ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ శివం ఒక స్వామీజీ సమక్షంలో…
సైన్సు ఒక్కటే సైన్సును సమర్థిస్తుంది. అవసరమైతే విభేదిస్తుంది. తప్పిదం జరిగితే ఒప్పుకుంటుంది. సరిదిద్దుకుంటుంది. ఈ చర్య నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మతానికి ఆ సౌకర్యం లేదు. సౌలభ్యం లేదు. అది ఎదుటివారిని చంపి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది. గతమైనా, వర్తమానమైనా మనకీ విషయం స్పష్టం చేస్తుంది. సత్యం తనని నమ్మమని ఎవరినీ ప్రాధేయపడదు. ప్రార్థించదు. ఆ అవసరం మతాలకుంది. సైన్సుకు లేదు. ఉదాహరణకు శాస్త్రవేత్తలంతా శని, ఆదివారాల్లో క చోట సమావేశమై
‘‘అవును. భూమ్యాకర్షణ శక్తి వాస్తవం వాస్తవం.
నాకు తెలుసు భ్యూమ్యాకర్షణశక్తి వాస్తవం వాస్తవం
మాకు నమ్మకముంది. మేము నమ్ముతున్నాం
మా ఆత్మశక్తి పెరుగుతోంది పెరుగుతోంది
పైకి పైకి లేస్తున్నదంతా
కిందికి కిందికి రాక తప్పదు….ఆమెన్!’’ అని
ఎప్పుడూ ఎక్కడా పాటలు పాడలేదు. ప్రార్థనలు చేయలేదు. వాళ్ళకు ఆ అవసరమే లేదు. సత్యం – దానికదే ఆవిష్కరింపబడుతుంది. దానికదే నిలబడుతుంది. మత విశ్వాసాలున్నవారికి అసత్యాల్ని, భ్రమల్ని, కల్పనల్ని నమ్మే ప్రయత్నంలో సెల్ఫ్ మెస్మరిజం, సెల్స్ మోటివేషన్ అవసరం! అందువల్ల ప్రార్థనలు, కీర్తనలు, ధ్యానాలు, పూజలు, సమాధిలోకి పోవడాలు, శ్వాసమీద ధ్యాసపెట్టడాలు వగైరా అవసరమౌతాయి. ఇవి లక్షల సంవత్సరాలుగా, మిలియన్ల మంది ఆచరిస్తున్నా…అసత్యం – సత్యంగా మారలేదు. భ్రమ-వాస్తవం కాలేదు. లేని దేవుడు ఎక్కడా ఎవరికీ కనిపించలేదు. ఆగామి కాలాలలో కూడా ఇది ఇలాగే ఉంటుంది. అసత్యాన్ని సత్యంగా మార్చడం ఏ మతం వల్లా కాలేదు- కాదు! సత్యాన్నిఎప్పుడూ దివిటీలా ఎత్తి పట్టేదే సైన్సు గనక, అసత్యాలు దానికి సుదూరంగానే ఉంటాయి.
Also read: మా‘నవ’వాదానికి వెన్నెముక – సైన్స్
సైన్సు గురించి చెప్పుకోవాల్సిన మంచి విషయమేమంటే- ఎవరు నమ్మినా, నమ్మకపోయినా దాని అస్థిత్వం దానికి ఉంటుంది. అది కూడా వాస్తవంలో, సత్యంలో ఒక భాగంగా ఉంటుంది. మతం పరిస్థితి దీనికి భిన్నం. జనం నమ్మితేనే దాని అస్థిత్వం ఉంటుంది. జనం నమ్మకపోతే అది ఉండదు. అందువల్ల ఎక్కువమందిని తన పరిధిలోకి లక్కోవడానికి అది నిరంతరం ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. వీలయితే ఆశ చూపిస్తుంది. వీలు కాకపోతే పీకనొక్కేస్తుంది. వైజ్ఞానిక చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా అలాంటి సంఘటనలు లేవు. మనుషుల్ని విడదీయకుండా అందరికీ మేలు చేసేది సైన్సు. మేలు జరుగుతుందని మాయమాటలు చెపుతూ జనాన్ని విడగొట్టేది మతం. సైన్సుకు సరిహద్దులే లేవు. కొత్త ఆలోచనలతో నిరంతరం తనని తాను మార్చుకుంటూ, ప్రపంచాన్ని మార్చుకుంటూ పురోగమనంలోకి దూసుకెళ్ళేది సైన్సు. మతం మారదు. మారనివ్వదు. దానిదెప్పుడూ తిరోగమనమే పురోగమన మనుకునే పరిస్థితి! జ్ఞానం పేరుతో విస్తరించిన ‘మూఢత్వం’ సమాజానికి ప్రమాద హేతువు అయ్యింది…తప్ప – నిరక్షరాస్యత, అమాయకత్వం, అజ్ఞానం సమాజాన్ని ఎప్పుడూ దెబ్బతీయలేదు. అందుకే సమాజంలోని నిరక్షరాస్యత, అమాయకత్వం, అజ్ఞానం తగ్గించడానికి, మూఢత్వాన్ని ఛేదించడానికి వైజ్ఞానిక స్పృహ అవసరమౌతుంది!అవసరమౌతూనే ఉంటుంది!!
