దిల్లీ: అమరావతి భూముల క్రయవిక్రయాలలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం ధ్రువీకరించింది. ఇద్దరు న్యాయమూర్తులతో – జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి – కూడిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సోమవారంనాడు కొట్టివేసింది. వెలగపూడికి చెందిన సలివేంద్ర సురేశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకొని రాష్ర నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ) చెక్కా గురుమురళీమోహన్, తదితరులపైన కేసు నమోదు చేసింది. దాన్ని సవాలు చేస్తూ మురళీమోహన్, తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు వాదనలు ఆలకించి, రికార్డులను పరిశీలించిన తర్వాత 19 జనవరి 2021న ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ తీర్పు ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. హైకోర్టు పొరపాటు చేసిందనీ, అధికార రహస్యాల చట్టంలోని 418వ సెక్షన్ ను పరిగణనలోకి తీసుకోలేదనీ, కొంటున్నవారికి భూములు ఎందుకు కొంటున్నారో తెలుసు కానీ అమ్ముకున్నవారికి అక్కడే రాజధాని వస్తుందని తెలియదనీ, అందువల్ల వారు మోసబోయారనీ దవే వాదించారు. అసలు ఫిర్యాది సలివేంద్ర సురేష్ తరఫున మరో సీనియర్ న్యాయవాది పరాస్ కుహద్ వాదించారు. ఐపీసీ 415 సెక్షన్ లోని ప్రధానమైన అంశాలను హైకోర్టు విస్మరించిందని అన్నారు.
ప్రతివాది మురళీమోహన్ తరఫున ఇంకో సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ వాదించారు. హైకోర్టు సమస్త వాస్తవాలనూ పరిశీలించి న్యాయంగా, ధర్మంగా, పారదర్శకంగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఎవ్వరికీ తెలియని అంతర్గత సమాచారం తెలుసుకొని ఏ పని చేసినా, లావాదేవీలు జరిగినా అది ఇన్ సైడర్ ట్రేడింగ్ అవుతుందనీ, గుంటూరు, విజయవాడ నగరాల మధ్య రాజధాని వస్తుందని 10 జూన్ 2014నాడే చంద్రబాబునాయుడు ప్రకటించినట్టు ఒక ఇంగ్లీషు పత్రికలో వచ్చిందనీ, అందరికీ తెలిసిన విషయాన్ని పట్టుకొని ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వాదించడం చట్టసమ్మతం కాదనీ దివాన్ వాదించారు. ఆరేళ్ళ తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత ఫిర్యాదు చేయడం ఆశ్చర్యంగా ఉన్నదనీ, పనికట్టుకొని ఆరోపణలు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందనీ, అందువల్ల కేసును కొట్టివేయాలని దివాన్ వాదించారు. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ టూథ్రా కూడా ప్రభుత్వం మారగానే కేసులు వేయడాన్ని తప్పుపట్టారు.
ఫిర్యాదు చేయవలసింది ప్రభుత్వ అధికారులపైన కనుక ఆ ప్రభుత్వం మారే వరకూ ఆగి ఆ తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆక్షేపణ లేదనీ, క్రిమినల్ కేసులలో ఫిర్యాదు ఎప్పుడు చేశారన్నది ముఖ్యం కాదనీ దవే చెప్పారు. భూములు కొన్నవారు ఇరవై రెట్లు ఎక్కువ లబ్ది పోందారని దవే అన్నారు. ఇప్పుడ రాజధాని పనులు నిలిపివేసిన తర్వాత భూముల ధరలు ఇరవై రెట్లు పడిపోయాయనీ, ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నది అభూతకల్పన అనీ, పిటిషన్ ను కొట్టివేయాలనీ లూథ్రా వాదించారు. భూములు విక్రయించినవారు ఎస్ సీ లనే వాస్తవాన్ని ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని ప్రభుత్వ న్యాయవాది మహపూజ్ నజ్కీ అన్నారు. కావాలని ఆరోపణలు చేస్తూ వాదనలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతూ కేసు కొట్టివేయాలని లూథ్రా స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలను వినిన తర్వాత ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ధ్రువీకరించింది.