భగవద్గీత–87
ఎవరూ చూడనప్పుడు, గమనించనిప్పుడూ నీవు నిజాయతీగా ఉన్నావా? అయితే నీలో పరమాత్మ చెప్పిన భావసంశుద్ధి ఉన్నట్లు. నీవు నీ ఇంటికి వచ్చిన వారిని మనస్సులో సహజమైన ఆనందంతో ఆహ్వానించావా? అయితే నీలో భావసంశుద్ధి ఉన్నట్లు.
పెదవులను సాగదీసి మాట్లాడటమే నవ్వు అని అనుకుని నీవు చిరునవ్వు పెదవులపై పులుముకొని మాట్లాడుతున్నావా? నీ నోరు మాట్లాడుతూ నొసలు ఎదుటివాడిని వెక్కిరించినట్లుగా ఉన్నదా? అయితే నీలో భావసంశుద్ధి లేనట్లే.
Also read: మానసిక ప్రశాంతతే స్వర్గం
పూర్వం అంటే ఒక పాతిక ముప్ఫయి ఏళ్ళ క్రితం మనం ఎవరింటికన్నా హాయిగా వెళ్ళేవాళ్ళం. ఉన్నదేదో నలుగురం తినేవాళ్ళం. అందరూ కలిసి పడుకునే వాళ్ళం. మంచాలు లేకపోతే హాయిగా క్రిందపడుకునే వాళ్ళం. సంతోషంగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఈ రోజున మన వాళ్ళే ఎన్ని రోజులు మన ఇంట్లో ఉంటున్నారు?
మన గదులు బ్రతకడానికి కాకుండా రెండు బెడ్రూములు, మూడు బెడ్రూములుగా మారిన ఈ రోజులలో ఒక పదిమంది మన ఇంట్లో హాయిగా ఎన్ని రోజులు ఉండగలరు? లేదా మనం వెళ్ళి ఎవరింట్లో అయినా ఎన్ని రోజులుంటున్నాము? ఎదుటివాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని కారణం చెపుతాము. ఇబ్బంది ఎదుటివాడికా మనకా అనే విషయం తెలియదు. కారణం మాత్రం అది.
Also read: స్వోత్కర్ష అసురీ ప్రవృత్తి
మనం Personal space ఎక్కువగా కోరుకుంటున్నాము, ఆరాట పడుతున్నాము. ప్రక్కవాడి పొడ భరించటమే మనకు కష్టమయిపోయింది.
ఎందువలన?
ఏవో భావాలు మన మనస్సులో నింపుకొని తదనుగుణంగా ప్రవర్తిస్తున్నాం. భావాల సాలెగూడులో ఆధునిక మానవుడు బందీ. వాడి బ్రతుకు కూడా బందీ. ఎందుకు ఇన్ని సిద్ధాంతాలు… ఇన్ని రాద్ధాంతాలు…
వాడు నా తోటిమానవుడు అని ఎదుటివాడిని హాయిగా ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? భావ సంశుద్ధి లేకపోవడం వలన.
పరమాత్మ చెపుతారుకదా!
మనస్సులో ప్రసన్నత, అలజడిలేని ప్రశాంతమైన మనస్సు, మనోనిగ్రహము, అంతఃకరణశుద్ధి (Crystal clear mind). ఇలా ఉండటమే మానసిక తపస్సు అట.
మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే
మనఃప్రసాదః, మౌనము, ఆత్మవినిగ్రహము, భావసంశుద్ధి. నిజానికి ఒక్కొక్కటీ ఒక్కొక్క మహావాక్యము.
గీతాచార్యుడు వాడే ఒక్కొక్క పదం ఒక్కొక్క Zipped File. అర్ధం వెతుకుతున్నకొద్దీ వస్తూనే ఉంటుంది. గీతలో ప్రతిపదాన్ని పట్టుకొని దాని అర్ధాన్ని ఆలోచిస్తూ ఉంటే లోకరీతులు, ప్రపంచపు నడకలు అన్నీ ఎదురుగా ప్రత్యక్షమవుతాయి. మన ఆధునిక సమాజం కోల్పోయింది ఇది.
మన పూర్వీకులు పూర్తిగా కాకపోయినా కొంతవరకు అలానే జీవించారు. మనం ఈ రోజున అనేక భావాల పెనుతుఫానులలో సిద్ధాంతాల సుడిగుండాలలోపడి కొట్టుమిట్టాడుతున్నాం.
Also read: చనిపోయినప్పుడు గీత వినిపించడం కాదు, బతకాలంటే వినాలి