* 577 రోజులుగా వన్డే సెంచరీ లేని విరాట్
* సొంత గడ్డపై 10వేల అంతర్జాతీయ పరుగుల రికార్డు
ఆధునిక క్రికెట్లో అలవోకగా శతకాలు బాదటంలో దిట్టగా పేరుపొందిన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీని మూడంకెల స్కోరు వెక్కిరిస్తూ వస్తోంది. తన కెరియర్ లో ఇప్పటికే టెస్టులు, వన్డేలలో కలిపి 70 సెంచరీలు బాదిన విరాట్ 71వ అంతర్జాతీయ శతకం కోసం గత 577 రోజులుగా ఎదురుచూస్తున్నాడు.
2019లో టెస్టు చివరి శతకం
విరాట్ కొహ్లీ తన చివరి అంతర్జాతీయ సెంచరీని కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన డే-నైట్ టెస్టులో సాధించాడు. 2019 నవంబర్ 23న ఈ శతకం సాధించిన తర్వాత నుంచి కొహ్లీ మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు.
Also Read : కృణాల్ పాండ్యా ప్రపంచ రికార్డు
రాంచీ వేదికగా వన్డే చివరి సెంచరీ
వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల వరుసలో సచిన్ తరువాతి స్థానంలో ఉన్న విరాట్ కొహ్లీ..577 రోజుల క్రితం తన చివరి సెంచరీ నమోదు చేశాడు. 2019 మార్చి 8న రాంచీ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ శతకం బాదాడు.
గత ఏడాది ఆడిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో కొహ్లీ 173 పరుగులు సాధించాడు. అంతేకాదు… ప్రస్తుత టీ-20 సిరీస్ లో మూడు హాఫ్ సెంచరీలతో సహా 231 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
2020 సీజన్లో భాగంగా మూడు ఫార్మాట్లలో కలసి మొత్తం 30 అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 1014 పరుగులతో 34.96 సగటు నమోదు చేశాడు. కనీసం ఒక్క శతకమూ సాధించలేకపోయాడు.
Also Read : అయ్యర్ కు విదేశీ లీగ్ చాన్స్
కేవలం 9 అర్థశతకాలు మాత్రమే సాధించిన కొహ్లీ 17సార్లు 30 పరుగుల కంటే తక్కువ స్కోర్లకే అవుటయ్యాడు. ప్రస్తుత సీజన్లో సైతం నాలుగు టెస్టులు, ఐదు టీ-20 మ్యాచ్ లు, పూణే తొలివన్డేతో కలుపుకొని ఆరు అర్థశతకాలు మాత్రమే కొహ్లీ సాధించగలిగాడు. అయితే …ఆలోటును ప్రస్తుతవన్డే సిరీస్ లోని ఆఖరి రెండుమ్యాచ్ ల్లోనైనా పూడ్చుకోవాలన్న పట్టుదల విరాట్ లో కనిపిస్తోంది.
ఊరిస్తున్న 5వేల పరుగుల హోమ్ రికార్డు
వన్డే క్రికెట్లో సొంత గడ్డపై 5వేల పరుగుల రికార్డు సైతం విరాట్ ను ఊరిస్తోంది. ఇంగ్లండ్ తో ప్రస్తుత తీన్మార్ సిరీస్ వరకూ 135 పరుగుల దూరంలో ఉన్న విరాట్ …తొలివన్డేలో 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Also Read : మరాఠాగడ్డపై వన్డే సమరం
సిరీస్ లోని మిగిలిన రెండువన్డేలలో 70 పరుగులు చేయగలిగితే 5వేల పరుగుల క్లబ్ లో చేరగలుగుతాడు. స్వదేశంలో అత్యధికంగా వన్డే పరుగులు సాధించిన దిగ్గజాలలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ (6976), కంగారూ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (5406), సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్ కలిస్ (5178) మొదటి మూడు స్థానాలలో కొనసాగుతున్నారు.
ప్రస్తుత వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు వరకూ విరాట్ 4,865 పరుగుల రికార్డుతో ఉన్నాడు. 5వేల పరుగులు సాధించగలిగితే వన్డే చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా కొహ్లీ నిలిచిపోతాడు.
అయితే…స్వదేశీగడ్డపై అత్యంత వేగంగా 10వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా విరాట్ మరో ప్రపంచ రికార్డు తనపేరుతో లిఖించుకొన్నాడు. కంగారూ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరుతో ఉన్న రికార్డును కొహ్లీ తెరమరుగు చేశాడు.
Also Read : లెజెండ్స్ టీ-20 విజేత భారత్