Tuesday, January 21, 2025

అసాధారణమైన సాహసి రామారావ్

ఎన్ టి ఆర్ వర్థంతి ఈ రోజు

(కె రామచంద్రమూర్తి పుస్తకం ‘ఎన్ టీ ఆర్ రాజకీయజీవిత చరిత్ర’ నుంచి కొన్ని భాగాలు చూడండి)

ఎన్ టి రామారావ్ అమరుడు. ఆయన పనులు మంచివో కాదో చరిత్ర వివరిస్తుంది. కొత్తగా సర్టిఫికెట్ అవసరం లేదు. అద్భుతమైన జీవితం ఆయనది. మొత్తం దేశం మరిచిపోలేని నాయకుడు. ఎన్టీఆర్ చాలా కోణాల్లో చెప్పుకోదగిన వ్యక్తి. పదవులకోసం కుట్రలు జరుగుతున్నాయని తెలిసినా చివరి దశలో రామారావ్ చాలా ప్రశాంతంగా జీవితాన్ని ముగించారు. ఆ తెల్లవారుఝామున ఆయన మరణించిన రోజున ముందుగా వచ్చిన కొందరిలో ఈ రచయితైన నేను ఒకడిని. ద్రోహానికి బలి అయిన ఎన్ టి ఆర్ ఆఖరి క్షణాల గురించి జనవరి 18 నాడు రాయడం మామూలే. కాని ఆయన గొప్పతనాన్ని కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది. చాలా గొప్ప రచయితలు చరిత్రకారులు ఎన్టీ ఆర్ పుస్తకాలు వచ్చాయి. కాని ఖచ్చితంగా ఉన్నట్టు ఉన్న జీవిత కథ జర్నలిస్టు కే రామచంద్రమూర్తి పుస్తకం వాస్తవానికి దగ్గరలో ఉంటుంది కనుక కొన్ని అంశాలను సేకరించిన ఈ అంశాలు పాఠకుల ముందు ఇవి. 

మాటకోసం అంజలిపై ధిక్కారం 

ఎన్ టీ ఆర్ అసాధారణమైన సాహసి. సినిమా జీవితం ప్రారంభంలో రెహ్మాన్ అనే ఒక కెమెరామన్ కు ఇచ్చిన మాట కోసం అప్పటికే కథానాయికగా స్థిరపడిన అంజలీదేవిని ధిక్కరించారు. ఆస్ట్రేలియా ఎద్దుతో సినిమాలో ఆయన పోరాటం గురించి కథలుగా చెప్పుకుంటారు. ప్రమాదపుటంచులలో నడవడానికి జంకరు. కావలసినవారు వద్దని వారించినా రాజకీయ పార్టీ పెట్టడం గొప్ప సాహసం. ముఖ్యమంత్రిగా ప్రజలు వ్యతిరేకించే నిర్ణయాలు చాలా తీసుకున్నారు. మంత్రివర్గంలోని మొత్తం 31 మందికీ ఒక్క దెబ్బతో ఉద్వాసన చెప్పారు. అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు ఎదుర్కొనడానికి ఆయన ఎప్పుడైనా సిద్ధమే. ఇందిరాగాంది హత్య అనంతరం రాజీవ్ గాంధీ పట్ల, కాంగ్రెస్ (ఐ) పట్లా సానుభూతి పవనాలు వీస్తున్న సమయంలో సైతం ఎన్నికలు కోరి తెచ్చుకున్నారు. విజయం సాధించారు.

పేదరికం అనుభవించిన మనిషి

        ఎన్ టీ ఆర్ స్వశక్తిపైన పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఒక గొప్ప కళాకారుడు. నిరుపేదలకూ, పీడితులకూ, అధోజగత్సహోదరులకూ కొత్త జీవితం ప్రసాదించాలని ఆరాటపడిన రాజకీయవేత్త. స్వయంగా పేదరికం అనుభవించిన మనిషి. డబ్బు విలువ తెలిసినవాడు. కష్టపడి పని చేయడంలో, క్రమశిక్షణగా జీవించడంలో విశ్వాసం ఉన్న వ్యక్తి. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో, కష్టపడి ప్రయత్నిస్తే అసాధ్యమేమీ లేదని అటు సినిమా ప్రపంచంలోనూ, ఇటు రాజకీయాలలోనూ రాణించి నిరూపించిన మహానుభావుడు. రాజకీయాలలో ప్రవేశించకపోతే పురాణ పాత్రలలో జీవించిన ఎన్ టీ ఆర్ ను ప్రజలు దేవుడి రూపంలో  గుర్తుపెట్టుకునేవారు.

తెలుగు వెలుగు వేరేనన్న రుజువు

       రాజకీయాలలో చేరడం ద్వారా మరో సామ్రాజ్యాన్ని జయించారు. దానిపైన తన సంతకాన్ని అందంగా చేసి వదిలివెళ్ళారు. దశాబ్దాలుగా తెలుగువారూ, మద్రాసీలూ ఒకటేనని ఉత్తరాది జనం అనుకుంటూ ఉన్నపరిస్థితులలో తెలుగువారు వేరేననీ, తెలుగు జాతి వేరేననీ, తెలుగు వెలుగు వేరేననీ నిరూపించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి జాతీయ స్థాయిలో పెద్దపీట వేశారు. తెలుగుజాతిపట్ల, తెలుగు భాష పట్లా, తెలుగు సంస్కృతి పట్లా ఆయన అంకితభావం సాటిలేనిది. సినిమాలోనూ, రాజకీయాలలోనూ అసాధారణ వ్యక్తిగా, ఒక లెజెండ్ గా నిలిచిపోయారు. ఆయనతో పోల్చదగిన వ్యక్తి మరొకరు లేరు.

ఏకపార్టీ ఆధిపత్యాన్ని ఎదిరించిన కథానాయకుడు

        భారతీయ సినిమారంగానికీ, రాజకీయరంగానికీ ఎన్ టీ ఆర్ చేసిన సేవలను ప్రభుత్వాలు గుర్తించినా, గుర్తించకపోయినా ఏకపార్టీ ఆధిపత్యాన్ని ఎదిరించి పోరాడటానికి అవసరమైన ధైర్యం, లాఘవం, మెలకువలు, స్ఫూర్తి ప్రదర్శించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. పేదలనూ, పీడితులనూ ఉద్ధరించాలన్న అంకితభావంలో ఆయన ఎవ్వరికీ తీసిపోరు. ఎన్ టీ ఆర్ కు ముందు కానీ, ఆయన తర్వాత కానీ ముఖ్యమంత్రులుగా పని చేసినవారిని ఆయనతో పోల్చడానికి వీలులేదు. 

వస్త్రధారణలో, వ్యక్తిత్వంలో, అలవాట్లలో, సంభాషణలో ఆయన నూటికి నూరు పాళ్ళు పదహారణాల తెలుగువారు. 1983లో ఎన్ టీ ఆర్ అసాధారణ విజయం సాధించి, జాతీయ ప్రతిపక్షాన్ని ఏకం చేయడానికి నడుం బిగించడానికి ముందు ఉత్తరాదివారికి తెలుగువారంటే మద్రాసీలే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, పట్టాభిసీతారామయ్య, టంగుటూరి ప్రకాశం  పంతులు,  గదర్ పార్టీ వీరుడు దాసరి చంచయ్య, రాష్ట్రపతులుగా పని చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ, వరాహగిరి వెంకటగిరి, నీలం సంజీవరెడ్డి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు, తదితర తెలుగు ప్రముఖులు జాతీయ స్థాయిలో అప్పటికే వెలిగినప్పటికీ తెలుగుదనాన్నీ, తెలుగువారి వ్యక్తిత్వాన్నీ ఎన్ టీ ఆర్ అంత శక్తిమంతంగా వారెవ్వరూ ఆవిష్కరించలేకపోయారు.  భరత జాతి అస్థిత్వంపైనా, రాజకీయాలపైన తెలుగుముద్రను ఎన్ టీ ఆర్ బలంగా, ఎప్పటికీ చెరిగిపోకుండా వేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించిన మనీషిగా ఎన్ టీ ఆర్ ను రాబోయే తరాలు గుర్తు పెట్టుకుంటాయి. సినిమాలలో, రాజకీయాలలో  తెలుగువారి కీర్తి పతాకను హిమాలయం ఎత్తున ఎగురవేసిన కథానాయకుడుగా ఆయన ఎప్పటికీ మహోజ్వలంగా వెలుగుతూనే ఉంటారు.

