(విశ్వకవి గీతానికి ……..అనువాద సుమాంజలి )
ముందుగా
నీ గేహాన్ని
ప్రేమార్ద్ర పరిమళాలతో నింపుకో !
అప్పుడే
గుడిలో భగవాన్ పాదాల చెంత
పూల గుత్తులలంకరించేందుకు
అర్హుడవవుతావు !!
మొదటగా
నీ గుండె గూటిలో
పాపాల చీకట్లు , గర్వాంధకారాలు
మటుమాయం చేసుకో !
అప్పుడే
ఆ దివ్యతేజో మూర్తి ముందు
నీ దివ్వె వెలిగించ గలవు!!
నీ సహచరుల పట్ల వినమ్రతతో
తల దించుకో !
నీ నేరాలకు బలైన వారిని
మనస్ఫూర్తిగా
క్షమాపణలు కోరు !
అప్పుడే
ఆలయములో
ఆ సర్వాంతరయామికి
శిరస్సు వంచి వందనం చేసుకో !!
మున్ముందుగా
మోకాళ్ళు వంచి
నీ అధో జగత్ సహోదరులకు
చేయూతనివ్వు
యువక రక్తాన్ని
ఉత్సాహంతో
ఉరకలెత్తించు !
అప్పుడే
ఆ దైవాన్ని
నీ మోకాళ్ళ మొక్కులతో
పూజించుకో !!
నీ పాపాల కూపాలను
స్వఛ్ఛ జలం చేయమని
దేవుణ్ణి
నువ్వడిగే ముందు
నీ సహచరుల తప్పులను
మనసారా క్షమించేయ్ !!
Also read: బంధన ఛేదిత – ఊర్వశి