జాన్ సన్ చోరగుడి
ఇప్పటికి పదేళ్ల క్రితం విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశంతో కలిసి పనిచేసిన ‘మోడీ బిజెపి’ ఐదేళ్ల విరామం తర్వాత, టిడిపితో తిరిగి పాత మైత్రి కొనసాగించాలని అనుకుంటున్నదా? లేక సౌకర్యవంతమైన ‘వైఎసార్సీపీ’ ఎంపీల సంఖ్యతో పార్లమెంట్ ఉభయ సభల్లో మరోసారి కూర్చోవడానికి, ఇప్పుడున్న- ‘వర్కింగ్ రిలేషన్స్’ అది కొనసాగిస్తుందా?
ఇప్పుడీ విషయం ఏపీ రాజకీయాల్లో ఎడతెగని చర్చగా మారింది. అయితే, ఇదే కాలంలో నిధుల కేటాయింపులో- ‘నాన్-బిజెపి’ రాష్ట్రాల పట్ల కేంద్ర వివక్షపై దక్షణ భారత రాష్ట్రాల నుంచి మొదలైన నిరసన, ఇప్పుడు ఒక కొత్త రాజకీయ సందర్భంగా (Political Context) మారింది. కానీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆంధ్రప్రదేశ్ దీన్ని ‘మిస్’ అవుతున్నట్టుగా ఉంది. అయితే, ఈ సందిగ్ధత టిడిపికి ఎంత సంకటమో పైకి కనిపిస్తుంటే; పైకి కనిపించని, పైకి చెప్పలేని సంకటంతో రాష్ట్ర బిజెపి కూడా స్థిమితంగా లేదు.
Also read: జగన్ కు మేలుచేస్తున్న జాతీయ రాజకీయాలు
బిజెపి-టిడిపి పాత మైత్రి కొనసాగించే విషయంలో నిర్ణయానికి రావడంలో జాప్యానికి, దక్షణ రాష్ట్రాల ఆర్ధిక వ్యవహారాల ‘పంచాయతీ’ కూడా పరోక్ష కారణం అవుతుందా? అంటే కాదని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, ఆర్ధిక కేటాయింపులు కారణాలుగా చూపించి; తమిళనాడు, కేరళ, కర్ణాటక ఢిల్లీపై పిడికిలి పైకెత్తాక ఉన్నట్టుండి పరిస్థితి మారింది.
తప్పడం లేదు
దాంతో రేపు అసెంబ్లీకి ఎన్నికలు ఎదుర్కోబోతున్న జగన్ మోహన్ రెడ్డితో బిజెపి అనుసరించాల్సిన రాజకీయ వైఖరి విషయంలో జరుగుతున్న తాత్సారాన్ని దగ్గరగా గమనించాల్సి వస్తున్నది. ఇప్పుడున్న బిజెపి రాజకీయ దృఢత్వం చూసినప్పుడు, బిజెపి+టిడిపి+జనసేన ‘పొలిటికల్ కాంబినేషన్’ వంటి ఇంత చిన్న విషయంలో నిర్ణయానికి నిజానికి ఇంత తాత్సారం అక్కరలేదు. మరెందుకు ఈ ఆలస్యం అంటే? మరోసారి ‘జియో-పాలిటిక్స్’ ప్రస్తావన తప్పడం లేదు.
ఎందుకంటే, గత రెండు వారాలుగా విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టి అంతా మన దేశానికి నైరుతి సరిహద్దున హిందూ మహాసముద్రంలోని మాల్దీవుల మీద ఉంటే, మన రక్షణ మంత్రిత్వశాఖ దృష్టి అంతా విశాఖపట్టణం- ‘ఈస్ట్రన్ నావల్ కమాండ్’లో 19 నుంచి 27 వరకు 50 దేశాలతో జరగనున్న ‘మిలాన్-2024’ నౌకాదళ రక్షణ సన్నాహాలు మీద ఉంది. గడచిన పదేళ్లలో జాతీయ రాజకీయాల్లోకి ‘జియో-పాలిటిక్స్’ సూక్ష్మస్థాయికి తెచ్చింది ‘మోడీ-బిజెపి’ కనుక, అది దాన్ని ఎదుర్కోవడం ఎటూ తప్పదు.