గెలిచినా ఓడినా చెక్కుచెరగని ధీరుడు ఎన్టీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎన్నికల తీర్పులో 1957 నుంచీ ఎటువంటి సందిగ్థతా లేదు. వారు ఎల్లప్పుడూ నిర్ణయాత్మకంగానే ఓటు చేశారు. ఎప్పుడూ ఏ పార్టీకీ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. పోయిన రెండు విడతలా – 1983లోనూ, 1985లోనూ- టీడీపీకి సంపూర్ణంగా ఓటు వేసి గెలిపించారు. ఈ సారి కూడా ప్రజలు అంతే స్పష్టతతో ఓటు చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రేడియోలో మధ్యాహ్నం వస్తున్న వివరాలను కొంతకాలం ఆలకించిన ఎన్ టీఆర్ గదిలోకి వెళ్ళి పడుకున్నారు. అప్పుడు డ్రాయింగ్ రూంలో ఎన్ టీఆర్ సహాయకుడు గోటేటి రామచంద్రరావు ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకి ఎన్ టీఆర్ గదిలో నుంచి బయటికి వచ్చారు. కల్వకుర్తిలో దారుణంగా ఓడిపోయారనీ, హిందూపురంలో మాత్రం మంచి మెజారిటీతో గెలిచారనీ గోటేటి చెప్పారు. ఆ వార్త వినినప్పుడు ఎన్ టీఆర్ నిశ్శబ్దంగా, తోట్రుపాటు లేకుండా నిశ్చలంగా ఉన్నారు.(కె రామచంద్రమూర్తి రచన తొమ్మిదో అధ్యాయం)

ఎన్ టీ ఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి

తెలుగుదేశం పార్టీలో అసమ్మతికీ, తుదకు తిరుగుబాటుకూ బీజాలు లక్ష్మీపార్వతి అనే మహిళ ఎన్ టీ ఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత ఆయన జీవితంలో మలుపులూ, ఎగుడుదిగుడులూ సంభవించినప్పుడే పడ్డాయి. 1984న తన తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆర్థికమంత్రి నాదెండ్ల భాస్కరరావు నేతృత్వంలో జరిగిన తిరుగుబాటును ఎన్ టీఆర్ జయప్రదంగా తిప్పికొట్టారు. ఎన్ టీఆర్ కి కలిసి వచ్చిన జనాకర్షణశక్తీ, జనామోదం అప్పటికి అభేద్యంగా, పటిష్ఠంగా ఉన్నాయి. తన కుటుంబసభ్యులు వెన్నుదన్నుగా నిలిచారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో అల్లుళ్ళు తిరుగుబాటుదారులతో పోరాటంలో తనకు తోడునీడగా ఉన్నారు. పర్వతనేని ఉపేంద్ర సకారాత్మకమైన భూమిక పోషించారు.  జాతీయ ప్రతిపక్షాలన్నీ, మీడియారంగంలో ప్రముఖులందరూ, ప్రజాదరణ కలిగిన హక్కుల కార్యకర్తలూ ప్రజాస్వామ్య పరిరక్షణ కృషితో తనతో పాటు ప్రయాణం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను ఆరాదించేవారు. తనను అధికారంలో నిలబెట్టడంకోసం ఎంత దూరం వెళ్ళడానికైనా వారు సిద్ధంగా ఉన్నారు. స్థానిక, జాతీయ పత్రికలు తనతోనే ఉన్నాయి.

