలోనూ ప్రజల్లో సంపూర్ణమైన విశ్వాసాన్ని జమ చేయలేకపోయారు. ద్వితీయార్ధంలో వ్యాక్సినేషన్ ఊపందుకుంది. దీని వల్ల కొంత ప్రయోజనం దక్కింది.
Also read: అజయ్ మిశ్రాపైన వేటు అనివార్యం
లక్ష్యాలు చేరడంలో కేంద్రం వైఫల్యం
కానీ కేంద్రం పదే పదే ప్రకటించిన లక్ష్యాలను చేరుకోలేకపోయింది. వ్యాక్సినేషన్ అనుకున్నట్లుగా జరిగిఉండి ఉంటే హెర్డ్ ఇమ్మ్యూనిటీని (సామూహిక రోగ నిరోధక శక్తి) తగినంతగా పెంచుకొని ఉండేవాళ్ళం. కనీసం 60 శాతం మందికి రెండు డోసుల చొప్పున పూర్తయివుంటే కరోనా అదుపులోకి వచ్చి ఉండేది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 41శాతం మందికి మాత్రమే రెండు డోసులు అందాయి. కనీసం వృద్ధులకు ఇంకా ఎక్కువమందికి అందివుంటే బాగుండేది. చిన్న పిల్లల విషయంలో ఇంత వరకూ స్పష్టత లేదు. మొదటి డోసు – రెండవ డోసుకు మధ్య ఉన్న వ్యత్యాసంలో సమతుల్యతను పాటించలేదు. ఒకొక్క కంపెనీ ఒక్కొక్క నియమాన్ని అమలు చేస్తోంది. సరిపడా స్టాక్ అందుబాటులో లేకనే కోవీషీల్డ్ 6 నెలల వ్యవధిని పెట్టిందనే విమర్శలు వచ్చాయి. కోవ్యాక్సిన్ మొదటి డోసు మూడు పరీక్షలు కాకముందే మార్కెట్ లోకి విడుదల చేయడం పట్ల కూడా వివిధ ఆరోపణలు, అనుమానాలు ప్రచారమయ్యాయి. బూస్టర్ డోస్ వేసుకోవడం ఎంతోమంచిదని నిపుణులు చెబుతున్నా ఇంత వరకూ ప్రభుత్వ నిర్ణయం వెలువడలేదు. వ్యాక్సిన్ తయారీ కోసం వాడే ముడిసరుకుల పంపిణీ ప్రపంచ దేశాల మధ్య సరిగ్గా జరుగలేదు. ఇంకా 41 దేశాల్లో వ్యాక్సినేషన్ 10 శాతానికి మించలేదు. డెల్టా కంటే డెబ్భై రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ లో ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దేశాల మధ్య రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్ల నేడు ఒమిక్రాన్ విషయంలో ఎక్కువగా భయపడాల్సి వస్తోంది. అనవసర ప్రయాణాలు పెరుగుతున్నాయి. అది కూడా కొంప ముంచుతోంది.
Also read: బాపు స్మరణీయం బహు రమణీయం
అంతుచిక్కని ఒమిక్రాన్
ఇప్పటికే మన దేశంలో 11 రాష్ట్రాల్లో 100కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ ప్రవేశించింది. ప్రపంచంలోని 91 దేశాలకు ఈ వేరియంట్ పాకింది. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేయడమే క్షేమం. పండుగలు ప్రారంభమైన ఈ కాలంలో ఒకచోట గుమిగూడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. విందులు వినోదాలకు దూరంగా ఉండడమే తరుణోపాయం. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉధృతంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ చూపే ప్రభావాలపై మిశ్రమ నివేదికలు వస్తున్నాయి. ఎంత ప్రమాదకరమో ఇంకా తెలియాల్సివుంది. పరీక్షలు ఇంకా పెరగాల్సి ఉంది. ఇంటి దగ్గర స్వయంగా నిర్వహించుకొనే యాంటీజెన్ పరీక్షలు ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించలేక పోవచ్చని డాక్టర్ ఆంటోనీ పౌచీ వంటి నిపుణులు చెబుతున్నారు. పీసీఆర్ పరీక్షలే ఉత్తమమని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉన్నప్పటికీ, వ్యాక్సిన్లు రక్షణకవచంగా పనిచేస్తాయని ఎక్కువమంది నిపుణులు చెబుతున్నారు.ఈ వేరియంట్స్ అనేది మెడికల్ మాఫియా చేస్తున్న పెద్ద కుట్రగా కొందరు చూస్తున్నారు. కోవిడ్ -19 సృష్టికర్తగా చైనా ఇప్పటికే చెడ్డపేరు మూటకట్టుకుంది. వీటి మూలాలు ఎలా ఉన్నా, పర్యవసానాలు ప్రపంచాన్ని కుదిపేశాయి. నిబంధనలను పాటిస్తూ, వ్యాక్సినేషన్ పై శ్రద్ధ పెడుతూ ముందుకు సాగడమే మనం చేయగలిగింది, చేయాల్సింది.
Also read: నరేంద్రుని కాశీయాత్ర