- సీఐడీ ప్రశ్నించేందుకు రెండు రోజులు అవకాశం
- బెయిల్ పిటిషన్ పై శనివారం వాదనలు వినడానికి జడ్జి నిరాకరణ
- కేసును సీబీఐ విచారించాలని ఉండవల్లి అరుణకుమార్ వ్యాజ్యం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి విజయవాడ న్యాయస్థానాలలో ఆశించిన ఊరట లభించలేదు. తనపైన పెట్టిన కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. కేసు అత్యంత కీలకదశలో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని హైకోర్టు న్యాయమూర్తి తెలియజేశారు. ‘‘సీఐడీ 140 మంది సాక్షులను విచారించింది, ఇంత చేశాక ఇప్పుడు కేసును నిలిపివేయడం సాధ్యం కాదు’’ అని న్యాయమూర్తి అన్నారు. ఈ ఉత్తర్వుపైన చంద్రబాబునాయుడు తరఫు న్యాయవాదులు సోమవారంనాడు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.
చంద్రబాబునాయుడిని అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని న్యాయవాదులు వాదించారు. అవినీతి ఆరోపణల్లో ఈ నియమం వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. వారి వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
కాగా, స్కిల్ స్కాం కేసును సీబీఐ విచారించాలని కోరుతూ హైకోర్టులో మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణకుమార్ వేసిన పిటిషన్ ను కోర్టు అనుమతించింది. బుధవారంనాడు ఈ పిటిషన్ విచారణకు రావచ్చు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ,సీబీఐ, ఈడీ,చంద్రబాబునాయుడు, అచ్చెంనాయుడు సహా మొత్తం 44 మందిని ప్రతివాదులుగా చేర్చారు.
ఇది ఇలా ఉండగా, చంద్రబాబునాయుడిని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నదనీ, ఆయనను తమ కస్టడీలోకి అయిదు రోజులు అనుమతించమనీ సీఐడీ చేసుకున్న వినతిని పరిశీలించిన ఏసీబీ జడ్జి హిమబిందు సీఐడీకి రెండు రోజులు మాత్రం నాయుడిని ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చింది. ఈ రెండు రోజులు కూడా ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారించాలనీ, విచారణ సమయంలోనాయుడి వెంట ఇద్దరు న్యాయవాదులు ఉండవచ్చుననీ జడ్జి చెప్పారు. నాయుడిని ఎవరెవరు ప్రశ్నిస్తారో వారి పేర్లు సమర్పించాలని కూడా సీఐడీని జడ్జి ఆదేశించారు. చంద్రబాబును ప్రశ్నిస్తున్నప్పటి వీడియోలు కానీ, ఫొటోలు కానీ బయటకు రాకూడదని జడ్జి ఆదేశించారు. చంద్రబాబునాయుడికి బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ పైన తాము రేపు వాదనలు వినిపించగలమని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. కానీ పిటిషనర్ సీఐడీ ప్రశ్నిస్తున్న సమయంలో వాదనలు వినడం సరి కాదనీ, సోమవారంనాడు వాదనలు వింటాననిీ జడ్జి చెప్పారు.