కత్తులు దూశారుకుమారులూ, కోడళ్ళూ, కుమార్తెలూ, అల్లుళ్ళూ

రెండో సంక్షోభం కూడా తన తర్వాత స్థానంలో ఉన్న ఆర్థికమంత్రి నాయకత్వంలోనే రూపుదిద్దుకుంది. కానీ పరిస్థితులు పూర్తిగా భిన్నం. తిరుగుబాటుకు బయట నుంచి కుట్ర జరగలేదు. తిరుగుబాటుదారులూ, వారి ప్రేరకులూ, తిమ్మినిబమ్మిని చేసినవారూ అంతా కుటుంబ సభ్యులూ, సన్నిహితులే. వారికి చంద్రబాబునాయుడు నాయకత్వం వహించారు. డెబ్బయ్ ఒక్క సంవత్సరంలో తమకు ఇష్టం లేని వ్యక్తిని తెగించి వివాహం చేసుకున్నందుకు ఎన్ టీఆర్ పైన తన కుమారులూ, కోడళ్ళూ, కుమార్తెలూ, అల్లుళ్ళూ కత్తులు దూశారు. పోయిన ఎన్నికలు జరిగి సంవత్సరం కూడా కాలేదు కనుక మరో ఎన్నికలను ఎదుర్కోడానికి సిద్ధంగా లేని మిత్రపక్షాలూ, ప్రతిపక్షాలూ తిరుగుబాటుదారులనే సమర్థించాయి. తొలి తిరుగుబాటులో జాతీయ ప్రతిపక్షాలనూ, హక్కుల సంస్థలనూ అప్రమత్తం చేసిన పర్వతనేని ఉపేంద్రను ఎన్ టీ ఆర్ పార్టీ నుంచి బహిష్కరించారు. స్థానిక, జాతీయ పత్రికలన్నీ ఎన్ టీఆర్ కి వ్యతిరేకమైనాయి.

చంద్రబాబు బుట్టలో పడిపోయినపత్రికల పెద్దలు

ఆయన బద్ధశత్రువు చంద్రబాబునాయుడు తనదైన అనితరసాధ్యమైన రీతిలో పత్రికల యజమానులతో, సంపాదకులతో, విలేఖరులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని వారందరినీ బుట్టలో వేసుకున్నారు. ఎన్ టీఆర్ కు సానుభూతి చూపించే ఒక్క వార్తాపత్రిక కూడా లేకపోయింది.

Book in English published by Harper Collins.

ఆగిన ఉదయం

ఆయన తరఫున జరిగే కార్యకలాపాలను ప్రజలకు తెలియజేసే అవకాశం ఉన్న ఒకే ఒక పత్రిక ‘ఉదయం’ 25 మే 1995న, వైస్రాయ్ హోటల్ లో నాటకీయ పరిణామాలు పతాక స్థాయిలో సంభవించడానికి కేవలం మూడు మాసాల ముందు మూతబడింది. అన్నిటికంటే ముఖ్యంగా సగటు ప్రజలకు రాజకీయాలపట్ల ఆసక్తి పోయింది. గర్జించే సింహంగా అభివర్ణించిన ఎన్ టీఆర్ ని తన కుటుంబసభ్యులే బోనులో పెట్టారు. తిరుగుబాటుదారుల ప్రాథమిక లక్ష్యం ఎన్ టీఆర్ రెండో భార్యను దెబ్బతీయడం. చివరికి ఎన్ టీఆర్ ప్రధాన లక్ష్యంగా మారారు. మొదటి సంక్షోభం కంటే భిన్నంగా రెండో సంక్షోభం సంభవించేనాటికి ఎన్ టీఆర్ కు వార్థక్యం వచ్చేసింది. అనారోగ్యం పీడించింది. అటువంటి ప్రతికూల పరిస్థితులలో ఒంటరి యుద్ధం చేయవలసి వచ్చింది.  దీనికి తోడు లక్ష్మీపార్వతి అనే వ్యక్తి ఒకరకంగా సహాయకురాలు మరో రకంగా గుదిబండ. ఆమెను వదిలించుకోవడానికి ఆయన ససేమిరా సిద్ధంగా లేరు.

