ఆకాశవాణి లో నాగసూరీయం-14
కొందరికే కొన్ని విషయాలు గమనించే నేర్పు ఉంటుంది! అదెలా సిద్ధిస్తుందనేది ఇక్కడ విషయం కాదుగానీ, అలాంటి వ్యక్తులతో పనిచేయడం మంచి అవకాశమే! ఇష్టమైన ఉద్యోగం లభించడంతోపాటు, మన సామర్థ్యాన్ని గుర్తించిన సహోద్యోగులతో పనిచేయగలగడం కూడా ముఖ్యమే! ఆ రకంగా నేను అదృష్టవంతుణ్ణే!!
Also read: లేచి వచ్చిన లేపాక్షి బసవడు!
ప్రేరణ నార్ల
తొమ్మిదో తరగతి, లేదా పదో తరగతి చదివే రోజుల్లోనే ‘కాలమ్’ రాయాలి, ‘కాలమ్’ లో నా ఫోటో ఉండాలనే కోరిక కల్గింది! పత్రికలను ఇష్టంగా చదవడమే, చూడటమే దానికి కారణం కావచ్చు. మరి ఆ ఇష్టానికి కారణం? దాన్ని తరచి చూడాల్సి ఉంది! 1977 మే-సెప్టెంబరు నెలల్లో నార్ల వెంకటేశ్వరరావు ‘ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక’లో ‘లోకంపోకడ’ అనే శీర్షికలో కొన్ని వ్యాసాలు రాశారు. అప్పటికి ఆయన ‘ఆంధ్రజ్యోతి’సంస్థ నుంచి తప్పుకున్నారు. ఆయన. తన మిత్రుడు విద్వాన్ విశ్వం కోరితే ఈ కాలమ్ లో రాసిన సమకాలీన వ్యాసాలను పదవ తరగతి చదువుతున్న నేను చాలా ఇష్టంగా అధ్యయనం చేశాను, ఇప్పటికి ఆ వ్యాసాలతో చుట్టుకున్న పుస్తకం నా వద్ద ఉన్నది. ఆ ఇష్టమే జర్నలిజం పై మమకారాన్ని, ప్రేమను పెంచాయి. ఈ కారణం గానే ఇంటర్మీడియట్ చదివే సమయం (1978-80)లో హిందూపురం లోని ఎస్ డి జి ఎస్ కాలేజి లైబ్రరీలో నవమేధావి నార్ల, మూడు దశాబ్దాలు, సీత జ్యోస్యం, జగన్నాటకం, నరకంలో హరిశ్చంద్రుడు, జాబాలి వంటి నార్ల సంబంధించిన పుస్తకాలు చదివాను. అందువల్లనే జర్నలిజం, సైన్స్, తెలుగు అంటే ప్రేమ, మక్కువ, గౌరవం వగైరాలు ఏర్పడ్డాయి.
పరీక్ష బెంగళూరులో, ఇంటర్వ్యూ మద్రాసులో, ఉద్యోగం గోవాలో…
జర్నలిజం చదివే అవకాశాలు అప్పట్లో అంత పెద్దగా లేవు. ఆ విషయాలు గైడ్ చేసేవారు అందుబాటులో లేరు. కనుక సమాంతరంగా, ఆటవిడుపుగా పత్రికలను లోతుగా, క్షుణ్ణంగా పరిశీలించడం అలవాటు చేసుకున్నాను. ఎమ్మెస్సి చదివేకాలంలో రెండు పత్రికల పరీక్షలు రాసి, ఇంటర్వ్వూలకెళ్ళి ఆగిపోయాను. కనుకనే ఎమ్మెస్సి పూర్తి అయ్యింది. ఎంఫిల్ కూడా అయ్యింది. ఆ సమయంలో ఆకాశవాణిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉద్యోగం లభించింది. అలా దొరికింది.. సైన్స్ చదివితే ఆకాశవాణిలో ఉద్యోగం! అది కూడా పోటీపరీక్ష బెంగుళూరులో రాసి, మద్రాసులో ఇంటర్వ్యూ పూర్తి చేస్తే –గోవాలో ఉద్యోగం! అంతా వైవిధ్యమే…ఒకరకంగా జీవన వైదుష్యం!!
Also read: విజయదశమి కనకదుర్గ తెప్పోత్సవం
తొలుత ఉద్యోగంలో చేరింది పనాజీలో, ట్రెక్స్ ఉద్యోగంలో! అంటే ప్రసార సమయంలో ప్రసారానికి సంబంధించిన అన్ని అంశాలను సమన్వయం చేస్తూ సాగే పర్యవేక్షణ అన్నమాట! ఆ ఉద్యోగాన్ని ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అంటారు. అదే సమయంలో ఆ స్థాయి పై అధికారులు అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ల కార్యక్రమాల రూపకల్పనా విధానాన్ని గమనించే అవకాశం కూడా పుష్కలంగా ఉంటుంది. ఏక కాలంలో డజను మంది పెక్స్ ల ఉద్యోగ ఫణతులను దగ్గర్నుంచి గమనించ గలిగాను.
ఏకైక తెలుగు వ్యక్తి
మనమేమో గోవాలోని ఏకైక ఆకాశవాణి కేంద్రంలో ఏకైక తెలుగు వ్యక్తి! అక్కడ ప్రసారాలు అప్పట్లో కొంకణి, మరాఠి, ఇంగ్లీషుల్లో 30 శాతం చొప్పున, మిగతా పోర్చుగీసు, హింది భాషలలో ఉండేవి. ఇప్పటి విషయాలు తెలియవు. అక్కడ ఏకకాలంలో వివిధ భారతి ఛానల్ తో కలసి రెండు ఆకాశవాణి ఛానళ్ళను మానిటర్ చేసే సౌలభ్యం – సిబ్బంది కొరత వల్ల ఉండేది. ఇంగ్లీషు పెద్దగా రాదు, హిందీ గొప్పగా తెలీదు. మిగతా భాషలు ఏవీ మనకు తెలియవు. అదీ మన వ్యథతో కూడిన కథ.
Also read: అనంతపురం పల్లెకళల దిగంతం!!
గోవాలో ఉద్యోగంలో చేరిన పదిహేను, ఇరవై రోజుల తర్వాత అక్కడి స్టేషన్ డైరెక్టర్ శ్రీమతి వసంతకుమారి ఒకసారి నన్ను పిలిపించారు. ఆమె మంగుళూరుకు చెందిన కన్నడ వ్యక్తి, ఇంగ్లీషు లెక్చరర్ ఉద్యోగం వదలి ఆకాశవాణిలో ట్రెక్స్ గా చేరి స్టేషన్ డైరెక్టరు అయ్యారు. కొంకణి, మరాఠీ భాషలను ఎంత పికప్ చేశారు… అని అడిగారు. వెర్రిమొహం వేసుకుని బిత్తరపోయాను. తెలియనపుడు, చేతకానపుడు హాయిగా నవ్వాలనే లౌక్యం కూడ తెలియని అమాయకపు రోజులవి!
పరిశీలనాశక్తి
మరి ఏమి గమనించారని ప్రశ్న వంటి చూపు ఆమె నుంచి ఎదురయ్యింది. కొంకణి, మరాఠీ భాషలను గుర్తించగలనని, అది ఎలా సాధ్యమో వివరించాను. మరాఠీలో శబ్దాల ముగింపులు కేకు కట్ చేసినట్టు, మెట్లలా అనిపిస్తాయి. కొంకణి దీనికి పూర్తిగా విరుద్ధం! పదాల చివరలు పక్షులు ఎగిరినట్టు సున్నితంగా పైకి లేస్తాయి. ఈ తేడాను నాకు వచ్చిన ఇంగ్లీషులో (గందరగోళంగా) వివరించాను. దీనికి ఆవిడ చాలా సంతోషపడి, పరిశీలనా ప్రతిభకు ముచ్చటపడి. తెలుగువారు ఇతర భాషలను త్వరగా నేర్చుకుంటారు అనే ఒక సూత్రీకరణ కూడా చేశారు!
