ప్రజాప్రతినిధులను ప్రలోభ పరిచేందుకు సొమ్ము ఇవ్వజూపడం `ఓటుకు నోటు` అయితే ఓటర్ దేవుడికి నోటు(ట్ల)`నైవేద్యం`పెట్టాలనుకోవడం దేనికింది వస్తుందన్నది బుద్ధిజీవుల సందేహం.
ఎన్నికలకు బహిరంగ ప్రచారం గడువు ముగియడంతో `నోటి` ప్రచారానికి వెసులుబాటు ఉంటుంది. ఆ సమయమే `నోటు` పంపిణీకీ ఉపయోగపడుతోందని ఆరోపణలే కాదు దృశ్యమాధ్యంలోనూ ఆ తంతు కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేది మీరంటే మీరని పరస్పరం పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి. ఆదివారం సాయంత్రంతో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎవరెలా, ఎవరెంత పంచుతున్నారో వార్తలు వస్తున్నాయి.
ప్రచారం ముగిసీ ముగియగానే నోట్ల పంద్యారం మొదలైంది. ఒక్కొక్క ఓటుకు రూ. 500 నుంచి 3 వేల వరకు పలుకుతోందని తెలుస్తోంది. డిమాండ్ ను బట్టి థర మరికాస్త పెరగొచ్చట. రేపటి (డిసెంబర్ 1) పోలింగ్ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూతపడినా, సీసాల పంపిణీ జోరందుకుందని తెలుస్తోంది. నోట్ల పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వారిపై కూడా చర్యలు తీసుకోవడంలేదని బీజేపీ ఆరోపించింది. అధికార పక్షం టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతోందనీ, దీనిపై గత అర్థరాత్రి ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశామనీ బీజేపీ ఎన్నికల విభాగం అధ్యక్షుడు ఆంటోనిరెడ్డి తెలిపారు.