శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’ కవితా సంపుటిలో ‘ఒకటీ-పదీ’ అనే కవిత ‘ఈ ఫస్టోబరు రోజు ఎవరా వస్త’ అని మొదలవుతుంది. పది పాదాల తర్వాత ఈ మాటలు కనబడతాయి.
“అదో పదోనెల బాల
హాస విశాల
పుట్టింటికొస్తోంది
పూర్ణ గర్భిణి’’
ఐదు పుటలు ఆక్రమించిన నాలుగు భాగాల కవిత మధ్యలో ఈ పాదాలు కూడా ఆకర్షిస్తాయి:
“ఈ ఫస్టోబరు వేళ
నిన్నటి మన స్వరూపం స్మరించి
నేటి మన స్వభావం గ్రహించి
రేపటి మన సమాజం కోసం కలిసిమెలిసి క్రమించుదాం”
ఇప్పటికి బోధపడిందనుకుంటా ఈ కవితా వస్తువు ఆంధ్రరాష్ట్ర అవతరణ అని. పొట్టి శ్రీరాములు దీక్ష చేసి, ప్రాణాలర్పించిన తొమ్మిదిన్నర నెలలకు 1953 అక్టోబరు 1న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి కొంత తెలుగు ప్రాంతం ఆంధ్రరాష్ట్రంగా అవతరించింది.
శ్రీశ్రీ అక్టోబరు 1వ తేదీని కవితా శీర్షికలో ‘ఒకటీ -పదీ’అనీ; కవిత ప్రారంభంలో ‘ఫస్టోబరు’ (ఫస్ట్ + అక్టోబరు) అనీ చమత్కరించారు. ఇప్పుడు అక్టోబరు 1 అనేది పూర్తిగా చరిత్ర పుటలలోనే మిగిలిపోనుంది.
—
కొన్ని సంవత్సరాల క్రితం రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చి ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేశారు. ఈ నిర్ణయం బయటికి రాగానే పెద్దలు శ్రీ వై.ఎస్.నరసింహారావుగారు పొరపాటు జరిగిపోయింది, ఇపుడేం చేయలేం అన్నారు. ఏమిటి అని ఆరాతీస్తే – రాజమహేంద్రి అనేది పాతపేరు; ఈ కొత్త పేరు ‘రాజమహేంద్రవరం’ అని పలకడం కన్నా రాజమహేంద్రి అని పలకడమే హాయి, ఇదివరకు అలాగే పిలుచుకునేవాళ్ళం అని వివరించారు ఆయన!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబరు 1వ తేదీని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకోవడానికి నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. దీనికి ప్రస్తుత ప్రభుత్వాన్ని అభినందించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ విషయం గురించి అసలు ఆసక్తి చూపలేదు కనుక. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కొత్తరాష్ట్రాలు ఏర్పడ్డాయి. కొత్తగా రాష్ట్రం ఏ రోజు అయితే ఏర్పడిందో ఆ రోజు అవతరణ దినోత్సవంగా జరుపుకుంటుంది. కొత్తరాష్ట్రం ఏర్పరచిన తల్లిరాష్ట్రం ఎప్పటిలాగా ఇదివరకు వుండే అవతరణ దినోత్సవం జరుపుకుంటుంది. ఇది సాధారణంగా పాటించే విధానం, అదే పద్ధతిని ఇక్కడ కూడా పాటించి నవంబరు 1నే నిర్ణయించి వుంటారు. నిర్ణయం అయిపోయింది, మంచిది. అయితే చరిత్రలో కలిసిపోయిన విషయాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఏ గందరగోళ పరిస్థితిలో చరిత్రను మరిచిపోయే పరిస్థితి ఏర్పడిందో కూడా చూడాలి.
కె. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఏర్పడిన తెలంగాణాకు, ఆయన ప్రమాణస్వీకారం చేసిన జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం. ఆయన తొలి ముఖ్యమంత్రి కనుక ఈ ప్రత్యేక గౌరవం లభించింది. తెలంగాణ ప్రాంతం పోగా మిగిలిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు. ఇది మాతృరాష్ట్రం కనుక ఇక్కడ జూన్ 8 అవతరణ దినోత్సవం జరుపుకోలేం. అలాగని జూన్ 2 కూడా జరుపుకోవడం వీలుకాదు. చమత్కారంగా జూన్ 2 నుంచి 8 దాక ధర్మపోరాట దీక్షలు 2015 నుంచి క్రమం తప్పకుండా నిర్వహించింది గత ప్రభుత్వం. నిజానికి ఈ తేదీల అంతరార్ధం ఎవరూ బాహాటంగా ప్రకటించలేదు. పైపెచ్చు ఐదు సంవత్సరాలుగా అవతరణ దినోత్సవం అసలు గుర్తుకు రాలేదు, చర్చకు నోచుకోలేదు.
మళ్ళీ ఫస్టోబరు విషయానికి వద్దాం. 1953 అక్టోబరు 1వ తేదీన శ్రీకాకుళం నుంచి నెల్లూరు; నాలుగు రాయలసీమ జిల్లాలు కలిసి అప్పట్లో ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడ్డాయి. 1956 నవంబరు 1న నైజాం తెలంగాణ జిల్లాలు కలసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మరలా ఆ తెలంగాణా జిల్లాలు వేరు రాష్ట్రంగా ఏర్పడటంతో దాదాపు 1953 వీణ ఆకారంలో కనబడే ఆంధ్రరాష్ట్రం మిగిలినట్టు అయ్యింది. బళ్లారి ప్రాంతం, తిరుత్తణి ప్రాంతం 1966లో కోల్పోయిన మాట వాస్తవమే అయినా స్థూలంగా 1953 అక్టోబరు 1 నాటి ఆంధ్రరాష్ట్రమే ఇపుడు మిగిలింది. చారిత్రకంగా తొలుత ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం; అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తర్వాత ఏర్పడిన తెలుగు రాష్ట్రం అనే చారిత్రక సత్యాలను ప్రతిధ్వనించేదిగా అక్టోబరు 1 నిలుస్తుంది.
అవతరణ దినోత్సవం జరుపుకోవాలని ఆలోచించి, ఒక తేదీని నిర్ణయించి ముందుకెడుతున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. పద్ధతి, చట్టం, సంప్రదాయం అనే రీతిలో కాక చారిత్రక దృష్టితో చూస్తే కొరత మిగిలే ఉంటుంది. ముందు ముందు అక్టోబరు ఒకటి చరిత్రపుటలలోనే మిగిలిపోతుంది.
ఇక్కడ మరికొన్ని విషయాలు గుర్తించి ప్రస్తావించాలి. అమరజీవి పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు, కె.ఎల్.రావు వంటి మహాశయుల జయంతులను అధికారికంగా జరపాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ మహానటుడు బళ్ళారి రాఘవ, మహాశాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు, గొప్ప పాత్రికేయులు సి.వై.చింతామణి, ప్రజాకవి వేమన, ప్రజాకవయిత్రి మొల్ల వంటి వారిని కూడా సముచితంగా గౌరవించే ప్రయత్నం చేయాలి. చరిత్ర, శాస్త్ర విజ్ఞాన గ్రంథాలు మరిన్ని వచ్చేలా ప్రభుత్వం దోహదపడాలి.
– డా. నాగసూరి వేణుగోపాల్
మొబైల్: 9440732392
(2019 లో రాసిన వ్యాసం)