Tuesday, January 21, 2025

నోటాకు ఓటు వెయ్యడం మన నోరు మనం నోక్కుకోవడమే!

24.11.2023 మాడభూషి శ్రీధర్

నమ్మదగిన వాగ్దానాలు   చేసి మనతో ఉంటాడనుకున్న అభ్యర్థిని గెలిపించే అవకాశం వాడుకోవలసిందే. అంతేగాని నోటా మీట నొక్కితే మన నోరు మనం నొక్కుకున్నట్టే.

పోటీలో ఉన్నవారెవరికీ నేను ఓటు వేయను అని ఓ హక్కును సుప్రీంకోర్టు 2013లో సృష్టించింది. ఇది హక్కు కాదు  పెద్ద చిక్కు. ఎన్నికల్లో కావలసిన సంస్కరణలు తేకుండా, వద్దనే హక్కు నివ్వడం ఏ ప్రయోజనమూ లేని మార్పు. ఓట్లు చీల్చి బలీయమైన ఒక అభ్యర్థిని ఎన్నుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదు.

ఇంతకు ముందు కూడా ఈ గొప్ప హక్కు ఉందని చాలామందికి తట్టదు. మనకు ఏ ఎన్నికల్లో నైనా 80 శాతం కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించడం అరుదు. సగటున 70 శాతం మంది ఓటు వేస్తారనుకుంటే 30 శాతం మంది నోటాను నోటి మాటతో వాడుకున్నట్టేకదా. ఇంకా ప్రత్యేకంగా నోటాను ఇవ్వడం ద్వారా రాజకీయ రంగంలో ఎన్నికల అవకతవకల మురికి ప్రక్షాళన అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం అభివర్ణిస్తే ఏమనగలం? 2013 నుంచి ఏ ప్రక్షాళన జరిగిందో? ప్రతి ఎన్నికల్లో వాక్ కాలుష్యం, అనూహ్య ఫలితాలు రావడమే ప్రక్షాళనా? ఒకవేళ అందరు అభ్యర్థుల కన్న నోటాలే ఎక్కువైతే మళ్లీ ఎన్నికలు నిర్వహించడం అందులోనూ నోటా ఉండడం మనకు అవసరమా?

ఈ నోటాను తిరస్కార హక్కు అని కూడా వర్ణిస్తున్నారు. ఇదో కథ లేదా కవిత. ఎవరిని తిరస్కరిస్తున్నారు? అభ్యర్థినా,  మొత్తం ఎన్నికనా? లేక అన్ని పార్టీలను కలిసి తిరస్కరిస్తున్నారా? లేదా అంతకుముందు ఎంఎల్యేగా ఉన్న నాయకుడే మళ్లీ పోటీచేస్తే వద్దంటున్నారని భావించాలా? మళ్లీ పోటీలో ఉన్న ఎంఎల్యేను కాకుండా మరొకరిని ఎన్నుకొంటే అది కూడా తిరస్కార ఓటు కదా? ఒక్క మాజీ ఎంఎల్యేనేమిటి మొత్తంగా ప్రభుత్వాన్ని కూడా తిరస్కరించి కొత్త పార్టీని గద్దెనెక్కించే హక్కు అధికారం ఓటర్లకు ఇదివరకే ఉంది. తిరస్కార ఓటు వేయడానికి వేరే రిజిస్టర్ లో సంతకం చేసి విడి బ్యాలెట్ వాడేవారు. నోటాతో వచ్చిన కొత్త హక్కు ఏదీ లేదు.  సీరియస్ గా గెలవడానికి కాకుండా ఊరికే పోటీ చేసే వారితో అగమ్యగోచరంగా తయారైన బ్యాలెట్ పొడుగు పెంచి మరో మీట పెట్టడమే ఘన విజయం. మొత్తం 15 లక్షల మందికి పైగా నోటాను వాడారట. అంటే దాదాపు 1.5 శాతం మంది ఏ అభ్యర్థీ వద్దన్నారు.

ప్రజాప్రతినిధిగా సరిగ్గా వ్యవహరించని బాధ్యతారహితుడైన నాయకుడిని వెనక్కి రమ్మనడానికి ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహిస్తే అందులో మెజారిటీ వస్తే అది రీకాల్ హక్కు. అది లేదు. నోటా అంటే అది కాదు.

ఈరోజుల్లో ఎన్నిక ప్రత్యక్ష ప్రజాస్వామ్యమాలేక పరోక్ష మోసాల వేదికా? ఒక పార్టీ తాను గెలవడం కోసం పోటీ చేయడం లేదు.  గెలవగలదనుకున్న రెండో పార్టీని ఓడించడానికి వీలుగా వారి ఓట్లను చీల్చడానికి పోటీ చేస్తున్నారు. మూడో పార్టీ పోటీ చేయకుండా తన బలగాన్ని బలాన్ని నాలుగో పార్టీకి అనుకూలంగా వాడుకోవడం ఎన్నికల వ్యూహమట.

ఎక్కువ మంది ప్రజల మద్దత్తు కూడగట్టుకుని గెలవాలనుకునే పార్టీలు అసలు ఉన్నాయా అనిపిస్తుంది. బలమైన అభ్యర్థికి అదే పేరుగల వాడిని మరో పార్టీ అభ్యర్థిగా నిలబెట్టించడం, లేదా ఆయన కులానికి (లేదా మతానికి ) చెందిన మరొకరిని నిలబెట్టి ఆయనకు విపరీతంగా డబ్బు పెట్టుబడి పెట్టడాన్ని చాణక్యంగానూ గొప్ప వ్యూహంగానూ అభివర్ణిస్తున్నారు. మంచి పనులు చేసి జనం మన్ననలు అందుకొందామనే మాన్యుడు ఉన్నాడా? ఒకటో పార్టీ తమను ఇన్నాళ్లూ వ్యతిరేకించి దుమ్మెత్తిపోసిన రెండో పార్టీకి విపరీతంగా డబ్బిచ్చి వారి అభ్యర్థులను కూడా ఎంపిక చేసే దౌర్భాగ్యం. మమ్మల్ని తిట్టినా ఫరవాలేదు, మీరు గట్టిగా ప్రచారం చేసి అయిదారు వేల ఓట్లు సంపాదించండి చాలు, మిగతాదిమేం చూసుకుంటాం అంటారు. పోటీచేయడమే మహాభాగ్యంఅనుకుని ఆ చెత్త లక్ష్యం కోసం వారు పోటీ చేస్తారు. ఒక నీతి, నియమం, రీతి, రివాజు లేని వ్యక్తులు, పార్టీలు పుట్టుకొచ్చిన ఈ రోజుల్లో ఎవరు నిజమైన అభ్యర్థిగా మన ముందు సీరియస్ పోటీ ఇస్తున్నాడో తెలియడం లేదు. ఈ మురికి కొత్తగా వచ్చింది. దీన్ని నోటా కడిగి వేస్తుందా?

మన ఎన్నికల విధానాన్ని ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ విధానం అంటారు. పోటీలో ఉన్న వారిలో మిగిలిన వారికన్న ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా సరే అతన్ని ప్రజాప్రతినిధిగా ప్రకటిస్తారు. ఆయన గారు అయిదేళ్లు మనకు ప్రతినిధిగాకాకుండా ప్రభువుగా వ్యవహరిస్తారు. ఎన్ని తప్పులు చేసినా మళ్లీ అయిదేళ్లదాకా అతన్ని వదిలించుకోవడం సాధ్యం కాదు.

ఓ సారి అస్సాం ఎన్నికలను ప్రత్యర్థులు బహిష్కరించారు. అయినా పోలీసులు సైనిక దళాల సాయంతో ఎన్నికలు నిర్వహించారు. లక్ష ఓట్లు ఉన్న నియోజక వర్గంలో ఇరవై వోట్లు మాత్రమే పోల్ కావడం, 99 వేల 980 మంది నోటా అనడం, మిగిలిన 20 మందిలో నాలుగు వోట్లు చెల్లకపోవడం, 16లో సగం కన్న తక్కువ 7 ఓట్లే వచ్చినా, ఒకాయన మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు నాలుగు అయిదు ఓట్లు రావడం వల్ల గెలవడం జరిగిపోయింది. ఇంతకన్న దారుణ ప్రహసనం మరొకటి ఉండదు. అయితే అంకెలు కాస్త పెరిగి 30 వేలు ఓట్లు వచ్చిన నేత, 29 వేల 990 వచ్చిన వ్యక్తిమీద పది ఓట్ల ఆధిక్యత కలిగిన అభ్యర్థిగా గెలుస్తాడు. ఓటు వేయని వారిని, ఇతరులకు ఓటు వేసిన వారిని కలుపుకుంటే గెలిచిన నేతకు మొత్తం ఓట్లలో 30 శాతం రాకపోయినా మొత్తం నియోజక వర్గానికి ప్రతినిధి అవుతారు. పోలైన మొత్తం ఓట్లలో సగం కన్న తక్కువ వచ్చిన నేత ప్రజా ప్రతినిధి అవుతారు. ఇది అన్ని రకాల మాయాజాలాలకు, తంత్ర కుతంత్రాలకు, దుర్మార్గాలకు, అప్రజాస్వామిక మోసాలకు దారితీస్తున్న విధానం.

దీనికి నోటా తోడైతే ఇక గెలిచిన నేత ఎంత మంది సమ్మతిని సాధించినట్టవుతుందో ఊహించాల్సిందే. ప్రతి ఓటరు పోలింగ్ బూత్ కు స్వయంగా రావడం ఎంత ముఖ్యమో పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎవరో ఒకరిని ప్రతినిధిగా ఎంచుకోవడం కూడా అంతే అవసరం. అయిదేళ్ల తరువాత వచ్చిన అరుదైన అవకాశం, మనకు ఇచ్చిన వాగ్దానాలు చెల్లించని అభ్యర్థిని ఓడించే అవకాశం, నమ్మదగిన వాగ్దానాలుచేసి మనతో ఉంటాడనుకున్న అభ్యర్థిని గెలిపించే

అవకాశం వాడుకోవలసిందే.అంతేగాని నోటా మీట నొక్కితే మన నోరు మనం నొక్కుకున్నట్టే.

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles