Sunday, December 22, 2024

కేటీఆర్ సీఎం అయినా మంత్రివర్గం మారదా?

జె సురేందర్ కుమార్, ధర్మపురి

ముఖ్యమంత్రి  కేసీఆర్ తనయుడు మంత్రి తారక రామారావు (కేటీఆర్) సీఎంగా బాధ్యతలు చేపట్టినా ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.

కేటీఆర్  త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో చలికాలంలోనూ వేడి పుట్టిస్తోంది. తాము కేటీఆర్ క్యాబినెట్ లో మంత్రులు అవుతామని ఆశల పల్లకిలో తేలియాడుతున్న వారికి ఇది మింగుడు పడని సమాచారం. కేటీఆర్ సీఎం అవుతాడా?  కెసిఆర్ సీఎం పదవి నుంచి తప్పుకుంటారా?  కేబినెట్లో మార్పులు జరుగుతాయా? అనేవి ఊహాగానాలు. ఆశావాహులు మాత్రం  ఆశల పల్లకిలో విహరించడం తప్ప అధికారికంగా ఈ క్షణం వరకు ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. అయితే, ఎమ్మెల్యేలు, మంత్రులు పోటాపోటీగా నర్మగర్భంగా, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్వయం ప్రకటిత అధికార పార్టీ మేధావులు, నాయకులు,  విశ్లేషకులు,  మంత్రి కేటీఆర్ శక్తిసామర్ధ్యాలను ప్రస్తుతిస్తూ, డైనమిక్ లీడర్ అంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని అంటూ, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అంటూ కేటీఆర్ ను  ఇంద్రుడు, చంద్రుడు, బహుముఖప్రజ్ఞాశాలి, యువనేత అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్న విషయాలను ప్రచార సాధనాలు ప్రచురిస్తున్నది, వినిపిస్తున్నది వాస్తవమే.

Also Read : తారక రాముడి పట్టాభిషేకానికి ముహుర్తం ఖరారు

మంత్రివర్గంలోకి ఒక్కరే?

ప్రస్తుతం  ఊహలు వాస్తవ రూపం  దాల్చి మంత్రి తారక రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నిర్వహిస్తున్న  మంత్రిత్వశాఖ ఖాళీ స్థానంలో  మరొకరిని మంత్రిగా  చేర్చుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఒక్కరు ఎవరిని తీసుకుందాం అని తర్జనభర్జనలు అధిష్టానంలో జరుగుతున్నట్టు సమాచారం.  ప్రస్తుతం  భారతీయ జనతా పార్టీ విమర్శల జడి  వానలో తడసి ముద్దవుతున్న అధికారపార్టీ  హోమ్ శాఖ బాధ్యతలు మరొకరికి అప్పగించాలని భావిస్తున్నారు. సీనియర్ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లకు కీలక మంత్రిత్వశాఖలతో పాటు ఒక్కరికి పార్టీ బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల బోగట్టా.

మేలో కేటీఆర్ కి సీఎం బాధ్యతలు?

సీఎం కేసీఆర్ స్వతహాగా  దైవభక్తి పరాయణుడు. వాస్తు , ముహూర్తం, తార , చంద్ర బలం పట్ల విశ్వాసం ఉన్నవారు. గురుమౌడ్యమి, శుక్రమౌఢ్యమి దాటిన తర్వాతనే తనయుడు తారక రామారావుకు ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్టు భోగట్టా. చాలామంది అనుకున్నట్టు ఫిబ్రవరి మాసంలో  పట్టాభిషేకం ఉండకపోవచ్చుననీ, మే 4న శుక్రమౌఢ్యమి అనంతరం ఈ కార్యక్రమం జరగవచ్చనీ జ్యోతిష్య పండితులు అంటున్నారు. దీనికితోడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, హైదరాబాద్, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికలు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలు వెల్లడైన తర్వాత కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవీబాధ్యతలు అప్పగిస్తారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఏప్రిల్ మాసంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అప్పటికీ అన్ని రకాల ఎన్నికల ప్రక్రియలూ పూర్తవుతాయి. దీనికితోడు మొదటిసారి కె సి ఆర్ ఆర్ సిఎంగా  ప్రమాణ స్వీకారం లాంటి బలమైన ముహూర్తం గురించి ఆయన వేదపండితులనూ, జ్యోతిష్యులనూ అడిగి తెలుసుకుంటున్నారని సమాచారం. 2014 జూన్ 2న ఉదయం 8.15 నిమిషాలకు కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం జయ నామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పంచమి సోమవారం పుష్యమి నక్షత్ర యుక్త మిధున లగ్నం సుముహూర్త లగ్నంలో గురు, బుధుడు  లాభంలో శుక్ర, కేతువులు ఉన్న శుభ ముహూర్తం ఇది. రెండవ సారి ముఖ్యమంత్రిగా 13 డిసెంబర్ 2018 నాడు గం. 1. 25 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆరోజు భక్తి శ్రీ విళంబి నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్టి గురువారం ధనిష్టా నక్షత్ర యుక్త మీన లగ్నం అయింది. మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం తో పోలిస్తే ఈ ముహూర్తం కొంత సామాన్యమైన  ముహూర్తంగా జ్యోతిష్యులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, కెసిఆర్  జన్మించిన 1954 వ సంవత్సరం తెలుగు  లో విజయ నామ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మాఘ పౌర్ణమి కావడం ప్రస్తావనార్హం. ( పున్నమి నాడు మగపిల్లవాడు , అమావాస్య నాడు ఆడపిల్ల పుడితే వారు అదృష్ట జాతకులు గా జీవనం కొనసాగిస్తార నే నమ్మకం సమాజంలోని కొంత మంది లో  ఉందనే విషయం విదితమే)  దీనికితోడు ఈ సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 11 01 వరకు గురుమౌడ్యమి ఉంది.  తిరిగి 14వ తేదీన 01.20 నిమషం నుంచి శుక్ర మౌడ్యమి మే 4వ తేదీ వరకు ఉంటుంది.

Also Read : కేసీఆర్ కి మార్చి పిదప మహర్దశ?

జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతోంది?

భారతీయ జ్యోతిష్యం ప్రకారం గురుమౌడ్యమి గాని శుక్ర మౌడ్యమి సమయంలో   వివాహ లు ఇతర శుభ కార్య క్రమాలు నిషిద్ధం.  ఫిబ్రవరి 13వ తేదీ ఒక్కరోజు మాత్రమే మౌడ్యమి లేని రోజు తిరిగి మే 4 వరకు సుముహూర్త లు లేవు కాబట్టి పుకార్లు షికార్లు చేస్తున్నా ఫిబ్రవరి 18వ తేదీన సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండకపోవచ్చని పండితులు అంటున్నారు.  ఒకవేళ మూఢం లేనప్పటికీ ఫిబ్రవరి 18న భరణి నక్షత్రం ఉండటం వలన అది ఏ రకమైన ముహూర్తానికి జ్యోతిష్యశాస్త్రం మేరకు  పనికిరాదు. కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కేసీఆర్ అనుమతితోనే కొందరు మంత్రులు వ్యాఖ్యానించారు. ఎవరు ఏ విధంగా స్పందిస్తారో చూడటం ఈ ప్రచారం ఉద్దేశం కావచ్చు. కారణం ఏదైనా ప్రచారాన్ని ఆపుచేయాలని, కొంతకాలం వేచి చూడాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అందుకే ఆదివారంనాడు పార్టీ ముఖ్యులందరికీ గుర్రాన్నికట్టివేయాలంటూ కేసీఆర్ సందేశం అందిందని అంటున్నారు.

Also Read : కేటీఆర్ పట్టాభిషేకమా? కేసీఆర్ అస్త్ర సన్యాసమా?

రాజ్యసభకు కేసీఆర్ ?

సీఎం కేసీఆర్  తనయుడికి సీఎం పట్టం కట్టి కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పడం కోసం రాజ్యసభకు వెళతారని కొందరి అంచనా.  కేశవరావు, సురేష్ రెడ్డి లు ఏప్రిల్  2020 న రాజ్యసభకు ఎన్నికయ్యారు. వాళ్ళ పదవీకాలం మరో ఐదు సంవత్సరాల వరకూ ఉంటుంది. సంతోష్ కుమార్, లింగయ్యయాదవ్, బండ ప్రకాష్ లు 2018 ఏప్రిల్ 3న ఎన్నికయ్యారు. వారు 2024 వరకూ పదవులలో కొనసాగుతారు.  కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాసులు 2016 జూన్ 22న రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలం జూన్ 2022లో, అంటే మరి 15 మాసాలలో, ముగియనున్నది. బెంగాల్ ,తమిళనాడు ఎన్నికల ఫలితాలు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకం. రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ ఢిల్లీలో మకాం వేసి కేంద్ర రాజకీయాల్లో ఏమి చేయగలరో పరిశీలిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles