Wednesday, January 22, 2025

రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు

కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీల స్వభావాలూ మారుతూ ఉంటాయి. భారతీయ జనతాపార్టీ కంటే శివసేన ఉదారంగా ఉంటుందని చాలామంది ఊహించి ఉండరు. అసలు బీజేపీ,శివసేనలు విడిపోతాయనీ, శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ లను శరద్ పవార్ అనే రాజకీయ ధురంధరుడు ఒక తాటిపైకి తెచ్చి ఒక కూటమిని ఏర్పాడు చేస్తారనీ, ఆ కూటమి సంవత్సరానికి మించి మహారాష్ట్రలో అధికారంలో కొనసాగుతుందనీ, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే సమర్థుడైన ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటారనీ ఎవరు కలగన్నారు?

Also read: ప్రజాస్వామ్యవాదులకు ఆశాభంగం కలిగించిన జస్టిస్ బాబ్డే

కాంగ్రెస్ పార్టీ 2014లో పదేళ్ళు అధికారంలో ఉన్నకారణంగా ఓడిపోతుందని చాలామంది ఊహించి ఉంటారు. కానీ నాయకత్వ సమస్యతో సతమతం అవుతుందనీ, 2019లో వరుసగా రెండో సారి పరాజయం చెందుతుందనీ, ఆనక  ఆ పార్టీలోని 23 మంది సీనియర్ నాయకులు పార్టీ అధిష్ఠానంపై లేఖాస్త్రం సంధిస్తారని ఎవరు ఊహించారు? ఏడేళ్ళ కిందట అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ మొన్నటిదాకా మొనగాడని పేరుతెచ్చుకొని అంతలోనే విఫలప్రధానిగా తేలిపోతారనీ, కోవిద్ మహమ్మారి చేతిలో ఓడిపోతారనీ, అంతర్జాతీయ మీడియా ఆయనను అపహాస్యం చేస్తుందనీ, తిట్టిపోస్తుందనీ ఎవరు అనుకున్నారు?

Also read: ఒపీనియన్ పోల్స్ బ్యాన్ చేయాలా?

పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. 1975లో దేశంలో ఆత్యయిక పరిస్థితిని ప్రకటించి రెండు సంవత్సరాలు రైళ్ళను సకాలంలో నడిపించి, దేశంలో క్రమశిక్షణను పునరుద్ధరించిన ఇందిరాగాంధీ ఎన్నికలలో ఘోరపరాజయం చెందుతారని ఎన్నికల పండితులు అనుకోలేదు. అంతలోనే 1979లో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ ప్రభుత్వాలు కూలిపోతాయనీ, ఆ మీదట జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందనీ, రెండేళ్ళ కిందటే తిరస్కరించిన ఇందిరాగాంధీని ప్రజలు నెత్తిన పెట్టుకుంటారనీ ఎవరనుకున్నారు?

Also read: మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం

ఎన్నికల ఫలితాలను ఎవరు ఊహించారు?

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న యూపీఏకి 2004లో కంటే 2009లో ఎక్కువ సీట్లు వస్తాయని ఎవ్వరూ అనుకోలేదు. 2014 లో కంటే 2019లో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చంద్రబాబునాయుడికి కానీ ఆయన సలహాదారులకు కానీ తెలిసి ఉంటే ఆయన కాంగ్రెస్ నాయకుల మొహాలు చూసేవారు కాదు. వారితో పొత్తు పెట్టుకునేవారు కాదు.  బీజేపీతో తెగతెంపులు చేసుకునేవారూ కాదు. ‘భార్యనే ఏలుకోలేని మోదీ దేశాన్ని ఏం ఏలుతాడు?’ అంటూ ఎన్నికల సభలలో పరుషంగా విమర్శించేవారు కాదు. అంత దూరం వెళ్ళేవారే కాదు. ఊహించని పరిణామాలు సంభవించినాయి కనుకనే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా రాష్ట్రంలో ప్రాబల్యం లేకుండా కేంద్రంలో పలుకుబడి లేకుండా చంద్రబాబునాయుడు డీలా పడిపోతున్నారు. రాజకీయాలలో రిస్కు తప్పదు. కానీ టీడీపీ అధినేత 2018లో అవసరానికి మించి రిస్కు తీసుకున్నారు. తన అంచనా తప్పు కావచ్చునేమో అనే అనుమానం కూడా ఆయనకు కలగకపోవడం ఆశ్చర్యం. దాన్ని ఆత్మవిశ్వాసం అనాలో మరేమనాలో తెలియదు.

