ప్రస్తుతం దేశంలో అందరూ దేశభక్తి గురించి, విలువల గురించి మాట్లాడేవారే! చేయడానికి ఇంట్లో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. బయటికి వచ్చి అమాయకుల్ని హత్య చేస్తున్నారు. అనేక రకాల వ్యభిచారాలు చేస్తున్నారు. మరి వీటికేమందాం? మనుషులమని మరచిన చోట, సంకుచితత్వం బలిసిన చోట, మానవత్వం మంటగలిపిన చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం మనిషి మనిషిగా ఆలోచించడం, మనిషి మనిషిగా బతకడం అవసరం. హేతుబద్ధతతో మానవత్వాన్ని నిలుపుకునే ప్రయత్నాలు జరిగితే సమాజం దానంతట అదే ఆరోగ్యవంతమౌతుంది. తనతో ఏడడుగులు నడిచిన బంధానికి విలువనిచ్చి భార్య శవాన్ని ఎత్తుకుని కాలహండి (ఒడిశా)లో ఏడుమైళ్ళునడిచిన భర్త దనమాజి ఉన్న గొప్ప దేశం మనది. గొప్ప నాగరికత, గొప్ప సంస్కృతి? అక్కడి ఆసుపత్రివారు, ఇతరులు ఆదరించకపోవడంలో అమానవీయత ఉంది. నిజమే! కాని విషయం తెలియగానే అక్కడి కలెక్టర్ అంబులెన్సు పంపి ఆదుకోవడంలో మానవత్వం కనిపించింది కదా? అలాంటి మానవత్వమే ఎప్పుడూ వర్థిల్లుతూ ఉండాలని శాస్త్రీయ అవగాహన గల మానవవాదులు కోరుకుంటున్నారు.
Also read: వైద్యం వేరు, మత విశ్వాసాలు వేరు కదా నాయనా?
నీ పనులకు నీవే బాధ్యుడవు
ధైవభావన, మతం, సత్ప్రవర్తన నియమావళి సమాజాన్ని ఒకప్పుడు కొంతలో కొంత సక్రమమార్గంలో పెట్టింది. మరి ఇప్పుడు దైవభావన, దుశ్చర్యలు రెండూ సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంది. దేవుడి ఆశీస్సులు తమకు ఉన్నాయని అతడు/ఆమె అండదండలతోనే తాము అడ్డదారిలో రాణిస్తున్నామని దుర్మార్గులు ఆత్మవిశ్వాసం పెంచుకుంటున్నారు. దేవుడనే వాడు ఎవరూ లేరు. నీ చెడుపనులకు నువ్వే బాధ్యుడవు. ఇహంలోనూ, ‘పరం’లోనూ నీకు సహాయపడేవారు లేనే లేరన్నది గట్టిగా, కచ్చితంగా హేతువాదులు, మానవవాదులు చెప్పగలగాలి. ఒప్పించగలగాలి. సత్యాన్ని స్థాపించగలగాలి. ఏదైనా భానవ నీడలో తాము సురక్షితంగా ఉన్నామని దుర్మార్గులు భావిస్తున్నారో వారి ఆ ‘నీడ’ను బద్దలు కొట్టాలి. అప్పుడు మానసికంగా వారు ఒంటరివాళ్ళయిపోతారు. గత్యంతరం లేక చుట్టూ ఉన్న మనుషులవైపు చూస్తారు. మనుషుల స్నేహాన్ని ఆశిస్తారు. తాము కూడా మానవమాత్రులమేనన్నది గ్రహిస్తారు. మనుషుల్లో మనుషుల్లా బతకాలన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు. ఇదంతా చెప్పుకున్నంత సులభమేమీ కాదు. కానీ, ఆ దిశలో ప్రయత్నమైతే చేయాలి కదా? ఇక సన్మార్గులుగా కనిపించే దుర్మార్గులు కొందరుంటారు. వారు మనిషి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బదీసే విషయాలు ప్రబోధిస్తూ, ప్రవచిస్తూ-తమను తాము మోసం చేసుకోవడమే కాదు, జనాన్ని కూడా మోసం చేస్తుంటారు. ఆత్మగురించి, పరమాత్మగురించి, పరలోకాల గురించి, పాప, పుణ్యాల గురించి అమోఘంగా ఉపన్యసిస్తూ తమ ఖాళీ మెదడ్లను బయటపెట్టుకుంటూ ఉంటారు. తమ మీద తమకు నమ్మకం లేని అలాంటి బలహీన మనస్కులు వారిని అనుసరిస్తుంటారు. నిజానికి పండితులకి ప్రత్యేకమైన జ్ఞానం లేదు. మాఢనమ్మకాలే వారి శాస్త్రాలు! సగటు మనిషి అజ్ఞానమే… వారి జ్ఞానం!! మరి ప్రవచనాలు వింటున్నదెవరంటే – ఎవరో తెలివితక్కువ దద్దమ్మ తన నమ్మకాల్ని జనం మీద రుద్దుతుంటే వాటిని స్వంతం చేసుకుని ‘నమ్మాలి, నమ్మాలి’ అని మనసుకు సర్ది చెప్పుకుంటున్నవాళ్ళు వీళ్లంతా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని స్పృహలోకి వైజ్ఞానికి స్పృహలోకి రావడం మంచిది.
Also read: రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన ఒక రియాల్టీ షో!
దిక్కులేనివారికి దేవుడే దిక్కా?
ఇక సన్మార్గులైనవాళ్ళు, ఏ దరీదాపూ లేనివాళ్ళు ‘దిక్కులేనివారికి దేవుడే దిక్కు’- అని అనుకోవడం ఆపేయాలి. ఎక్కడో ఏదో ఆసరా ఉందన్న భ్రమలో బతకడం మానెయ్యాలి. ఏ దిక్కులో ఎవరూ లేరు. ఎటు చూసినా మనిషే ఉన్నాడు – అని నమ్ముకోవవాలి. ఒక్కోసారి మనిషి లేకపోయినా, మనిషి సాధించిన విజయాలు నీ వెంటే ఉన్నాయని గుర్తు తెచ్చుకోవాలి. ఉదాహరణకు ఊరికి దూరంగా ఎక్కడో అడవిలో చిక్కుకుపోయినప్పుడు కనుచూపు మేరలో నీకు మనిషనేవాడు కనబడక పోవచ్చు. భయపడేదేముంది? జేబు తడిమి చూసుకో. మనిషి విజయం ఒకటి ఆండ్రాయిడ్ ఫోన్ రూపంలో నీ చేతికి తగులుతుంది. ఇకనేం, రేడియో విను. మ్యూజిక్ ఎంజాయ్ చేయ్. చుట్టూ ఉన్న ప్రకృతిని ఫోటో తీసుకో. డేటాబేస్ ఓపెన్ చేసి నెట్ ద్వారా ప్రపంచానికి కనెక్టవ్వు. ఇంగిత జ్ఞానం ఉపయోగించి, ఆ నిముషానికి నీకు ఏది అవసరమో అది చెయ్యి. జానపద కథల్లో లాలా, ఏ వనదేవతో, ఏ నదీమతల్లో, ఏ ఆకాశదేవతో ఇప్పుడు రానక్కరలేదు. అవన్నీ ఒకప్పుడు మనిషి ఊహాకల్పితాలు. ఇప్పుడు మనిసి వాస్తవంగా ఒక అద్భుతమైన పరికరం తయారు చేశాడుకదా? గుండె మీద చేయి వేసుకుని ఆలోచించుకో. ఏ దేవుడి మహిమవల్లా నీకా పరికరం దక్కలేదు. వేల మంది శాస్త్రజ్ఞుల, సాంకేతిక నిపుణుల శ్రమవల్ల నీకు అందింది. ఆ పరికరం మనుషుల కోసం మనిషి తయారు చేసిందే. ఈ సమాజం ఇలా ఉందంటే అందుకు మనిషే కారణం. ఇందులోని మంచికీ చెడుకూ అతనే బాధ్యుడు. ఏ దైవశక్తీ కాదు. వాస్తవాన్ని ఒప్పుకుంటే ముందుకు పోతావు. లేదూ ఒప్పుకోవూ? ఆ పరికరం వాడుకుంటూనే తాతలనాటి బూజు భావజాలాన్ని ఆచరిస్తానంటావూ, అది నీ ఇష్టం! అంటే నువ్వింకా ముత్తాతల నాటి కాలంలోనే బలకాలని అనుకుంటున్నావన్నమాట!! ఇదొక రకమైన హైబర్ నేషన్ (HYBERNATION). రచయితగా నేను ఆలోచించేదంతా భవిష్యత్తులోకి వెళ్ళే మనుషుల గూర్చి – గతంలోనే ముడుచుకుని నిద్రావస్థలో బతకాలనుకునేవారి గూర్చి కాదు.
Also read: నిత్య జీవితంలో వైజ్ఞానిక స్పృహ
రామన్ చెప్పిన నిజం
నోబెల్ గ్రహీత, ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ బొంబాయి విశ్వవిద్యాలయ కాన్వొకేషన్ లో 1932లో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు: ‘‘మనం శాస్త్రయుగంలో జీవిస్తున్నాం. విద్యద్దీపాలు, మోటారుకార్లు, విమానాలు తయారు చేయడంద్వారా విజ్ఞానశాస్త్రం మానవుడికి సేవచేసిందని చాలామంది అనుకుంటారు. అది పాక్షికదృష్టి మాత్రమే. వాస్తవానికి గతరెండు వందల యేళ్ళకాంలో విజ్ఞానశాస్త్రం ప్రతిపాదించే జీవిత దృక్పథాన్ని గుర్తించేవారు మృగ్యం. శాస్త్రజ్ఞానం మనకు వినూత్న ప్రపంచ దృక్పథాన్ని ఇచ్చింది. శాస్త్రజ్ఞానాన్ని ధైర్యంగా జీవితానికి సమన్వయం చేయడం మీదనే భారతదేశ భవిష్యత్తు ఆదారపడి ఉంది. దైనందిన జీవిత సమస్యలకు శాస్త్రపద్ధతిని అన్వయించడం మానవుడు నేర్చుకునే కొలది, ఆ మేరకుఅతను పెరిగి, ఉన్నత స్థితిని అందుకంటాడు. ఛాందసత్వానికి, అజ్ఞానానికి, మూర్ఖత్వానికి ప్రాతినిధ్యం వహించే కుక్కలు మొరుగుతే మొరగనీ… అనివార్యమైన శక్తితో వైభవోపేతంగా భారత జాతి ముందుకు కదిలిపోతుంది’’- అనీ, ఛాందసవాదుల్ని ఎంత కటువుగానైనా తిట్టొచ్చునన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే ఇక్కడ మతగ్రంథాల గూర్చి విశ్వవిఖ్యాత సైన్స్ రచయిత రిచర్డ్ డాకిన్స్ (RICHARD DAWKINS) చెప్పిన విషయాలు గుర్తు చేసుకుందాం. ‘‘మనకు లభ్యమైన మతగ్రంథాలన్నీ వరెవరో వేలమంది రాసినవి. విడగొట్టబడి, జోడించబడి, అనువదించడబడి, చెడగొట్టబడి, ఒక్కోసారి సరిచేయబడి, ఒకరికి ఒకరు తెలియకుండా, ఎవరు ఎవరో తెలియకుండా శతాబ్దాల కాలంలోమార్పులు చేర్పులు చేయబడుతూ, కాపీ చేసివారి తప్పుడు రాతలతో భద్రపరచబడుతూ మనదాకా వచ్చాయన్నమాట!’’
Also read: భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరు?
మతగ్రంథాలకు ప్రామాణికత ఏదీ?
డాకిన్స్ చెప్పిన దాంట్లో పూర్తి నిజం ఉంది. శాస్త్రగ్రంథాల కున్నట్టు వీటికి ప్రామాణికత ఉండదు. దేవుడు ఒక నమ్మకం ఎలాగో అతని చట్టూ తిరుగుతూ వచ్చిన, అతని లీలలతో కూడిన మతగ్రంథాలన్నీ నమ్మకాలే. వైజ్ఞానిక శాస్త్రగ్రంథాల్లో కాలాన్ని అధిగమించి నిలబడిన రుజువులూ, సాక్ష్యాలూ ఉన్నాయి. వాటిని నమ్మడానికి ఆధారాలున్నాయి. ఆధారాల్లేని మతగ్రంథాలకు ప్రామాణికత ఎలా వెతకడం? ఎవరెవరో అనామక రచయితలు చెప్పినవాటికి, సరైన రుజువులు లేనివాటికి ప్రామాణికత గౌరవం కల్పించి కొందరు మతపెద్దలు గొప్పగా చెపుతూ జనం చెవుల్లో పువ్వులు పెడుతుంటారు. పాపం జనం వాటినే గొప్ప విషయాలుగా నమ్ముతుంటారు. హేర్ (MANALYN MURRAY O’ HAIR) అనే మహిళా నాస్తికవాది చెప్పిన విషయం గమనించండి-‘‘హేతువాది తనను తాను ప్రేమించుకుంటాడు. భగవంతుడికి బదులు తన చుట్టూ ఉన్న మనుషుల్ని ప్రేమిస్తాడు. స్వర్గమనేది ఎక్కడో లేదు. మనమే మనుషులమంతా కలిసి దాన్ని ఈ భూమిమీదే నిర్మించుకోవాల్సి ఉంది. అంతా కలిసి ప్రశాంతంగా జీవించాల్సి ఉందని..మానవ వాది కలలు గంటాడు’’-
కొన్ని వేల శాతాబ్దాలుగా గతంలో బతుకుతున మన సమాజం, వైజ్ఞానిక దృక్పథంతో ఇప్పుడిక భవిష్యత్తులోకి దూసుకుపోవాల్సి ఉంది.
ఇటు భూతకాలాన్ని, అటు భవిష్యత్తును వొరుసుకుంటూ
పారే జీవనది, జీవననది – వర్తమానం
సషుప్తావస్థలో ఉండి, తగిన సమయంకోసం
నిరీక్షిస్తున్న ఈ వర్తమానం – రాబోయే భవిష్యత్తు!
Also read: పారా సైకాలజీ – సూడో సైన్స్ అని తేల్చిన శాస్త్రజ్ఞులు