తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి ముందస్తు ఎన్నికలకు పోవడం లేదని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఆదివారంనాడు ప్రకటించారు. తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ ఎల్పీ సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పదిలక్షలమందితో తెలంగాణ విజయ గర్జన నిర్వహిస్తామనీ, ప్రతిపక్షాలకు దిమ్మతిరిగి పోవాలనీ ఆయన అన్నారు.
ఇక ఓపిక పట్టేది లేదు
‘‘ఇష్టారీతిన పిచ్చి ప్రేలాపనలు పేలుతున్న వారికి ఎక్కడికక్కడ గట్టి సమాధానాలు చెప్పాలి. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రం అనని రంగాల్లో ఆదర్శంగా నిలవాలన్న తపనతో మనం పని చేసుకుంటుూ పోతున్నాం. అందుకే ఇప్పటిదాకా, కొంత సహనం, ఒపికతో ఉన్నాం. మనం ఓపికతో ఉన్నాం కదా అని ఎవడు పడితే వాడు..ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇక ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. అన్ని స్థాయిల్లో వాటికి దీటుగా సమాధానాం చెప్పాలి. ఆ సమాధానం రీసౌండ్ వచ్చేవా ఉండాలి. మరోసారి ఎవరైనా మనల్ని వేలెత్తి చూపాలంటే జంకు రావాలి. ఆ విధంగా మనం మన శ్రేణుల్ని సమాయత్తం చేయాలి,’’అంటూ కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులకూ, కార్యకర్తలకూ పిలుపునిచ్చారు.
‘‘గతంలో మాదిదిగా అసెంబ్లీ మెుందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రసక్తి లేదనీ,ప్రభుత్వానికి ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉన్నదనీ, ఈ లోపు చేయవలసిన పనులు ఉన్నాయనీ, వాటిని పూర్తి చేస్తామనీ కేసీఆర్ అన్నారు.
‘‘కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో మనమే కీలకపాత్ర ఫోషించే స్థాయికి ఎదుగుతాం. అందులో ఎవరికీ అనుమానం అక్కరలేదు. గతంలో అక్కడక్కడా చిన్నచిన్న పొరపాట్లు జరగడం వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఈ సారి ఆ ప్రసక్తే ఉత్పన్నం కానివ్వం,‘‘ అని స్పష్టం చేశారు.
పర్యవేక్షణ కేటీఆర్ ది
ఈ నెల 26 లేదా 27న హుజూరాబాద్ లో కేసీఆర్ ఎన్నకల బహిరంగసభలో మాట్లాడతారు. వరంగల్లు సభకు ప్రతి ఊరు నుంచీ బస్సులో సభికులు హాజరు కావాలనీ, వరంగల్లు సభ పర్యవేక్షక బాధ్యత కల్వకుంట్ల రామారావుకు అప్పగించామని చెప్పారు. పార్టీకి చెందిన వివిధ నాయకులతో కేటీఆర్ భేటీ జరిపి బహిరంగ సభ సన్నాహాల గురించి చర్చించారు.
నోటిఫికేషన్ జారీ
ఇది ఇలా ఉండగా, టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఎన్నికల కోలాహలం చోటు చేసుకున్నది. టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలైనాయి. ఇందుకు మంత్రులూ, ఇతర నాయకులూ పోటీ పడ్డారు. ఈ నెల 22 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు.
హుజూరాబాద్ మనదే
దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామనీ, టీఆర్ ఎస్ ను కొట్టే శక్తి ఎవరికీ లేదనీ, మనల్ని చూసి దేశం పాఠాలు నేర్చుకుంటున్నదనీ, మనం చేసిన పనులు ప్రజలకు వివరంగా చెప్పుకోవలసిన అవసరం ఉన్నదనీ ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే అనేక సర్వేలు పరిస్థితి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్టు తేల్చి చెబుతున్నాయనీ, అన్ని సర్వేలలో టీఆర్ఎస్ విజయానికి 13 శాతం ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తేలిందనీ కేసీఆర్ చెప్పారు. ఎవరేమి చెప్పినా అక్కడ ఎగిరేది గులాబీ జెండానేనంటూ ఆయన విశ్వాసం వెలిబుచ్చారు. పరిస్థితులను బట్టి ఈ నెల 26 లేదా 27 తేదీలలోో హుజూరాబాద్ లో బహిరంగ సభ నిర్వహిస్తానని తెలియజేశారు.