Also read: జంట ప్రసంగాల కదంబం – బొమ్మా, బొరుసా
ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, మనకు భాష రానపుడు నోరు రెస్టు తీసుకుంటుంది కనుక కళ్ళు, బుర్ర చురుకుగా పనిచేస్తాయని కూడా వివరించడం! కళ్ళు స్వీకరించిన సమాచారాన్ని, మెదడు మరింతగా విశ్లేషణ చేస్తుంది! అలాగే తెలియని దానిని తిరస్కరించడం కూడదు, పరిశీలించాలి, గౌరవించాలి అని బోధపడ్తుంది! అలా ఆ ప్రాంతపు సంస్కృతిని, జీవనశైలిని, మతసంబంధమైన విషయాల్ని గమనించి ఉంటాను.
మూడేళ్ళ గోవావాసం
ట్రెక్స్ గా ప్రసార బాధ్యతను నిర్వహిస్తూనే, అందులో ఇతర కార్యక్రమాల అధికారులు ఎలా పనిచేస్తున్నారో కూడా పరిశీలించాను. ఏ పెక్స్ మనకు రోల్ మోడల్ కాగలరు, అలా అయితే ఎంత శాతం అని నేనే బేరీజు వేసుకునేవాడిని. అలాగే ఎవరు పరమచెత్తగా ఉద్యోగం చేస్తున్నారో కూడా గమనించ గలిగాను. భాష, వ్యక్తీకరణతో పాటు వీటికి మించి అధ్యయనం, ప్రణాళిక, ప్రణాళికాపరమైన నిర్వహణ అనేవి కూడా చాలా ముఖ్యం అని పరిశీలన ద్వారా తెలుసుకున్నాను. గోవాలో ఉన్న మూడేళ్ళలో రెండు, మూడు లేదా మూడో, నాలుగో ప్రోగ్రామ్స్ చేసి ఉంటాను. కానీ, ఎలా ప్రోగ్రామ్స్ చేయాలో, ఎలా చేయకూడాదో, ఎందుకు అలా చేయకూడదో కూడా తెలుసుకోగలిగాను!
మూడేళ్ళు గోవావాసం తర్వాత యూ పి ఎస్ సి గుండా నేరుగా సెలెక్ట్ అయ్యి తెలుగు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా తెలుగు ప్రాంతానికి 1991 ఏప్రిల్ 11న వచ్చాను. పరభాషా ప్రాంతాలలో ఉండటం వల్ల తెలుగు మీద అభిమానం పెరిగింది… ఎక్కువ కార్యక్రమాలు చేయలేదు కనుక రేడియో మాధ్యమం మీద అభిమానం పెరిగింది…రేడియో మాధ్యమం చేయగల కార్యాల మీద మక్కువ పెరిగింది. అనంతపురం కేంద్రం వ్యవస్థాపన కార్యక్రమంలో నా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఉద్యోగంతో మొదలైన నా ఆకాశవాణిపర్వం – మూడు రాష్ట్రాలలో, పది బదిలీలతో నా కార్యక్రమ ప్రసార రథం పదిలంగా సాగిపోయింది. ఆకాశవాణి ప్రతిభావంతుడు అని నేను పరిగణించే కేవీ హనుమంతరావు- పరిశీలించి, వ్యాఖ్యానించినట్టు – నేను ఎంజాయ్ చేస్తూ ఉద్యోగం చేశాను!
Also read: చిరస్మరణీయమైన ‘వెలుగుజాడ’ ధారావాహిక!
–డా నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, హైదరాబాద్
మొబైల్: 9440732392