అనకాపల్లి జిల్లా, చీడికాడ మండల కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలో కొండవీధి అనే ఆదివాసీల ఆవాస గ్రామం వుంది. మండలం కేంద్రంలో, ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన భారత రాజ్య వ్యవస్థ యొక్క ప్రతి రూపాలు అక్కడ “మినియేచర్” రూపంలో వెలసి వున్నాయి. గౌరవ తాశీల్దార్ గారు మండలానికే కార్యనిర్వాహక న్యాయమూర్తి. సబ్ ఇన్స్ పెక్టర్ (SI) వారు శాంతి భద్రతలను కట్టడి చేసే మూడవ సిహం. అభివృద్ధి అధికారి (MDO) వారు రాజ్యాంగంలొని “ఆదేశిక సూత్రాలకు” నారు పెట్టి నీరుపోసే వారు. వీరందరూ వెలసిన మండల కేంద్రానికి 3 కిలో మీటర్ల కంటే తక్కువ దూరంలో ఈ కొండవీధి “కొండదొర” ఆదివాసీలు వున్నారు. 15 కుటుoబాలు అక్కడ జీవిస్తున్నాయి.
సాధారణంగా మండల కేంద్రానికి అంత సమీపంలో ఆదివాసీలు గ్రామాలు (నాన్ షెడ్యుల్ ప్రాంతాలలో వుండవు). 30 డిసెంబర్ 2023న నేను ఆ గ్రామానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక, అలా ఒక ఆదివాసీ గ్రామం వుండటంలో అసహజం ఏమి లేదని అర్ధమయ్యింది. మీకు ఆ కారణాలు మళ్ళీ చెపుతాను.
ఆ గ్రామoలోకి వెళ్లిన వంటనే నన్ను పలకరించింది ఆదివాసీలు కాదు. సిని చే గువేరా “ పవన్ కళ్యన్” మహశయుడు. సదరు ‘సిని చే గురవేరా’ గారి పార్టి జెండా రెప రెపలాడుతున్నది. ఆ మధ్య నన్ను ఒకరు అడిగారు. “ అయ్యా ! ‘పవనిజం’ అంటే ఏమిటి?” అని. నన్నే ఎందుకు అడిగాడంటే మేము మా ఉపన్యాసాలలో “మార్క్సిజం – లెనినిజం” అంటూ ఊదరగోడుతూవుంటాం గనుక ఆయన నన్ను అడిగాడు. ‘పవనం’ అంటే ‘గాలి’, ఇజం అనగా ‘సిద్దాంతం’ అని నేను పూర్తీ చేస్తున్నానో లేదో ఆయనే “ ఓహో! గాలి సిద్దాంతమా!!” అంటూ ముక్తాయించాడు. మరి కొద్దిగా ముందుకెళ్ళేసరికి గాలి పంక తిరిగినట్లుగా అధికారి పార్టి వారి బావుటా మహాగర్వంగా ఎగురుతూ కనిపించింది. రెండో వరస ఇంటి మీద ‘తెలుగు వెలుగుల’ పసుపు పతాకం వున్న ఆ 15 కొంపల మధ్య మూడు జెండాలు అంటే అక్కడ మూడు పార్టీలు ఉన్నాయని అర్ధం. పేరుకు మూడు పార్టీలు, మూడు జెండాలు వేరు వేరుగా వున్నా అవన్నీ (గ్రామం యొక్క) దక్షిణ పక్షంవైపే ఎగురుతూ కనిపించాయి.
కొండ నిండా అడవి
‘కొండవీధి’ అనే కొండదొరల గ్రామం మండల కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలో వుందన్నాను కదా. కొండవీధికి ఒక అర కిలో మీటర్ దూరంలో అక్కడ ఒక కొండ వుంది. ఆ కొండ నిండా అడవి వుంది. ఒక ఆదివాసీ ఆవాస గ్రామo సాధారణంగా కొండ మీదనైన, కొండకు దగ్గిరగానైన వుంటుంది. కొండ లేక పొతే కొండదొర లేడు.
ఐదు నెలల కిందట నా సహకార్యకర్తల నుండి ఒక ఫోన్- ఈ కొండదొర ఆదివాసీలు కొండకు వెళ్ళే సాంప్రదాయ కాలిబాట మార్గానికి ఆటకం ఏర్పడిoదని. కాలిబాటను కొందరు గిరిజనేతరులు తవ్వేసారు. దాంతో వారికీ కొండకు వెళ్ళే మార్గం మూసుకు పోయింది.
కొందరు యువ కార్యకర్తలను అక్కడికి వెళ్లి దారిని కప్పేసిన భాగం, ఇంకా మిగిలిన భాగాలను ఫోటోలు తీసి వాటి GPS కో ఆర్దినేట్స్ పంపమని కోరాను. వాటి ఆధారంగా గూగుల్ ఎర్త్ లో చూస్తే వారు చెప్పింది నిజమే. కాలిబాట ప్రారంభ భాగం ( కొన్ని మీటర్లు) చెదిరిపోయింది. దాని తరువాత భాగం నేరుగా కొండ వద్దకు తీసుకువేడుతుoది. అంటే ఆదివాసీలు చెపుతున్నదానిలో నిజo వుంది.
కొండవీధి ఆదివాసీలకు ఒక వినతిపత్రం తయారు చేసి ఇచ్చాం. దానిపై సంతకాలు పెట్టి తాశీల్దార్ గారికి ఇవ్వమని సూచించాం. కాని వారు ఆ పని చేయలేదు. ఎందుకంటే ఊరిలో వున్న మూడు పార్టీలలో అధికారంలో వున్న పంకా గుర్తు జెండా తమకు పని చేసి పెడుతుందని వారు నమ్మారు. ఆ జెండాలు గాలిలో ఎగురుతాయేగాని గాలి దిశను మార్చలేవని వారి అర్ధం కావడానికి కొన్ని నెలలు పట్టింది. మూసుకుపోయిన దారి తెరచుకోలేదు.
“జగనన్నకు చెప్పుకుందాం” అనే ప్రోగ్రాం ఒకటి ప్రభుత్వం వారు పెట్టారు. నిజానకి పాత సీసాలోని సరుకుకు కొత్త పేరు అది. వారంలో ప్రతి సోమవారo “ గ్రివేన్స్ డే”. మిగిలిన రోజులలో అధికారులు ప్రజలకు అందుబాటులో వున్నా లేకున్నా ఆ రోజు మాత్రం తప్పని సరిగా కార్యాలయంలో వుండి వినతులు వినాలి. దానినే “ఫిర్యాదుల పరిష్కార దినం” అని అంటారు. ఇది బ్రిటష్ కాలం నుండి వున్న సాంప్రదాయం. దానికి ప్రస్తుత ప్రభుత్వం తొలుత పెట్టిన పేరు “ స్పందన”. ఎవరు సలహా ఇచ్చారో ఏమో, ఇప్పడు దానిపేరు “ జగనన్నకు చెప్పుకుందాం” అని మార్చారు. మనం వినతిపత్రం ఇస్తే అది సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఇచ్చినట్లన్న మాట.
ఈ తంతును ప్రతి సోమవారం ఆయా కార్యాలయాలలో అధికారులు నిర్వహిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి మండలానికి “జగనన్నకు చెప్పుకుందాం” అని మొదలు పెట్టారు. అంటే మరేమీ లేదు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వంటి జిల్లాస్తాయి అధికారులు మండలానికి వచ్చి వినతులు వింటారు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. అలా కొండవీధి ఆదివాసీలు జీవిస్తున్న చీడికాడ మండలంలో 18 అక్టోబర్ 2023న “జగనన్నకు చెప్పుకుందాo” జరిగింది. అక్కడ ఆదివాసీలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలసి ఒక వినతిపత్రం ఇచ్చారు, వివరాలు చెప్పారు.
“జగనన్నకు చెప్పుకున్నరు” కదా ఏమయ్యిoదని అడిగితె ఒక ఆదివాసీ పెద్ద ఆవేదనగా “ చెప్పుతో కొట్టుకున్నట్లు” అయ్యిందని చెప్పాడు. అసలు ఎం జరిగిందో చెప్పే ముందు నా పర్యటన, పరిశీలన ద్వారా నేను చూసిన విషయాలు చెపుతాను.
కొండవీధి ఆదివాసీల వద్ద చీడికాడ గ్రామం గ్రామ పటం (Map) వుంది. అందులో సర్వే నెంబర్ 1లో కొండను చూపిస్తుంది. ఆదివాసీల వద్ద వున్న ఇళ్ళ పట్టాలలో వున్నదాని బట్టి కొండవీధి గ్రామం సర్వే నెంబర్ 5లో వుంది. వారు అనాదిగా కొండకు వెల్తున్న దారిగుండా నన్ను తీసుకువెళ్ళమని కోరాను.
