Sunday, December 22, 2024

ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

  • క్లాసులు జరగనందున పీజులు తగ్గించాలని డిమాండ్
  • ససేమిరా అంటున్న స్కూల్ యాజమాన్యం
  • వ్యక్తిగత బ్యాంక్ స్టేట్ మెంట్లు తీసుకురమ్మంటున్న స్కూల్ యాజమాన్యం
  • మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
  • రాజకీయ రంగు పులుముకున్న వివాదం
  • సీన్ లోకి స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు

గచ్చిబౌలి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారంనాడు ఆందోళన చేపట్టారు. కరోనా నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తల్లి దండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఉద్యోగాలు కూడా కోల్పోయారనీ, అందువల్ల ట్యూషన్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని తల్లిదండ్రులు కోరారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు మాత్రమే హాజరవుతున్నారని ఈ సందర్భంగా పేరెంట్స్ గుర్తు చేశారు. రెగ్యులర్ క్లాసులు జరగడం లేదు కనుక క్లాసుల నిర్వహణకు అయ్యే కరంటు ఖర్చులు, స్యూల్ మెయింటినెన్స్, లైబ్రరీ నిర్వహణ, ఇంటర్నెట్ తోపాటు క్రీడలకు సంబంధించిన ఫీజులలో రాయితీ కల్పించాలని తల్లిదండ్రులు కోరారు.

బ్యాంక్ అకౌంట్ల స్టేట్ మెంట్లు అడిగిన యాజమాన్యం

దీనికి స్పందిస్తూ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల వ్యక్తిగత బ్యాంక్ స్టేట్ మెంట్లు అడిగింది. బ్యాంక్ స్టేట్ మెంట్లు అడిగి తమ నోరు నొక్కేస్తున్నారనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేట్ మెంట్లు ఇచ్చేది లేదనీ పేరెంట్స్ స్పష్టం చేశారు.  తమ వ్యక్తిగత సమాచారంతో స్కూల్ యాజమాన్యానికి పనేంటని ప్రశ్నించారు.

ప్రభుత్వం జీవో నంబరు 46 ను ఏప్రిల్ లో విడుదల చేసింది. ఇది సాధారణ విద్యా సంవత్సరానికి ఉద్దేశించబడింది. కొవిడ్ నేపథ్యంలో ఆ సమయంలో సంవత్సరమంతా ఆన్ లైన్ క్లాసులు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. ఆన్ లైన్ క్లాసులకు కూడా రెగ్యులర్ క్లాసులకు కట్టాల్సిన ఫీజులను వర్తింపజేస్తే ఎలా కడతామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ తరగతుల కోసం లాప్ టాప్ లు కొనాల్సి వచ్చిందనీ, ఇంటర్నెట్, కరంటు బిల్లుల ఖర్చు పెరిగిందనీ ఉద్యోగాలు చేస్తూ పిల్లలను ఎలా చదివించగలమనీ తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనితో తన ఉద్యోగాన్ని వదిలేసుకున్నట్లు ఓ విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫీజుల పేరుతో దోపిడీ

కరోనా సమయంలో కూడా ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ప్లకార్డుల ప్రదర్శిస్తూ స్కూల్ ముందు నిరసన చేపట్టారు. స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను చేస్తున్న బ్లాక్ మెయిలింగ్ ఆపాలని డిమాండ్ చేశారు.

క్లాసులు జరగక పోయినా లక్షల ఫీజులు ఎలా చెల్లించాలంటూ తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యంతో మాట్లాడేందుకు స్కూల్  సిబ్బంది ఎవరూ లేరని అంటున్నారు. మాకు న్యాయం జరిగేవరకు స్కూల్ ఎదుటే బైఠాయించి నిరసన తెలుపుతామన్నారు తల్లిదండ్రులు.

ఓక్రిడ్జ్ స్కూల్ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక కాంగ్రెస్, బీజేపీ నేతలు జోక్యం చేసుకున్నారు. పోలీసులు కూడా రావడంతో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles