హైదరాబాద్ : నోముల నరసింహయ్యది సంపూర్ణమైన రాజకీయ జీవితం. నకిరేకల్ మండలం పాలెంలో 9 జనవరి 1956న యాదవ కుటుంబంలో నోముల మంగమ్మ, రాములుకు ఐదుగురు సంతానంలో రెండవవాడుగా జన్మించిన నరసింహయ్య బాల్యం నుంచీ వామపక్ష భావాలకు ఆకర్షితుడైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలోనే విద్యార్థి రాజకీయాలలో ఉన్నారు. ఎంఏ, ఎల్ఎల్ బీ చేసిన తర్వాత నకిరేకల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. న్యాయవాదిగా మంచి పేరు సంపాదించుకున్నారు. నల్లగొండ జిల్లాలో అగ్రనేతగా పేరున్న మార్క్సిస్టు నాయకుడ నర్రా రాఘవరెడ్డి ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి నరసింహయ్య ప్రవేశించారు. 1987 నుంచి 1999 వరకూ నకిరేకల్ ఎంపీపీగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1999, 2004లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి మార్క్సిస్టు పార్టీ అభ్యర్థిగా శాసనసభకు గెలిచారు. సీపీఎం శాసనసభాపక్షం నేతగా పని చేశారు.
రిజర్వేషన్ మారడంతో 2009లో అప్పుడే ఏర్పడిన భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో సైతం సీపీఎం తరఫున హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నోముల ప్రయత్నించారు. కానీ పార్టీ టిక్కెట్టు రాకపోవడంతో పార్టీని వదిలి టీఆర్ఎస్ లో చేరారు. నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికలలో సీనియర్ కాంగ్రెస్ నేత కె. జానారెడ్డి చేతిలో నరసింహయ్య ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అదే జానారెడ్డిపైన 7771 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Also Read: నోములు గుండెపోటుతో కన్నుమూత
నోముల నరసింహయ్య భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఝాన్సీ రాణి, అరుణజ్యోతి వివాహితులు. ఇద్దరూ ఆస్ట్రేలియాలో స్థిరపడినారు. కుమారుడు నోముల భగత్ కుమార్ హైకోర్టు న్యాయవాది.