Also read: హైదరాబాద్ సంస్కృతికి సముజ్జ్వల ప్రతీక నరేంద్ర లూథర్

ఈ నేపథ్యంలో ఆలోచిస్తే, నరేంద్రమోదీ శాశ్వతంగా ప్రదాని పదవిలో ఉండరు. 1975-77 మధ్య ఇందిరాగాంధీ ఎంతటి శక్తిమంతులరాలుగా కనిపించారో మొన్నటి వరకూ మోదీ సైతం అంతే శక్తమంతుడుగా కనిపించారు. ఆమె ఆత్యయిక పరిస్థితిని ప్రకటించి ప్రజాస్వామ్య సంస్థలను అదుపులో పెట్టుకున్నారు, మోదీ ఆత్యయిక పరిస్థితి ప్రకటించకుండానే ప్రజాస్వామ్య సంస్థలను చెప్పుచేతలలో పెట్టుకున్నారు. వాటితో ఊడిగం చేయించుకుంటున్నారు. అయినా సరే, కోవిద్ మహమ్మారి కారణంగా ఆయన బలహీనుడైనారు.

ఈ రోజున దేశంలో ఎన్నికలు జరిగితే బీజేపీ గెలుస్తుందని నమ్మకంగా ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అందుకని ప్రతిపక్షాలు తమ ప్రయత్నాలలో ఉండటంలో తప్పులేదు. శివసేన రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. శరద్ పవార్ కి వంట్లో బాగాలేదనీ, ఆయన కోలుకోగానే ప్రతిపక్ష కూటమి గురించి సమాలోచన చేస్తామని చెప్పారు.

ఓటమి గురించి సోనియా ప్రస్తావన

ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా ఓడిపోవడం గురించి కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించారు. పార్టీ అంత చెత్తగా ఓడిపోలేదు. అధిష్ఠానం ఆమోదంతోనే వామపక్షాలతో, ముస్లింల నాయకత్వంలోని పార్టీతో   పొత్తు పెట్టుకొని పశ్చిమబెంగాల్ లో ఒక్క సీటు కూడా దక్కకుండా గల్లంతైన మాట వాస్తవమే. బెంగాల్ ఎన్నికల ప్రచారం జరిగిన తీరూ, ప్రధాని మోదీ, దేశీయాంగ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే దృష్టి కేంద్రీకరించిన తీరూ కారణంగా బెంగాల్ సమాజం రెండుగా చీలిపోయింది. ఎన్నికల ప్రచారం మోదీ వర్సెస్ దీదీగానే జరిగింది. అట్లా జరగడానికి బీజేపీ నాయకద్వయమే కారణం. ‘దీదీ ఓ దీదీ’ అంటూ దీదీ నామస్మరణే తప్ప, దీదీని అవహేళన చేయడమే తప్ప తమ పార్టీ గెలిస్తే ఏమి చేస్తుందో వివరంగా చెప్పలేదు. దీదీని భ్రష్టుపట్టిస్తే అధికారం తమదేనని అనుకున్నారు. దీదీ కేంద్రీకృతంగా జరిగిన ప్రచారం వల్ల మరో పార్టీ గురించి కానీ మూడో కూటమి గురించిగానీ ప్రజలు ఆలోచించలేదు. మమతాకు అనుకూలమా, వ్యతిరేకమా అనే ఆలోచించారు. మమతకు అనుకూలంగా ఓట్లు వేశారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం పోశారు. మోదీ అనే బలవంతుడైన, సమ్మోహనశక్తి కలిగిన నాయకుడిని కూడా ఓడించే అవకాశం దేశంలో ఉన్నదని నిరూపించారు. బెంగాల్ ప్రజలు కాంగ్రెస్ ను కానీ, వామపక్షాలను కానీ ఓడించలేదు. టీఎంసీని గెలిపించారు.

Also read: సమరశీలి బూర్గుల నరసింగరావు

బెంగాల్ లో అసాధారణ ఎన్నికలు

బెంగాల్ లో బీజేపీ దారణంగా ఏమీ ఓడిపోలేదు. ఎన్నికల ప్రచారంలో మోదీ, షాల అతిశయోక్తులకూ, అంచనాలకూ అనుగుణంగా సీట్లు రాలేదు కానీ 2016లో మూడు సీట్ల నుంచి 2021లో 76సీట్ల వరకూ ఎదిగింది బీజేపీ. చాలా స్థానాలలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయింది. కానీ రెండు విడతల ముఖ్యమంత్రిగా చేసి, పదేళ్ళ పరిపాలనలో అనేక తప్పిదాలు చేసి, ఈ ఎన్నికలలో కుడి భుజం, ఎడమ భుజం అనదగిన నాయకులను కోల్పోయి కూడా ఇదివరకు ఎన్నడూ లేనంతగా 216 (మొత్తం 294) స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గెలుచుకున్నదంటే అది కేవలం అసాధారణ స్థాయిలో  ఎన్నికల ప్రచారం జరిగిన కారణంగానే. మమత కావాలో, బీజేపీ కావాలో తేల్చుకోమని బీజేపీ నాయకులూ, టీఎంసీ నాయకులూ ప్రజలకు చెప్పారు. ఈ గందరగోళంలో వామపక్షాల గురించి కానీ కాంగ్రెస్ గురించి కానీ ఆలోచించే వెసులుబాలు ఎక్కడిది? మాల్దా వంటి కాంగ్రెస్ కు బలం ఉన్న జిల్లాలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారంటే అవి అసాధారణ ఎన్నికలు కాబట్టే.

Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంవీఆర్

కాంగ్రెస్ అంత దారుణంగా ఓడిపోలేదు

బెంగాల్ ను తీసి పక్కన పెడితే, పుదుచ్ఛేరిని పెద్దగా లెక్కపెట్టకపోతే కాంగ్రెస్ అసోంలో, కేరళలో,తమిళనాడులో మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదు. తమిళనాడులో బలమైన డీఎంకే తో కలసి పోటీ చేసిన స్థానాలలో 80 శాతం గెలుచుకున్నది. అసోంలో గట్టిపోటీ ఇచ్చింది. కేరళలో కూడా 2016లో వచ్చిన స్థాయిలోనే సీట్లు వచ్చాయి. రెండు రాష్ట్రాలలో గెలిస్తే కాంగ్రెస్ విజయం సాధించినట్టు లెక్క. ఓడిపోయిన మాట వాస్తవమే కానీ రెండు రాష్ట్రాలలోనూ ప్రత్యేక పరిస్థితుల వల్ల అపజయం సంభవించిందని గమనించాలి. ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకుల లోపం వల్ల కాదు. అసోంలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు గట్టిపోటీ ఇచ్చారు. కేరళలో ముఖ్యమంత్రి విజయన్ విశేషమైన పరిపాలనా సామర్థ్యం కనబరిచి ఆనవాయితీకి భిన్నంగా వరుసగా రెండో సారి లెఫ్ట డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్ డీఎఫ్)కి పట్టం కట్టారు. కాంగ్రెస్ మరీ దారుణంగా ఓడిపోలేదు.

సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు

కాంగ్రెస్ ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే అసోంలో, కేరళలో పరాజయాలను అర్థం చేసుకోవచ్చు. అయిదు రాష్ట్రాల ఎన్నికలలో పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష స్థానం ఖాళీగా ఉంది. సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగా లేదు. 23 మంది సీనియర్ నేతలు ఒక మోస్తరు తిరుగుబాటు చేశారు. వారు పార్టీ నుంచి వెళ్ళిపోతామని చెప్పలేదు. పార్టీకి పూర్తికాలం పనిచేసే అధ్యక్షుడు కావాలని కోరారు. వారిని ఆహ్వానించి, సముదాయించి, విశ్వాసంలోకి తీసుకొని వారికి నమ్మకం కలిగించే పని సోనియాగాంధీ చేయవలసింది. ఎందుకో తెలియదు కానీ ఆమె ఆ పని చేయలేదు. సీనియర్ నాయకులను శత్రుభావంతో చూడకపోయినా, నిర్లిప్త భావంతో చూసినట్టు అనిపించింది. 2019లో పరాజయం తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అద్యక్ష పదవి నుంచి ఐచ్ఛికంగా తప్పుకోవడమే కాకుండా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి ఈ సారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కోరారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు వెంటనే జరిపించి ఉంటే ఈ పాటికి పార్టీకి అధ్యక్షుడు ఉండేవారు. సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో సైతం కోవిద్ కారణంగా పార్టీ అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నిక ఎంతకాలం వాయిదా పడుతూపోతే పార్టీకీ, దేశానికీ అంత నష్టం.

Also read: అన్నదాత ఆక్రందన పెడచెవిన పెట్టడం అనర్థం

ప్రతిపక్ష కూటమికి సన్నాహాలు

అయితే, శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చెప్పిన మాట మాత్రం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్ష ఫ్రంట్ గురించి ఆలోచించడం అవివేకం. యోగేంద్ర యాదవ్ లాంటి మేధావులు ఏమన్నా, ఇప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ లేకుండా ప్రతిపక్ష సంఘటన ప్రస్తుత పరిస్థితులలో అసాధ్యం. ఎన్ టి రామారావు నాయకత్వంలో 1980 దశకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగానే. నాటి కూటమిలో బీజేపీ భాగస్వామి. అప్పుడు విజయవాడ సమీపంలో ఇబ్రహీపట్టణంలోని  థర్మల్ స్టేషన్ అతిథిగృహంలో జరిగిన ప్రతిపక్ష నాయకుల సమావేశానికి వాజపేయి హాజరైనారు. ఆ తర్వాత బీజేపీ వీపీ సింగ్ తో కుదరక నేషనల్ ఫ్రంట్ నుంచి చీలిపోయింది. మండల్, కమండల్ రాజకీయాలు దేశాన్ని కుదిపేశాయి. కానీ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయ కూటమిలో ప్రారంభంలో బీజేపీ ఉంది. తర్వాత ఏర్పడిన కాంగ్రెసేతర, బీజేయేతర (చంద్రశేఖర్, దేవగౌడ, ఎల్ కె గుజ్రాల్ నాయకత్వంలో) ప్రభుత్వాలకు వెలుపల నుంచి కాంగ్రెస్ మద్దతు ఉంది.  1980 దశకంలో కాంగ్రెస్ తర్వాత అన్ని రాష్ట్రాలలో కాకపోయినా ఎక్కువ  రాష్ట్రాలలో ఎంతో కొంత ప్రాబల్యం ఉన్నది బీజేపీకే. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అంతే. అన్ని రాష్ట్రాలలోనూ ఎంతో కొంత ఓట్లు ఉన్నది ఆ పార్టీకే. అందుకే ఆ పార్టీ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం నేల విడిచి సాము చేయడం వంటిదే.

రాహుల్ నాయకత్వం

కాంగ్రెస్ పార్టీ బలహీనతలు అందరికీ తెలిసినవే. సోనియాగాంధీ తర్వాత 2017లో పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన రాహుల్ గాంధీ 2019లో పార్టీని గెలిపించలేకపోయారు. పైగా ప్రధాన ప్రతిపక్ష హోదా సైతం రాకుండా పోయింది. ఇందుకు దారి తీసిన కారణాలను సమీక్షించుకొని గుణపాఠాలు నేర్చుకొని పార్టీని నడిపించి బలోపేతం చేయాలని రాహుల్ అనుకుంటే కాదనేవారు ఎవ్వరూ లేరు. ఘోరపరాజయం తర్వాత సమీక్ష లేకుండా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం నైతికంగా నప్పుతుందేమో కానీ ఆచరణలో అది పలాయనవాదంగా తేలుతుంది. పదవి నుంచి తప్పుకున్న రాహుల్ ఆ పదవిలో ఎవరినైనా నియమించేందుకు కృషి చేశారా అంటే లేదు. పదవి వదిలిన తర్వాత పార్టీ ప్రధాన నాయకుడిగా మాట్లాడటం మానివేశారా అంటే అదీ లేదు. పార్టీ అధ్యక్షుడుగా లేకపోయినా ఇంతకాలం మోదీని నిలదీసి ప్రశ్నించే బాధ్యత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నారు. లేకపోతే ఆ మాత్రం ప్రశ్నించేవారు కూడా లేక మోదీ మరింత ఏకపక్షంగా పరిపాలన సాగించేవారు. ప్రతి అంశంలో మోదీని నిర్ద్వంద్వంగా విమర్శిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కరే.  కాంగ్రెస్ అధ్యక్షుడుగా జూన్ లోనో, జులైలోనో ఎవరిని ఎన్నుకున్నా రాహుల్ గాంధీకి  ఆ పార్టీలోనూ, ఈ దేశంలోనూ ప్రత్యేక స్థాయి ఉంటుంది. బాధ్యత కూడా ఉంటుంది. పార్టీ అధ్యక్షుడుగా ఆయనే ఎన్నికైతే సమస్యే ఉండదు. అధ్యక్షుడుగా ఎవరున్నా, పార్టీలో రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కొనసాగేవరకూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. వారిని మరిపించే నాయకుడు ఎవరైనా వచ్చినా ఆశ్చర్యం లేదు. లాల్ కృష్ణ అడ్వానీని అటక ఎక్కించి దేశాన్ని పరిపాలించడానికి అహ్మదాబాద్ నుంచి నరేంద్రమోదీ వస్తాడని 2013కి ముందు ఎవరైనా ఊహించారా? కాంగ్రెస్ పార్టీలో నాయకుల కొరత లేదు. అవకాశం లభిస్తే ఎవరో ఒకరు రాణించి పార్టీని ఆదుకునే అవకాశాలు ఉన్నాయి. 2013లో బీజేపీలో జరిగిన పరిణామం 2024 కంటే ముందు కాంగ్రెస్ లో సంభవించాలి. బీజేపీకి నాగపూర్ ఉంది, ఆ నగరంలో కేంద్ర కార్యాలయం గల ఆర్ఎస్ఎస్ ఉంది మార్గనిర్దేశం చేయడానికి. కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ నాయకత్వంలోని నెహ్రూ-గాంధీ కుటుంబం తప్ప ఎవ్వరూ లేరు.

Also read: కోవిద్ బలి తీసుకున్న మరో సినీ ప్రముఖుడు

మోదీ మూల్యం చెల్లిస్తారా?

కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకున్నట్టే బీజేపీ కూడా ఆత్మపరిశీలన చేసుకుంటుంది. కోవిద్ రక్కసిన అదుపు చేయకుండా బెంగాల్ ఎన్నికలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మోదీ, షా చేసిన ఘోరమైన తప్పిదం. దానికి మూల్యం చెల్లించుకుంటారా? మూల్యం చెల్పించమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ కోరతారా? ప్రతిపక్షాలనూ, దేశంలో ఇతర శక్తులనూ కలుపుకొని పోగలిగే నాయకుడిని ఎంపిక చేసి మోదీకి ఉద్వాసన చెప్పే ఆలోచన ఆర్ఎస్ఎస్ నాయకత్వం చేస్తుందా? తెలియదు. ఏమైనా జరగవచ్చు. ఏమీ జరగకపోవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles