Saturday, November 23, 2024

కన్నీళ్ళు కాదు, కార్యాచరణ కావాలి!

మొసలి కన్నీళ్లు, ఉత్తుత్తి మాటలకు ఎటువంటి విలువ ఉండదు. కార్యాచరణ కావాలి. కరోనా వేస్తున్న కాటుకు దేశ ప్రజలు విలవిలలాడిపోతున్నారు. కళ్లెదుటే ఆత్మీయులు కనుమరుగై పోతున్నారు. సమాజానికి అవసరమైన ఎందరో విలువైన వ్యక్తులు జలజల రాలిపోతున్నారు. ఆక్సిజన్ అందక కొందరు, బెడ్లు దొరకక మరికొందరు, మందులు, వసతులు, రవాణా అందుబాటులో లేక ఇంకొందరు, భయంతో, తీవ్రమైన మానసిక వత్తిడితో కొందరు, చికిత్సకు డబ్బులు లేక మరికొందరు, ఇలా రకరకాల రూపాలలో మృత్యు వేటుకు బలి అవుతున్నారు.

Also read: కరోణా కట్టడికి విశ్వప్రయత్నం

ఏలినవారి మాటలు కోటలు దాటాయి

వాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి, ఇంకేముంది అంతా అద్భుతం అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు మన ఏలినవారు. ఇప్పటి వరకూ దేశంలో వ్యాక్సిన్ అందినవారి సంఖ్యను చూస్తే, అసలు నిజం తెలుస్తుంది.రెండవ డోస్  పూర్తయినవారి సంఖ్య మూడు శాతం కూడా ఇంకా దాటలేదు. మొదటి డోస్ వేసుకొని, రెండవ డోస్ అందక చాలామంది మానసిక వత్తిడికి గురి అవుతున్నారు. ఇక 60ఏళ్ళ వయస్సులోపు వారిది, 45ఏళ్ళ కింద వారిది మరీ అధ్వాన్నం.మొదటి డోస్ కే దిక్కులేదు. సెకండ్ వేవ్ పొంచివుందని కొన్ని నెలల క్రితమే శాస్త్రవేత్తలు మొత్తుకున్నారు. కరోనా మనల్ని పూర్తిగా దాటిపోయినట్లే మన నాయకంమణ్యులు మాట్లాడారు. ఇతర దేశాలకు కూడా మనం వ్యాక్సిన్లు పంపే స్థితిలో ఉన్నామంటూ జబ్బలు చరుచుకున్నారు. నీలిరంగు వెలిసిపోయి,అసలు రంగు బయటపడింది.మన డొల్లతనం బట్టబయలైంది. త్వరలో మూడవ వేవ్ కూడా పొంచి ఉందనే హెచ్చరికలు వినపడుతున్నాయి. వ్యాక్సినేషన్ పటిష్ఠంగా నిర్వహిస్తే, ఆ ప్రమాదం తప్పుతుందని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అప్రమత్తం చేస్తున్నారు.

Also read: తాత్పర్యం లేని టీకాలు

ఇప్పటికైనా ప్రణాళికాబద్ధమైన ఆచరణ అవసరం

వారి మాటలను పెడచెవిన పెట్టక, ఇప్పటికైనా ప్రణాళికబద్ధంగా, సంకల్పశుద్ధితో, ఆచరణసిద్ధితో మెలగాలి. ఆ బరువు, బాధ్యతలు పాలకులవే.ఆరోగ్యంతో పాటు ఆర్ధిక రంగానికి, సామాజిక చిత్రపటానికి పెనుప్రమాదాలు ఇప్పటికంటే మరిన్ని రెట్లు ఎదురయ్యే దుశ్శకునాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలైన అంతర్జాతీయ వ్యవస్థలు జోస్యం చెబుతున్నాయి.సుమారు 140కోట్ల జనాభా కలిగిన మనదేశంలో ఇప్పటి వరకూ రమారామి 19 కోట్ల డోసులు అందాయి. రెండు డోసులు కలుపుకుంటే 280 కోట్ల డోసులు కావాలి, కోవాగ్జిన్ లాంటివాళ్ళు చెప్పే బూస్టర్ డోసును కూడా కలిపితే మొత్తంగా 420కోట్ల డోసుల అవసరం వస్తుంది. ఈ లెక్కన చూస్తే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో మన దేశం ఎక్కడుందో తేలికగా అర్ధమవుతుంది. వాక్సిన్ల ఉత్పాదాక వేగం ఎన్నోరెట్లు పెరగాల్సిన అవసరం ఉంది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ మొదలైన వ్యాక్సిన్లలను అందుబాటులోకి తెచ్చుకోవడం లో ఎదురవుతున్న అడ్డంకులను వెనువెంటనే తొలగించుకోవాలి. దేశ ప్రజలకు వ్యాక్సిన్లను ఉచితంగా అందించడం దశాబ్దాలపాటు మనం ఆచరించిన విధానం. ఇప్పుడు అమలవుతున్న విధానం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ధరల విధానంలో కూడా సమత లేదు.కేంద్రం -రాష్ట్రాలు, ప్రైవేట్ వారికి విభిన్నంగా ధరలను కేటాయించడం కూడా ఆరోగ్యమైన విధానం కాదు. వ్యాక్సిన్ల తయారీలో ప్రభుత్వ రంగ సంస్థల్ని వినియోగించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Also read: అంతా ఆరంభశూరత్వమేనా?

చేతలు గడప దాటడం లేదు

వ్యాక్సిన్లతో పాటు అవసరమైన ఔషధాలను సిద్ధం చేసుకోవడంలోనూ మనం వైఫల్యం చెందాం. ఇన్ని కోట్ల జనాభా కలిగిన దేశానికి తగ్గట్టుగా,మన పథక రచన లేకపోవడం దురదృష్టం. విస్తృతంగా వ్యాక్సిన్ ప్రక్రియను విజయవంతం చేసుకున్న అమెరికా, బ్రిటన్ లను ఆదర్శంగా తీసుకోవాలి.  ఆగస్టు –  డిసెంబర్ సమయంలో సుమారు 216 కోట్ల డోసుల వ్యాక్సిన్లు మనకు అందుబాటులోకి వస్తాయని, ఈ సంవత్సరం చివరి కల్లా జనాభాలో ఎక్కువ శాతానికి  టీకాలు అందుతాయని నీతి ఆయోగ్ అంటోంది. అవి గతంలో వలె, మాటలకే పరిమితమవుతాయా? ఆచరణలో సాధ్యమవుతాయా తేలాల్సి వుంది. చిన్న పిల్లలకు వ్యాక్సిన్ వేసే అంశంపైనా అధ్యయనం జరుగుతోందని అంటున్నారు. భారతదేశంలో ప్రస్తుతం, నెలకు 8.5 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతున్నాయని కేరళ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంటే, రోజుకు 28.33 లక్షల డోసులు తయారవుతున్నాయి. కానీ, రోజుకి సగటున 12-13లక్షల మందికి వ్యాక్సిన్లు అందిస్తున్నామని కేంద్రం అంటోంది. మరి మిగిలిన సగంపైగా డోసులు ఏమవుతున్నాయని ప్రతిపక్షాలు లెక్కలు అడుగుతున్నాయి. దీనికి కేంద్రం ఎటువంటి సమాధానాన్ని ఇస్తుందో ఇంకా తెలియాల్సి వుంది. మొత్తం మీద, ప్రణాళికలో లోపం వుందని స్పష్టంగా తెలుస్తోంది. వీటన్నిటిని అధిగమిస్తూ, చిత్తశుద్ధితో ప్రభుత్వ యంత్రాంగాలు, వాటిని నడిపే నాయకులు ముందుకు సాగాలి. కరోనా కష్టాల నుంచి ప్రజలను బయటపడేసినప్పుడే పాలకుల మాటకు విలువ ఉంటుంది.ఉత్తుతి ఊకదంపుడు ఉపన్యాసాలు, నాటకఫక్కీలో సాగే హావభావాలు ఇకమీదట ఎవరినీ కరిగించవు, కదిలించవు. ఆ నాటకాలకు కాలం చెల్లింది. ప్రజలు మంచి కసిమీద ఉన్నారు.వారిని శాంతింప చేయడం ప్రభుత్వాల బాధ్యత.

Also read: కోరలు చాచుతున్న కరోనా

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles