తెలుగుదేశం! ఒక పార్టీ పేరు? – అని ఎంతోమంది ఆశ్చర్యపోయారు. పార్టీకి ఇదేం పేరని బుగ్గలు నొక్కుకున్నారు. 1982లోఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారని విషయం ఊహాగానంగా మొదలై, దినపత్రికల్లో తొలి పుటలో ప్రధాన వార్తగా మారింది. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు ధ్రువపడింది కానీ, పార్టీ పేరు అసలు బయటకు రాలేదు. అంతవరకు పార్టీల పేర్లు ఎలా ఉండేవో అందరికీ తెలుసుకనక, అదే స్థాయిలో ఎవరికి వారు భావించారు. అంతకు ముందు మర్రిచెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితి పార్టీ ప్రారంభించారు. ఒక వాదం, ఆలోచన, ఆదర్శం, ప్రాంతం ఆధారంగా పార్టీల పేర్లు ఉన్నాయి కానీ భాషా ప్రాతిపదికన రాలేదు. ఇటువంటి నేపథ్యంలో ఒక మూసను దిగ్విజయంగా పగలగొట్టి ముందుకొచ్చారు ఎన్టీఆర్!
ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నవారికి తెలుగు భాష గురించి కానీ, ఆ భాష ప్రాధాన్యత కానీ తెలియకపోవచ్చు. కానీ మదరాసులో చాలాకాలం ఉన్న ఎన్టీఆర్ కు తమిళుల భాషాభిమానం తెలిసి ఉంటుంది. నాలుగు దక్షిణాది రాష్ట్రాల సినిమాలకు కేంద్రస్థానమైన మదరాసులో తన భాష పరిస్థితి మాత్రమే కాదు, తెలుగు భాషకు ఉండే ప్రాధాన్యత కూడా బాగా తెలిసిన ఎన్టీఆర్ కు భాష ఆధారంగా రాజకీయాలు నడపాలని తలంపు రావండం సహజమే! భారతీయ సినిమా పటంలో తమ గురించి ఆలోచించినప్పుడు భాషాపరమైన వర్గీకరణే ప్రధానంగా ఉంటుంది. ఒడిశా, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో ఎంతోమంది అభిమానులను కలిగి ఉన్న ఎన్టీఆర్ కు భాషకు ఉన్న బలం ఏమిటో బాగా తెలిసి ఉండాలి. తొలుత నోరెళ్ళబెట్టిన ప్రముఖులు క్రమంగా సర్దుకోక తప్పింది కాదు. రామారావు రాక జాతీయస్థాయి రాజకీయ వార్త కావడంతో తెలుగు అనే పదం బహుళ స్థాయిలలో వినిపించడం మొదలైంది.
Also read: కరోనా వేళ మరో పదం కోసం అన్వేషించండి!
అంతకు ముందు ఢిల్లీస్థాయిలో చూస్తే దక్షిణాది వారంతా మదరాసీలే! కేవలం రామారావు ప్రవేశంతో భారతదేశంలో తెలుగు అనే భాష ఉందని ఎంతోమందికి బోధపడింది. ఎన్టీఆర్ ను తీవ్రంగా విమర్శించేవారు కూడా దీన్ని ఒప్పుకోక తప్పదు. నిజానికి తెలుగుదేశం ప్రకటన రాగానే ఇండియా టు డే – అప్పటి ఆంగ్ల పక్షపత్రిక – శంఖారావం చేస్తున్న శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ముఖచిత్రం వేసింది. తెలుగు కృష్ణుడు ఇంత అందంగా ఉంటాడని దేశప్రజలందరికీ కాకపోయినా మేధావులందరికీ బోధపడింది.
తొలిదశలో ప్రతీపేరులో తెలుగు పదం తగిలించడంతో ‘తెలుగు బహిర్భూమి’ వంటి సెటైర్లు కూడా అప్పట్లో వచ్చాయి. ఒక దశలో రాష్ట్రం పేరును ‘తెలుగునాడు’గా మార్చాలనే వాదన కూడా మొదలైంది. అప్పట్లో ఈనాడు దినపత్రిక తెలుగుదేశం అనే దానికి పర్యాయపదంగా ఉండేది. తెలుగుదేశంలో తొలిపదం, ఈనాడు చివరి రెండు అక్షరాలు కలసి రాష్ట్రం పేరుగా మారుతోందని వీరి పొడగిట్టనివారు ప్రచారం కూడా మొదలుపెట్టారు.
2012లో తెలుగు భాష అనేది రాజకీయ అంశంగా మారింది. ప్రతీ రాజకీయ పార్టీ ఏదో రకంగా భాష గురించి మాట్లాడటం అలవాటయ్యింది. నిజానికి ఈ ధోరణి 1982 నుంచే మొదలై ఉండాలి. ఎందుకో రామారావుకు ఉన్నంత భాషా దృష్టి రాష్ట్రవాసులకు లేకపోయిందని మనం చెప్పుకోక తప్పదు. నిజానికి ఎన్టీఆర్ దృష్టిలో తెలుగు భాష అనేది మాత్రమే కాక ప్రజా సంస్కృతి అయి ఉండాలి. అందుకే పార్టీకి ఆ పేరును అలా స్థిరం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని ప్రత్యేకంగా యూనివర్సిటీ ప్రారంభించింది కూడా ఆయనే.
రామారావుకు ఆవేశం, మొండితనం ఉండవచ్చు. కానీ ఆయన చిత్తశుద్ధిని శంకించలేం. ఆయన … చూపిన చైతన్యంలోని స్ఫూర్తిని మన మేధావులు సరిగా అందుకొని ఉంటే తెలుగు విశ్వవిద్యాలయం ఇలా ఉండేది కాదు. ఈ విషయాన్ని లోతుగా చర్చిస్తే కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ, గతాన్ని విశ్లేషించేటప్పుడు వాస్తవాలు కరుకుగా చెప్పినా ఫర్వాలేదు.
ఆలోచనలు ఆయనవా? ఎవరో సలహాదారులు ఇచ్చి ఉంటారు కదా అనే వాదన కూడా ఉంటుంది. ఆలోచనలలోని ఆంతర్యాన్ని, దార్శనికతను అందుకోవడం కూడా దార్శనికతే అవుతుంది. మహిళలకో విశ్వవిద్యాలయం ప్రారంభించడం మనదేశంలోని ఇతర రాష్ట్రాల్లో అలాంటి ప్రయత్నాలకు స్ఫూర్తి అయ్యింది. అలాగే భాషల కూడలి అయిన మదరాసులో ఎంతోకాలం ఉన్న రామారావు నాలుదు దక్షిణ భాషలకో విశ్వవిద్యాలయం మొదలు పెట్టడం కూడా అర్థవంతమైంది. ద్రావిడ విశ్వవిద్యాలయం ఎంత విభిన్నంగా మొదలైందో, క్రమంగా అంతే గందరగోళంగా ఆశయాలు మరచిపోయి అయోమయాన్ని మిగిల్చింది.
రామారావు అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర మరోవైపు తెలంగాణ – అన్ని ప్రాంతాలవైపు దృష్టి పెట్టారు. సినిమా కలెక్షన్లకు సంబంధించి ప్రాంతాల అభిమానం ఏమిటో ఆయనకు తెలుసు. అగ్రవర్గాలైన కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ కులాలు కాకుండా ఎన్నో ఇతర కులాల యువ నాయకులను, చదువుకున్న యువతను ఆయన ఆదరించారు. అలా అవకాశాలు లభించిన వారంతా నేడు పెద్ద నాయకులుగా ఉన్నారు. దళిత, బహుజన భావనలు గురించి ఆయనకు స్పష్టత ఉంది. వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాలో కక్కడు, సిద్ధయ్య పాత్రలను దీనికి గొప్పగా వినియోగించుకున్నారు. కక్కని పాత్ర నిజంగా చాలా ఎలివేట్ అయ్యింది. మామూలుగా హీరో ఎన్టీఆర్ మరో పాత్రను అలా విజృంభించనీయడనే విమర్శ ఉంది. ఇదేలా సాధ్యమైంది? తన రాజకీయ భావనలకు ప్రచారం కల్పించాలని కథానాయకుడిగా రాజీపడి ఉండాలి.
అయితే ఈ ఆదర్శాలన్నీ ప్రస్తుతం ఆ పార్టీలో , దాని విధానాలో ఎంతమాత్రం ఉన్నాయో తెలియదు కానీ – ఎన్టీఆర్ చిత్తశుద్ధిని వందశాతం గౌరవించాలి సుమా!
Also read: నేడు రాజ్యాంగ రూపకల్పనకు మూలమైన జాతీయోద్యమ స్ఫూర్తి ఎక్కడ?
(రచయిత మొబైల్: 9440732392)