Also read: పాత ‘ వెర్షన్ ‘ సరుకును వదిలించుకుంటున్న జగన్
మరెవరో కాకుండా
చైనా రక్షణ శాఖ నిఘానౌక హిందూ మహాసముద్రంలో మాల్దీవుల్లో ఫిబ్రవరి 5న లంగరు వేసింది మొదలు మనదేశం సరిహద్దు రక్షణ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. గడచిన ఐదేళ్లుగా శ్రీలంకతో ఇటువంటి సమస్య మనకు తప్పలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఫిబ్రవరి 7-8న జరిగిన ఏడవ- ‘ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్’ ఇండియాకు అందివచ్చిన అవకాశం అయింది. ఈ సమావేశంలో మన విదేశాంగ మంత్రి జైశంకర్ శ్రీలంక అధ్యక్షుడు విక్రమ రణసింఘే తో మాట్లాడి, ఈ విషయంలో భారత్ కోసం శ్రీలంకను చైనా పై ఒత్తిడి చేసి ఒక పరిష్కారం చేయమని కోరింది.
మన దేశానికి నైరుతి సరిహద్దున కేరళకు దిగువన హిందూ మహాసముద్రంలో ఉండే మాల్దీవుల్లో పరిశోధనలు పేరుతో చైనా యుద్ధ నౌక మజిలీ చేసింది. మన సముద్ర సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు ఇలా ఉన్నప్పుడే, దక్షణ రాష్ట్రాల ఆర్ధిక వ్యవహారాల ‘పంచాయతీ’ తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి మొదలయింది. మరో రెండు నెలల్లో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలు దీనికి ‘టైమింగ్’ కావడం తెలిసిన విషయమే. అయితే, ఈ దక్షిణాది రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరంపై మరెవరో కాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో స్పందించిన తీరు విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.
Also read: ‘న్యూట్రల్’ ఓటరు కీలకం కానున్న 2024 ఎన్నికలు
ఫిబ్రవరి 6న రాజ్యసభలో ఆయన అన్న మాటల్ని జాతీయ పత్రికలు- ‘పీటీఐ’ వార్తాసంస్థను ఉటంకిస్తూ మర్నాడు ‘బ్యానర్’ కధనాల్ని ప్రచురించాయి. అందులో…”Prime Minister Narendra Modi urged the Congress and its government in Karnataka to stop creating a narrative to divide the Country into North and South saying it jeopardises the Country’s future” అంటూ… అది సాగింది (ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని- దేశాన్ని ‘ఉత్తరం -దక్షిణం’ అంటూ రెండుగా విభజించే రీతిలో మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నాలు చేయొద్దు, వాటిని ఆపాలి అంటూ కోరారు)
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ‘ఓట్-ఆన్-ఎకౌంట్’ బడ్జెట్ సమర్పించాక, కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ ఒకరు- ‘కేంద్ర ప్రభుత్వం మా వద్ద దండిగా వసూలు చేస్తున్న పన్నులు ఉత్తరాది రాష్ట్రాలకు గ్రాంటుగా ఇస్తూ, అదే మా వద్దకు వచ్చేసరికి నిబంధనలు అనడం ఏమిటని’ చర్చ మొదలయింది. గత ఏడాది జులై 6న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీలో మాట్లాడుతూ- “విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయడంలో కేంద్రం వైఫల్యాన్ని విమర్శిస్తూ, రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తం కావడానికి గత బిజెపి ప్రభుత్వ వైఫల్యం కారణమని” అన్నట్లుగా ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రిక రాసింది.
జోక్యం ఎందుకు?
అయితే, ఇదే విషయంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో 13 డిసెంబర్ 2023న కేసు వేసింది. ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్రాలకు దఖలు పర్చబడిన ఎగ్జిక్యూటివ్ అధికారాల పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని నిలువరించమని అది కోర్టును కోరింది. కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల కేరళ అభ్యంతరాన్ని సమర్ధిస్తూ, 6 ఫిబ్రవరిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేరళ సీఎం పినరై విజయన్ కు లేఖ రాసారు. ఇలా ఒకే అంశంపై మూడు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంలోని ఎన్.డి.ఏ. ప్రభుత్వం తీరు పట్ల ఒకే రీతిగా స్పందించాయి.
Also read: కొన్నాళ్ళు ‘చిత్రం’ ఇలా అస్పష్టంగానే ఉంటుంది…
అనేశారు!
అయితే, కేంద్ర ప్రభుత్వం పట్ల ఈ మూడు రాష్ట్రాల వైఖరి ఇలా ఉండగా, కర్ణాటకను మాత్రమే లక్ష్యం చేసుకుంటూ, ప్రధాని మోడీ దేశం- ‘ఉత్తర-దక్షిణ’ విభజన ప్రస్తావన చేసి, కాంగ్రెస్ పార్టీని అందుకు ముద్దాయిని చేసినట్టుగా మాట్లాడారు. పనిలో పనిగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న ‘సౌత్’ను (వైనాడ్-కేరళ) దృష్టిలో ఉంచుకొని, దేశ సమగ్రత ప్రస్తావన తెచ్చి; రాజకీయంగా కాంగ్రెస్ ప్రయోజనాలు దెబ్బతీయవచ్చు అనే లక్ష్యంతో, దక్షిణ భారత రాష్ట్రాల వైఖరిపై మోడీ కఠినమైన విమర్శ చేశారు.
ఇది చూశాక, సాక్షాత్తూ దేశ ప్రధాని తన మూడవ ‘టర్మ్’ కోసం, మరో రెండు నెలల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, దక్షిణ భారత రాష్ట్రాలపై ప్రయోగించే- ‘బ్లేమ్ గేమ్’ కోసం, ఆఖరికి ‘నార్త్-సౌత్’ విభజన అంటూ ‘చివరి అస్త్రం’ బయటకు తీశారా? అని అనుమానించడం మొదలయింది. ఫిబ్రవరి 17-18న ఢిల్లీలో బిజెపి నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. దానిలో ఎపి ప్రస్తావన ఎక్కడా లేకపోగా, సెంట్రల్ ఇండియాలో బిజెపి గెలిచి, తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో- ‘నార్త్-సౌత్’ విభజన ప్రస్తావన మరోసారి పార్టీ వేదికపై కూడా నరేంద్ర మోడీ చేసారని ‘ది హిందూ’ రాసింది.
ఆ ‘లేట్ నైట్’ మీటింగ్ తర్వాత…
జరుగుతున్న ఈ మొత్తం పరిణామాలు గురించి మనం ఇలా ఆలోచించడానికి కారణం ఉంది. ఢిల్లీలో హోమ్ మంత్రి అమిత్ షాను 7 ఫిబ్రవరి 2024 రాత్రి పొద్దుపోయాక టి.డిపి. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిశారు. అది ఎందుకు జరిగింది? దాని తదుపరి పరిణామాలు ఏమిటి? అనే విషయంలో ఎటువంటి సమాచారం ఇప్పటివరకు లేదు.
ఏపీలో జరుగుతున్న రాజకీయ ఊహాగానాలను, ఇదే ఫిబ్రవరి నెల మొదటి నుంచి ‘సౌత్’లో జరుగుతున్న పరిణామాలు, వాటిపై కేంద్ర ప్రభుత్వం తరపున మరెవరో కాకుండా ప్రధాని ‘నార్త్-సౌత్’ అంటూ స్పందించిన తీరు, ఈ మొత్తాన్ని కలిపి చూస్తే ఈ పరిస్థితుల్లో బాబు ఢిల్లీ పర్యటనకు ఉన్న రాజకీయ ప్రాధాన్యత ఎంత? అనేది అర్ధమవుతున్నది.
దక్షిణాదిన ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు మరి ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏమిచేస్తున్నాడు? అనే ప్రశ్న సహజమైనది. అయితే, మిగిలిన మూడు రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు- ఎపి పదేళ్ల క్రితం ఏర్పడిన రాష్ట్రం, జగన్ పార్టీకి ప్రభుత్వంలో ఇది మొదటి ‘టర్మ్’. నలభై ఏళ్ల అనుభవం వున్న ప్రతిపక్ష పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని విడిచి, కొత్త రాష్ట్ర ప్రయోజనాలు విడిచి, ప్రభుత్వం చేసే ప్రతి చర్యను కోర్టుల్లో అడ్డుకుంటూ దాన్ని కాలు కదపనీయలేదు. ఇక ‘కోవిడ్’ కారణంగా ఆగిన పనులు తెలిసిందే.
దాంతో యువ ముఖ్యమంత్రి కేంద్రంతో సయోధ్యతో మొదటి ‘టర్మ్’లో పరిపాలనలో తనదైన ఒక ‘నమూనా’ ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే, ఏపీ విషయంలో ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి; దేశం దక్షిణ సరిహద్దున మిగిలిన ఒక్క రాష్ట్రంతో కొత్తగా సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు అని బిజెపి జాప్యం చేస్తున్నది కావొచ్చు.
Also read: ‘వైఎస్’ పిల్లల రాజకీయాలతో మనకేంటి మేలు?