Also read: జీవ-జీవన రహస్యాలు
శాస్త్రజ్ఞులంతా హేతువాదులు కారు
ఇది ఇలా ఉంచితే, శాస్త్రసాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో పనిచేసే వారంతా హేతువాదులు కారు. ఉద్యోగాన్ని ఉద్యోగంగా చేస్తూ, వ్యక్తిగతమైన తమ మూఢనమ్మకాల్ని నమ్మకంగా కాపాడుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఉండడమే కాదు, సామాన్యుల్ని కూడా అయోమయంలో పడదోస్తున్నారు. అన్నీ తెలిసిన వైజ్ఞానికులకే ఇలాంటి బలహీనతలుంటే మనకెందుకు ఉండకూడదూ? అని కొందరు సామాన్యులు భావిస్తూ ఉంటారు. నిజానికి, శాస్త్రసాంకేతిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధం లేని ఎంతోమంది సామాన్యులు కూడా తమ ఇంగిత జ్ఞానాన్ని నిద్రలేపి హేతువాదులవుతున్నారు. టూకీగా చెప్పేదేమంటే చదువుకు, డిగ్రీలకు, హోదాలకు, పదవులకు, వైజ్ఞానిక స్పృహకు సంబంధం ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ, నిజానికి ఉండడం లేదు- గొప్ప చదువులు చదివినవారూ, ఉన్నత పదువల్లో ఉన్నవారు కూడా, మూఢనమ్మకాల మురికిలో మునిగి తేలేవారున్నారు. అందుకు భిన్నంగా చదువు, హోదా లేని అతి సామన్యజీవులు కూడా వైజ్ఞానికి స్పృహ హేతువాదులుగా మారినవారు, మారుతున్నవారు ఉన్నారు. పెద్ద చదువు – హోదా ఉన్నవారందరూ సామాన్యులకు ఆదర్శప్రాయంగా ఉండలేక పోవడం విచారకరం. చదువు హోదా లేకపోయినా సమాజగతిని ఆరోగ్యవంతమైన హేతువాదంవైపు మళ్ళించే సామాన్యులు కూడా కొందరుండడం ఆనందించదగ్గ అంశం.
Also read: విశ్వసించలేని విశ్వాసం – ఆత్మద్రోహమే
భారత్, యూకే శాస్త్రజ్ఞుల మధ్య రైస్ యూనివర్శిటీ పోలిక
ఇక్కడ శాస్త్రవేత్తల్లో మత విశ్వాసాలు ఎలా ఉన్నాయన్నది పరిశీలిద్దాం. కొన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రకటించిన వివరాల్ని విశ్లేషించుకుందాం. దేవుణ్ణి నమ్మే భారత శాస్త్రజ్ఞులు 27 శాతం అయితే యునైటెడ్ కింగ్ డమ్ లో 11 శాతం మాత్రమే. ఏదో ఒక శక్తి ఉంది అని నమ్మే భారత శాస్త్రజ్ఞులు 38 శాతమయితే, యు.కె.లో 8 శాతమే! భారతీయ వైజ్ఞానికుల్లో 83 శాతం సెక్యులరిజంపై నమ్మకమున్నవారు. అదే యు.కె. లో మతసామరస్యం ఉన్నవారు 93 శాతం.
Also read: మానవత్వాన్ని మంటగలుపుతున్న పుతిన్
ఎలెక్ హవర్డ్ ఎక్లాండ్ ఆఫ్ రైస్ యూనివర్సిటీవారు భారత దేశానికి, బ్రటిన్ కి పోలిక చూపెట్టారు. మతవిశ్వాసాలు లేని శాస్త్రవేత్తలు ఇండియాలో 6 శాతమైతే యు.కె.లో 65 శాతం మంది ఉన్నారు. మత సంబంధమైన కార్యక్రమాలకు హాజరయ్యే శాస్త్రజ్ఞులు ఇండియాలో 32 శాతం మంది ఉంటే యు.కె.లో 12 శాతమే ఉన్నారు. మత సంబంధమైన కార్యక్రమాలకు అసలు వెళ్ళకుండా ఉండే భారత శాస్త్రజ్ఞులు 19 శాతమైతే యు.కె.లో 68శాతం మంది ఉన్నారు. ప్రతి మతంలోనూ కొన్ని కొన్ని మౌలికమైన అంశాలున్నాయని నమ్మేవారు భారత్ లో 73 శాతమయితే యు.కె.లో 45 శాతం మంది. విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే మతానికీ సైన్సుకు వైరుధ్యాలున్న సంగతి భారతీయ శాస్త్రవేత్తల్లో చాలామంది ఆలోచించనే ఆలోచించరు. మతవిశ్వాసాలు లేకపోయినా తమను నాస్తికులుగా ముద్రవేయవద్దన్న శాస్త్రజ్ఞులు ఓ 16 శాతం మంది ఉన్నారు. సమాజంలో తమ విలువ తగ్గిపోతుందేమోనని వారికి భయం! ప్రపంచ పరిజ్ఞానం, మత విశ్వాసాలు భారతీయ శాస్త్రవేత్తలలో ఎలా ఉన్నాయోనని ట్రినిటీ కాలేజిలోని ఇనిస్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ సెక్యులరిజమ్ ఇన్ సొసయిటీ అండ్ కల్చర్ 2007లో నూటా ముప్పయి భారతీయ పరిశోధనా సంస్థల్లో పని చేసే పదకొండు వందల శాస్త్రవేత్తల అభిప్రాయాలతో ఒక సర్వే నిర్వహించింది. ఇవన్నీ దాని ప్రకారం వచ్చిన ఫలితాలే. వందల యేళ్ళు బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన మనం, స్వాతంత్ర్యం సంపాదించుకుని డెబ్బయ్ దశాబ్దాలవుతున్నా, ఇంకా మనకు సరిపడే విధానాలు రూపొందించుకోక, బ్రిటిష్ పద్ధతులే అనుసరిస్తున్నాం. కానీ, విచిత్రం…దైవభావం వదిలేయడంలో మనమూ, మన శాస్త్రవేత్తలూ ఇంకా ఎంతో వెనకబడే ఉన్నాం.
Also read: మనిషికీ, సత్యానికీ ఉన్న బంధమే సైన్సు: గ్రాంసి
‘‘మతం లేని వైజ్ఞానిక శాస్త్రం కుంటిదేమో గానీ, వైజ్ఞానికత లేని మతం మాత్రం పూర్తిగా గుడ్డిది’’- అని అన్నారు అల్బర్ట్ ఐన్ స్టేయిన్. ఆయన మరో విషయం కూడా చెప్పారు. ‘‘మనకు అంతుపట్టని అనంతాలు రెండున్నాయి- ఒకటి విశ్శరహస్యం. రెండు మనిషి మూర్ఖత్వం. అయితే ఇందులో మొదటిది విశ్వరహాస్యం గురించి నాకింకా కొన్ని అనుమానాలున్నాయి!’’ అని…అంటే అనంతమైన మనిషి మూర్ఖత్వం గూర్చి ఐన్ స్టేయిన్ కు సందేహమే లేదన్నమాట! అందుకే ఎవరో అన్నారు – ‘‘SCIENCE DOES NOT KNOW EVERYTHING. RELIGION DOES NOT KNOW ANYTHING!’’ అని.
Also read: సైన్స్ ఫిక్షన్ మాంత్రికుడు – అసిమోవ్
యవ్వన దశకు చేరుకున్న సైన్సు
సైన్సు బాల్యదశలో ఉన్నప్పుడు మతం మంచి వయసులోఉండి సైన్సుకు దేవుడనే బూచాడిని చూపి భయపెట్టింది. ఇప్పుడు సైన్సు యవ్వన దశకు చేరుకుంది. మతం మూఢనమ్మకాల ముడుతలతో వృద్ధాప్యంలోకి జారుకుంటోంది. ఇతర కారణాలతో చంపబడ్డ వారెందురున్నా ప్రపంచలో మత కారణాలతో ఊచకోత కోయబడ్డవారే ఎక్కువ. మతం మూడు రకాలుగా మానవాళికి హాని చేకూరుస్తుంది. ప్రజల్ని విడదీస్తుంది. ప్రజల్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. ప్రజల్ని బలహీనుల్ని చేస్తుంది. సైన్సు ఎప్పుడూ ఎక్కడా ఎవరినీ విడదీయలేదు. ఊచకోత కోయలేదు. సైన్సు ఫలితాలను దుర్వినియోగపరిచిన దుష్టబుద్ధులున్నారు. నిజమే! మతంతో మారణహోమం సృష్టించిన మనిషే, సైన్సును కూడా దురుపయోగం చేశాడు. మరీ దారుణమైన విషమయేమంటే, వైజ్ఞానిక సూత్రాల కనుగుణంగా, వక్రీకరణలతో మతాలకు ఉన్నతమైన స్థానం కల్పించాలని చూస్తున్నాడు. ఇది తీవ్రంగా నిరసించవలసిన విషయం. ప్రపంచంలోని అన్ని యుద్ధాలకు, అసహనానికి, హింసకు, విద్వేషాని, చెడుకు మూలకారణం మతమేకదా? కాదనడానికి ఆధారాలేవీ? ‘దయ్యాల్ని పూజించేవాడు నిరీశ్వరవాది- అని పుకార్లు పుట్టించి, ప్రచారం చేసి, సమాజంలో తమ ఆధిపత్యం నిలుపుకోవడానికి, నిరీశ్వరవాదుల్ని తక్కువగా చేసి చూపడానికి ఆస్థికులు నిరంతరం ప్రయత్నం చేస్తూ వచ్చారు. నిజానికి నాస్తికులు దేవుణ్ణేకాదు, దయ్యాల్ని కూడా నమ్మరు. దేవుణ్ణి నమ్మేవాడే దయ్యాన్ని నమ్ముతాడు..భయంతోనో – భక్తితోనో –
Also read: ‘హిందుత్వ’ భావన ఎలా వచ్చింది?
దేవుడి పేరుతో వ్యాపారాలు
పరిశీలన ఆధారంగా విజ్ఞాన శాస్త్రం తనను తాను నిత్యనూతనంగా మార్చుకుంటుంది. ‘విశ్వాస’మనేది పరిశీలనలను నిరాకరించి, తన నమ్మకాన్నే కాపాడుకుంటుంది – అని అంటాడు టిమ్ మిన్ చిన్, ఆస్ట్రేలియా దేశపు హాస్య నటుడు, గాయకుడు. ఆస్థికుల్లో ఎంతో మంది దేవుడి పేరుతో పొట్టపోసుకుంటున్నవారు, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నవారు ఉన్నారు. నాస్తికులెవరూ తమ వాదనని ప్రజల్లోకి తీసుకుపోయి ‘వ్యాపారాలు’ చేసుకోవడం లేదు. తమ జీవన భృతి సంపాదించుకోవడం లేదు. జనానికి సత్యదర్శనం చేయిద్దామన్నకాంక్ష తప్ప, మోసగాళ్ళబారిన పడుతున్న అమాయకులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష తప్ప, వారికి మరో ఉద్దేశం లేదు. ఏ సూత్రాల ఆధారంగా ఈ విశ్వం పరిణతి చెందింది? ఏ సూత్రాల ఆధారంగా జీవపరిణామం జరిగింది? వాస్తవాలేమిటి? భ్రమలేమిటి? అని చర్చిస్తారు తప్ప, మరొకటి చెయ్యరు. చర్చకు ఆహ్వానిస్తారు. ప్రశ్నను ప్రేమిస్తారు. కళ్ళ గంతలు విప్పి, వాస్తవాలు దర్శింపజేస్తారు. ఈ రెండు రకాలలో ఎవరు స్వార్థపరులు, ఎవరు నిస్వార్థపరులు అనేది జనమే నిర్ణయించాలి! A MAN WITHOUT GOD IS A-MAN! A GOD WITHOUT A MAN IS NOTHING!!
Also read: చరిత్ర అంటే కొందరికి ఎందుకు భయం?
(రచయిత కేంద్ర సాహిత్య అకాడెమీ విజేత, జీవశాస్త్రవేత్త)