ప్రధాన రహదారి నుండి కొండకు వెళ్ళే దారి తొలిభాగంలోనే దానిని తవ్వేసారు. అక్కడ నుండి నడుచుకుంటూ ఒక 100 మీటర్ల వెళ్ళేసరికి, అక్కడ పాతదారి చెక్కు చెదరకుండా కనిపించింది. ఆ దారిగుండా కొండ వద్దకు చేరుకున్నాం.
అక్కడ వున్న కొండను ఆదివాసీలు రెండు పేర్లతో పిలుస్తున్నారు. మనం కొండకు ఎదురుగా నిలబడితే మన కుడి చేతివైపు భాగాన్ని “నంది గురువు” అని ఎడమవైపు భాగాన్ని “సోమాలమ్మ జోరు” అంటారు.
మొత్తం కొండoతా పచ్చదనంతో మెరిసిపోతున్నది. ఇందుకు కారణం కూడా వుంది. ప్రపంచ బ్యాంకు సహాయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (JFM) అనే కార్యక్రమం నడిచింది. ఆ ప్రోగ్రాం కింది మొత్తం కొండలో చాల భాగం చెట్ల పెరుగదల కనిపిస్తుంది. కొండను ఆనుకొని అటవీ శాఖ వారు పెంచిన టేకు వనం కూడా వుంది. ఇది గాక కొండవీధి ఆదివాసీలు 15 కుటుంబాలు వుంటే అందులో 9 కుటుంబాలకు అదే కొండలో “ అటవీ హక్కుల చట్టం (ROFR)” కింద ఇచ్చిన అటవీ భూమి పట్టాలు కూడా వున్నాయి.
నాతొ వచ్చిన ఇల్లబోయిన కొండమ్మ, బొలం గంగమ్మలు కొండలో వున్న ఇద్దరు దేవతల గుళ్ళను గూర్చి చెప్పారు. కుడి వైపు కొండ భాగంలో, నీటి జోరు (వూట నీరు) వున్న చోట “గంగమ్మ తల్లి” గుడి వుoది. ఎడమవైపున మరో నీటి జోరు వుoది. అక్కడ “సోమాలమ్మ తల్లి” వుంది. కొండ, దానిపై అడవి వున్నచోట నీటి చెలమలు ఏర్పడి అవి దిగువకు ప్రవహిస్తూ వుంటే అక్కడ మనకు స్త్రీ దేవతామూర్తులు, వారి గుడులు కనిపిస్తాయి. ఆహార ఉత్పత్తిలో అడవి, కొండ, నీరు ముఖ్యమైన మూలకాలు. వ్యవసాయంలోను, ఆహరంలోను స్త్రీలదే ప్రధాన భూమిక. నీటి జల కొండలో పుట్టి దిగువకు పారుతుంది. నీరు రైతుల సాగుకు ప్రాణవాయువులాంటిది. అందుకే మండలం కేంద్రమైన చీడికాడ గ్రామం రైతులు ఏడాదిలో ఒకరోజు ఈ రెండు అమ్మవార్లను దర్శించుకుంటారు. వారు అక్కడికి వెళ్ళడానికి కూడా ఇదే దారి, మరొకటి లేదు.
జగనన్నకు చెప్పుకుందాం
ఇక మన “జగనన్నకు చెప్పుకుందాo” వద్దకు వద్దాం. ఒక జిల్లాలో భూముల విషయంలో అత్యున్నత అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్. వారితో ఆదివాసీలు మొర పెట్టుకున్నారు. పేరుగొప్ప ప్రోగ్రాంలో సమస్యలు ఎలా పరిష్కారo అవుతునాయో తెలుసుకోవడానికి ఇది ఒక కేస్ స్టడి కూడా.
“జగనన్నకు చెప్పుకుందాo” వెబ్ పోర్టల్ లో “కొంవీధి” ఆదివాసీల వినతి పత్రం తేది: 18-10-2023న ANPL 20231018781 గా నమోదయ్యింది. చీడికాడ గ్రామం గ్రామ రెవిన్యూ అధికారి (VRO), మండలం సర్వేయర్ (MS) ఇరువురూ తమ నివేదికను తేది: 12-12-2023ని తాశీల్దార్ కు అందజేశారు. గౌరవ తాశీల్దార్ గారు తన నివేదికను SR No: 236/ 2023, తేది: 15-12-2023 “జగనన్నకు చెప్పుకుందాo” వెబ్ పోర్టల్ లో 18 వ తేదిన “అప్ లోడ్” చేశారు. ఈ నివేదిక తరువాత 12 రోజులకు నేను వెళ్లి చూసాను. ఆదివాసీలకు రహదారి తెరచుకోలేదు.
“జగనన్నకు చెప్పుకుందాo” వెబ్ పోర్టల్ లో మనకు “డేష్ బోర్డు” కనిపిస్తూ వుంటుంది. అది “రియల్ టైం”లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యయో చూపిస్తూ వుంటుంది. తేది: 18-10-2023న డేష్ బోర్డులో అప్పటికే వున్న ఫిర్యాదల సంఖ్యకు ఒక అంకె చేరి వుంటుంది. తేది: 18-12-2023న తాశీల్దార్ లాగిన్ నుండి రిపోర్టు అప్ లోడ్ కాగానే (“పరిష్కారం” అయ్యింది గనుక) ఒకటి తగ్గిపోయివుంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం డేష్ బోర్డు ప్రకారం కొండవీధి ఆదివాసీల సమస్య నమోదు కావడం, పరిష్కారం అవ్వడం జరిగిపోయింది. కాని ఆదివాసీలకు మూసుకుపోయిన దారి మాత్రం ఇప్పటికి తెరచుకోలేదు.
తాశీల్దార్ నివేదిక ఏం చెపుతుంది? గౌరవ తాశీల్దార్ కు తేది: 12-12-2023న VRO, మండల సర్వేయర్ ఏమి చెప్పారో అదే తేది: 18-12-2023 అప్ లోడ్ అయిన నివేదికలో అదే వుంది. కాకపోతే తాశీల్దార్ వారి సంతకంతో.
ఇంతకి నివేదిక చెపుతున్నది ఏమిటి? మనం కాయగూరుల దుకాణంకు వెళ్తాం. వంకాయలు చూస్తాం. “మంచివేనా?” అని అడుగుతాం. మనకు జవాబు ఏo వస్తుంది? ‘పరమ చెత్త’ అంటాడా దుకాణందారు?! అలాగే సాంప్రదాయాకంగా వున్న దారిని తవ్వేసి దానిని మూసేసిన వారినే వెళ్లి అడిగారు అధికారులు. వారు అక్కడ ఎలాంటి దారి లేదని చెప్పారు. ఒక వంద మీటర్లు, అలా ముందు కొండ వైపుకు నడుచుకుంటూ వెళ్తే అధికారులకు మిగిలిదారి కనిపంచి వుండేది. ఈ నోరు లేని “కొండదొరల” కోసం అంత శ్రమ ఎవడు తీసుకుంటాడు? వారేమి ఇచ్చుకోలేరు కదా. కనకు ఆ దారిని కప్పేసి ఆదివాసీలకు కొండకు వెల్లడానికి లేకుండా చేసిన వారు చెప్పిందే పరమసత్యం అయ్యింది. మండలానికి కేవలం 3 కిలోమీటర్ల లో ఆంధ్రప్రదేశ్ రాజ్య వ్యవస్థలకు ప్రతినిధులుగా వున్న వారేవారికి అక్కడికి పోయి తనిఖి చేసేందుకు చూసేందుకు తీరిక లేదు.
15 కొంపలు వున్న ఆ చిన్న గ్రామంలో మూడు పార్టీలు, మూడు జెండాలు వున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి పేరుతొ వున్న “జగనన్నకు చెప్పుకుందాo” వుంది. రాజ్యవ్యస్థల కార్యాలయాలు కూత వేటు దూరంలో వున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కొండవీధి గ్రామం వున్న చీడికాడ మండలంకు అధికార పార్టి శాసన సభ్యుడు ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రి అంతటి వాడు. ఆయన ఆరోవేలు వంటి రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు. షెడ్యుల్ కులాలు, షెడ్యుల్ తెగల వారు వెళ్ళే మార్గాలను మూసివేయడం SC, ST అత్యాచారాల నిరోధక చట్టం కింద నేరం. ఇన్ని వుంటేనేమి, ఆదివాసీలు కొండకు పోవడానికి దారి లేదు. మేము దారి ఇవ్వం “ మీ దిక్కున చోటకుపోయి చెప్పుకోండి” అన్నది ఆ దారిని మూసేసిన వారు ఆదివాసీలకు చెపుతున్న మాట. అన్ని దిక్కులు ముసుకుపోయాక వారికి ఏమిటి దిక్కు?
PS అజయ్ కుమార్