- తెలుగు భాషకు ప్రతిరూపం ఎన్. టి.ఆర్
- ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీ రావు
- ఘనంగా ఎన్ టి ఆర్ శత జయంతి మహోత్సవం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, మే 28: క్రమశిక్షణ, పట్టుదల, సంస్కారానికి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రతీక అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్ దిల్లీ రావు అన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు ఆధ్వర్యాన శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశన చేసి ప్రారంభం చేసిన దిల్లీరావు మాట్లాడుతూ, తెలుగు భాష,సంస్కృతులకు రామారావు ప్రతీకగా నిలుస్తారు అన్నారు. రామారావు వ్యక్తిత్వం సర్వోన్నతమైనదని, ఆయన ఆదర్శం నేటి తరాలు అందిపుచ్చుకోవాలన్నారు. దివంగత ఎన్టీఆర్ ప్రారంభించిన గురుకుల పాఠశాలలో తాను చేసిన విద్యాభ్యాసం ఈ రోజున కలెక్టర్ గా ఎదగడానికి పునాదిగా నిలిచిందన్నారు. మహిళలకు రిజర్వేషన్లు, వారసత్వ హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుభాషకు గుర్తింపు తీసుకువచ్చింది కేవలం రామారావు మాత్రమే అన్నారు. రామారావు పేరుతో ఏర్పడ్డ జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్ గా ఎంపిక కావడం తాను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కేవలం సినిమా నటుడిగా మాత్రమే కాకుండా రాజనీతిజ్ఞుడిగా, భాష ప్రేమికుడిగా, ప్రజాపాలన పట్ల చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా రామారావు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పట్టేటి రాజశేఖర్ మాట్లాడుతూ, రాజకీయాలను బడుగు బలహీన వర్గాలకు చేరువ చేసింది రామారావు మాత్రమే అన్నారు.ఆయన రాజకీయాల్లోకి రాకపోతే నేటికీ బడుగు బలహీన వర్గాలు రాజకీయాలకు దూరంగా ఉండేవన్నారు. ఇప్పటికీ రామారావు ఆశయాలను పీడిత ప్రజలు మాత్రమే ఆచరణలోకి తీసుకువస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ సతీమణి,ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ రామారావులోని పట్టుదల తనకు వారసత్వంగా వచ్చిందన్నారు. తన భర్తకు కళలు, సాహిత్యం, సంస్కృతి అంటే ఎంతో ప్రేమ అని, కవులను కళాకారులను ఎంతో గౌరవించేవారని చెప్పారు. ఆయన ఆశయాలను ఆచరణలో తీసుకువచ్చే క్రమంలో ఎన్ టి ఆర్ జాతీయ పురస్కారం లక్ష రూపాయల నగదుతో అందిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ప్రముఖ విద్యావేత్త ఐఏఎస్ అధికారి వాడ్రేవు చిన వీరభద్రుడుకి ఎన్ టి ఆర్ సాహిత్య పురస్కారం అందించామని, ఈ ఏడాది భారతీతీర్థ పురస్కార గ్రహీత, సంస్కృతాంధ్ర విద్వాంసులు శలాక రఘునాథశర్మను ఎన్టీఆర్ సాహిత్య పురస్కారానికి ఎంపిక చేశామన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ వరప్రసాద మూర్తి సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుభాషకు చేసిన సేవలను కొనియాడారు.ఎన్టీఆర్ తెలుగు భాషకు,సాహిత్యానికి,కళలకు చేసిన సేవలను గుర్తిస్తూ, ఆ అంశాలలో రెండు రోజులపాటు జాతీయ సదస్సును తమ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సంస్కృతాంధ్ర శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగు భాష వినిపించినంత వరకూ ఎన్ టి ఆర్ చిరంజీవిగా ఉంటారన్నారు.ఎన్.టి.ఆర్ చేసిన భాషా సేవను ప్రశంసిస్తూ ఆయన చెప్పిన పద్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. రిజిస్ట్రార్ డాక్టర్ బి. కరుణ, ఏఎన్ యూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి,తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
విఖ్యాత సంస్కృతాంధ్ర విద్వాంసులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, మహామహోపాధ్యాయ ఆచార్య రఘునాథ శర్మను ఎన్టీఆర్ సాహిత్య పురస్కారంతో ఘనంగా సత్కరించారు. రఘునాథ శర్మ తనకు జరిగిన సన్మానానికి ప్రతిస్పందిస్తూ కేవలం సినిమా నటుడిగా మాత్రమే కాకుండా తెలుగుభాషను ఆసాంతం తన రక్తంలో నింపుకున్న భాషా ప్రేమికుడుగా ఎన్టీఆర్ ను అభివర్ణించారు. ఎన్టీఆర్ పేరుతో పురస్కారాన్ని అందుకోవటం తనకు అత్యంత ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. క్రమశిక్షణకు ఎన్టీఆర్ మారుపేరని,చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూసి, ఆయనకు అభిమానిగా మారినట్లు చెప్పారు.
ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివరావు, తెలుగు సంస్కృత అకాడమీ గవర్నింగ్ బాడీ మెంబర్ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ కార్యక్రమాన్ని నిర్వహించారు.