పేరు లక్ష్మీపార్వతి,పెద్దది వ్యూహమే

ఎన్ టీఆర్ కుటుంబం, ఆయన రాజకీయ ప్రత్యర్థులూ, టీడీపీలోని తిరుగుబాటుదారులూ, మీడియాలో ప్రధాన పాత్రధారులూ ప్రతినాయకురాలిగా (విలన్) చిత్రించిన వ్యక్తి సర్వసాధారణంగా కనిపించే తెలివైన మహిళ. ఆమె పేరు లక్ష్మీపార్వతి. ఎన్ టీఆర్ హృదయం దోచుకొని ఆయన జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి ఎవరో సినిమా రచయిత రాసిన స్క్రిప్టును అనుసరించినట్టు నడుచుకున్న మహిళ నాటి గుంటూరు జిల్లాలలోని నరసరావుపేట (ప్రస్తుతం నరసరావుపేట జిల్లా)లో ఒకానొక కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తూ ఉండేవారు. తనతో ప్రేమలో పడటానికీ, ఎన్ టీ ఆర్ ని తనవైపు ఆకర్షించడానికి ఫక్కా వ్యూహం ఏదైనా లక్ష్మీపార్వతి అనుసరించారా? ఎన్ టీ ఆర్ కుటుంబం పెద్ద వ్యూహమే ఉన్నదని నమ్మింది. కానీ వ్యూహం ఉండే అవకాశమే లేదు. ఎన్ టీఆర్ అగ్రనటుడు. అరుదైన, విజయుడైన రాజకీయవేత్త. అటువంటి వ్యక్తిని లక్ష్మీపార్వతి వంటి సాధారణ మహిళ జీవితంలో ఒక్కసారి కూడా కలుసుకునే అవకాశం లేదు. ఎన్ టీఆర్ ఎంత నిరంకుశంగా, ఇష్టారీతిగా, అనూహ్యంగా వ్యవహరిస్తారంటే ఒక పక్కా ప్రణాళికను అసుసరించి ఆయనతో వ్యవహారం చేయడం అసాధ్యం. ఆ రోజుల్లో ఎన్ టీ ఆర్ ఉన్న పరిస్థితుల వల్లా, ఆ మహిళ పేదరాలైనప్పటికీ ఉన్నత లక్ష్యం పెట్టుకొని దాన్ని సాధించేందుకు శ్రమించే మనస్తత్వం కలిగిన సామాజికవర్గానికి చెందిన సాధకురాలైన మనిషి (ఎన్ టీఆర్ సామాజివర్గమే) కావడం వల్లా నాటి నాటకీయ పరిణామాలు సంభవించాయి. (అధ్యాయం – 11లో)

ప్రతిసారీ వేషం మార్చడమే, జీవితం ఒక నాటకమనీ

       ప్రజల దృష్టి ఆకర్షించేందుకే తరచు తన దుస్తులూ, వేషం మార్చేవారు. ఆయనకు సంబంధించినంత వరకూ ముఖ్యమంత్రిగా పని చేయడం అంటే ఒక సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించడం వంటిదే. ఆయన మనస్సన్యాసి కాదు. ఆయన దేనినీ త్యజించలేదు. అనుభవజ్ఞుడైన నటుడు కనుక ప్రజల ఆసక్తి, దృష్టి తనపై నుంచి మళ్ళకుండా చూసుకోవడం ఎట్లాగో తెలుసు. జీవితం ఒక నాటకమనీ, ప్రపంచం ఒక వేదిక అనీ ఎన్ టీ ఆర్ భావించేవారు. ఏ పని చేసినా, ఏ కార్యక్రమం జరిగినా కేంద్రస్థానంలో తాను ఉండవలసిందే. మారకుండా ఎప్పుడే ఒకే విధంగా ఉండటం గాడిద లక్షణమని ఎమర్సన్ అన్నారు. అటువంటి గాడిద అంశ ఎన్ టీఆర్ లో లేదు. అందుకే  రకరకాల వేషాలు.

సన్యాసినంటూ

కాషాయవస్త్రాలను ఎన్ టీఆర్ విసర్జించడానికి ఒకానొక నేపథ్యం ఉన్నది. ఎన్ టీఆర్, గోటేటి రామచంద్రరావు కంచి వెళ్ళి  శంకరాచార్యను కలుసుకున్నారు. నిర్దిష్టమైన విధానం అనుసరించకుండా ముఖ్యమంత్రి కాషాయవస్త్రాలు ధరించి, సన్యాసినంటూ చెప్పుకుంటూ తిరగకూడదని ఎన్ టీ ఆర్ కి స్వామి స్పష్టంగా చెప్పారు. ఎన్ టీ ఆర్ స్వామి మాటలు విని దిగ్భ్రాంతి చెందారు. కంచి నుంచి తిరిగివస్తున్నంతసేపూ స్వామి అట్లా ఎందుకు మాట్లాడారని గోటేటిని ఎన్ టీ ఆర్ పదేపదే అడిగారు. స్వామి చెప్పిన విధానం ఏమిటో గోటేటి వివరించారు. చాలా రోజులు తపస్సు చేయాలి. గురు పర్యవేక్షణలో తపస్సు జరగాలి. జీవించి ఉండగానే సొంత అస్థిత్వానికి స్వస్తి చెప్పాలి. కుటుంబానికి దూరంగా ఉండాలి. ఈ కఠోర నియమావళిని ఆలకించిన ఎన్ టీ ఆర్ చలించిపోయారు. తాను పెద్ద తప్పు చేసినట్టు గ్రహించారు. ఇంటికి చేరుకున్నవెంటనే కాషాయవస్త్రాలను విసర్జించి ధోతీ, లాల్చీకి మారారు.

తనంటే తనకెంతో ప్రేమ

      ఇతరులు తమను గురించి వాస్తవంగా ఏమనుకున్నా సరే అందరూ తమను పొగడాలని స్వానురాగప్రియులు కోరుకుంటారు. ఇందుకు భిన్నంగా జరిగితే సహించలేరు. వ్యక్తిత్వ నిర్మాణంలో ఉండే అనేక  రకాల లోపాలలో స్వానురాగం ఒకటి. ఇది మనసుకు సంబంధించింది. తమ ప్రాధాన్యాన్ని ఎక్కువగా ఊహించుకుంటారు. ఇతరులు తమనే పొగడాలనీ, తమ పైనే దృష్టిపెట్టాలనీ, అభినందించాలనీ కోరుకుంటారు. ఇతరుల గురించి ఆలోచన ఉండదు. వారి స్థానంలో తమను ఊహించుకొని (ఎంపతీ) ఆలోచించరు. ఈ లక్షణాలలో చాలా వరకూ ఎన్ టీఆర్ లో ఉన్నాయి. సినిమా రంగంలో ఉండగా తనకే ప్రాధాన్యం ఉండాలనే తపన మొదలయింది. తనకు ప్రాముఖ్యం ఇవ్వని వారిని ఆయన పట్టించుకునేవారు కాదు. ఎన్ టీ ఆర్ ఇందిరాగాందీని కలుసుకున్నప్పుడు ప్రోటోకోల్ పాటించకుండా చర్చను ఆయనే ప్రారంభించి ఆయనే ముగించారు. టీడీపీలో మెజారిటీ ఎంఎల్ఏలు చంద్రబాబునాయుడు పక్షాన చేరి తాను  పదవీచ్యుతుడు కావడానికి సమయం ఆసన్నమైనప్పటికీ తన స్థానంలో మరెవరూ నిలువజాలరని ఎన్ టీ ఆర్ భావించారు. ఇవి స్వానురాగప్రియుల లక్షణాలు.

       అయితే, స్వానురాగవర్తనులకు వర్తించని కొన్ని లక్షణాలు కూడా ఎన్ టీ ఆర్  ఉండేవి. తన కుటుంబసభ్యులంటే ఆయనకు మితిమీరిన మమకారం. వారు తనను విమర్శించినప్పుడూ, అవమానించినప్పుడు కూడా ఆయన ప్రతిస్పందించలేదు. మాటకు మాట అనలేదు. అనగలిగినా అనలేదు. మౌనంగానే ఉన్నారు.(17 అధ్యాయంలో)

ఎన్ టి ఆర్ అనేకానేక పార్శ్వాలు

ఎన్ టి ఆర్ జీవితంలో అనేకానేక పార్శ్వాలు అన్నీ చెప్పడం కష్టం. చెప్పాలంటే పుస్తకం చదవాల్సిందే. కాని ఈ రోజుల్లో చదివే అలవాటు అందరికే ఉండాలి కదా. కనుక ఏ సందర్భంలోనైనా ఒకొక్క కోణం తెలుసుకోవచ్చు. ఈ పుస్తకాన్ని ఎమోస్కో ప్రచురణ సంస్థ ప్రచురించింది. అమెజాన్ లో దొరుకుతుంది.

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles