నితీశ్ కుమార్ ను బీహారీయులు “సుశాన్ బాబు” అనే ముద్దుపేరుతో పిలుచుకుంటారు. రాముడు మంచి బాలుడు లాగా, మంచి పాలకుడు అనే ఉద్దేశ్యంతో నితీశ్ కు ఈ పేరు దక్కింది. పదవిని కాపాడుకోవడానికి, ఎదగడానికి రాజకీయ రణక్షేత్రంలో వ్యూహ ప్రతి వ్యూహాలు చేసినా, వ్యక్తిగతంగా నిజాయితీపరుడుగా, మంచిపాలకుడుగానే ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ ప్రవర్తన, ఈ పాలనే ఇన్నేళ్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో పెట్టింది. మరోసారి ముఖ్యమంత్రి స్థానం దక్కించింది.
పదవులు కొత్తకాదు
పెద్ద పదవులేమీ అతనికి కొత్త కాదు. కేంద్ర మంత్రిగానూ పదవులు అనుభవించారు. 2020ఎన్నికల్లో ఎన్ డి ఏ కూటమి ఆధిక్యం సాధించినా, నేడు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి దక్కినా, నైతికంగా నితీశ్ కుమార్ ఓడిపోయినట్లే లెక్క. గత ఎన్నికల్లో 71 సీట్లు దక్కించుకున్న తన పార్టీ జెడియు ఈసారి 43సీట్లు తెచ్చుకొని సగానికి పడిపోయింది. కన్నులొట్టపోయి,అత్తెసరు మార్కులతో, బిజెపి సహకారంతో ఎట్టకేలకు నితీశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇంతకంటే ఓటమి ఏమి ఉంటుంది? ఈ ఎన్నికల్లో ఆర్ జె డి, బిజెపి బాగా లాభపడ్డాయి. బిజెపికి గత ఎన్నికల్లో 53సీట్లు వచ్చాయి. ఈసారి 74 సీట్లు కైవసం చేసుకొని, గతంలో కంటే 21సీట్లు అధికంగా గెలుచుకొని లాభపడింది. గత ఎన్నికల్లో 81సీట్లతో సింగల్ లార్జెస్ట్ పార్టీగా ముద్ర వేసుకున్న ఆర్ జె డి, నేటి ఎన్నికల్లో కూడా 75సీట్లు పొంది, అదే స్థానం దక్కించుకుంది.
కాంగ్రెస్ తక్కువ సీట్లకు పోటీ చేసి ఉంటే…
కాంగ్రెస్ మాటలకు తల ఒగ్గి, సగం సీట్లు కేటాయించడం వల్ల ఆర్ జె డి భారీగా నష్టపోయింది. సీట్ల షేర్ కాంగ్రెస్ కు తగ్గించి వుంటే, ఇంకా ఎక్కువ సీట్లు ఆర్ జె డికి దక్కేవి. సీన్ (దృశ్యం) వేరే విధంగా ఉండేది. ఈ రోజు నితీశ్ స్థానంలో తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండేవి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాజ్ నాథ్ సింగ్, నడ్డా వంటి అగ్రనేతలు, రాష్ట్ర రాజకీయాల్లో పండిపోయిన నితీశ్ కుమార్, సుశీల్ మోదీ వంటి పెద్ద నాయకులను తట్టుకొని, కురువృద్ధుడైన లాలూ ప్రసాద్ యాదవ్ రణక్షేత్రంలో తోడుగా లేకపోయినా, ఇన్ని సీట్లు గెలుచుకొని, ఇంత దృఢమైన పోటీ ఇచ్చిన 31ఏళ్ళ యువకుడు తేజస్వీదే నిజమైన గెలుపుగా విశ్లేషకులందరూ భావిస్తున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం నితీశ్ కు పదవి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిజెపి పెద్దలు మాట ఇచ్చినట్లుగా నితీశ్ కుమార్ ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. నిజంగా, పాలన తన పగ్గాల్లో ఉంటుందా? చూడాల్సిందే. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా బిజెపి అభ్యర్థులే ఎన్నికయ్యారు. వివిధ శాఖల మంత్రులుగానూ మెజారిటీ సభ్యులు బిజెపికి చెందినవారే ఉండే అవకాశం ఉంది. కీలకమైన పోర్టిఫోలియోస్ కూడా బిజెపి దక్కించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా, ఐదేళ్ల పాటు నితీశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా, కొనసాగనిస్తారా, తానే స్వచ్ఛందంగా పదవి నుండి దిగిపోతారా కాలంలోనే తేలిపోతుంది.
చరిత్ర సృష్టించిన నితీశ్
ఇప్పటికే 3సార్లు, దాదాపు 15ఏళ్ళ పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన నితీశ్ వరసగా నాల్గవసారి కూడా సింహాసనం అధిరోహించి చరిత్ర సృష్టించారు. చాలా వరకూ మంచి పాలనే అందించారు. యాదవ్, రాజ్ పుత్ మొదలు అనేక కులాల అధిపత్యాల మధ్య నిత్యమూ కురుక్షేత్రంగా ఉండే బీహార్ రాజకీయ క్షేత్రంలో అల్ప సంఖ్యతో , సామాజికంగా పెత్తనంలో లేని కుర్మీ సామాజిక వర్గం నుండి వచ్చిన నితీశ్ కుమార్ బీహార్ రాజకీయాల్లో ఇన్నేళ్లపాటు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా గొప్ప చరిత్ర సృష్టించారు. అందులో సందేహమే లేదు. జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి హేమాహేమీల ప్రభావంతో సోషలిస్ట్ మార్గంలో నడచి, నేటి నయా రాజకీయ భావజాలానికీ ఒదిగి, ఎదిగిన నాయకుడు నితీశ్.
ప్రగతి రథ సారథి
బీహార్ లో నితీశ్ ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. అభివృద్ధి పథంలో నడిపించారు. బీహార్ లో పరిపాలన చెయ్యడం ఆషామాషీ కాదు. తనదైన పద్ధతిలో కథ నడిపించారు. చేతనైనంత వరకూ అవినీతిని అరికట్టగలిగారు. హింసను కొంతైనా తగ్గించగలిగారు. ఉపాధ్యాయులు, వైద్యులను అసంఖ్యాకంగా నియమించి, పల్లెల్లో వెలుగులు పూయించారు. విద్యుత్, రోడ్ల సౌకర్యాలు కలిపించడంలో పురోగతి సాధించారు. మహిళలలో అక్షరాస్యతను పెంచడంలో కీలక భూమిక పోషించారు. బీహారీల సగటు ఆదాయాన్ని రెట్టింపు చెయ్యడంలో కృతకృత్యులయ్యారు. ఒకప్పటి రౌడీ రాజ్యాన్ని అణగదొక్కి, శాంతియుత పాలన అందించడానికి తన స్థాయిలో సాధ్యమైనంత మేరకు కృషి చేశారు. ఇవన్నీ నితీశ్ విజయగాథలు, సుపరిపాలనా పార్శ్వాలు.
నైతిక పతనం
అధికారం నిలబెట్టుకోడానికి తరచూ సంబంధాలు మార్చుకొని, నైతికతకు మైనస్ మార్కులు తెచ్చుకున్నారు. సుదీర్ఘంగా 15ఏళ్ళు పాలించి, ప్రజలకు ముఖం మొత్తేట్టు చేసుకున్నారు. పరిపాలనపై వ్యతిరేకత తెచ్చుకున్నారు. కరోనా కాలంలో వలస కార్మికుల విషయంలో ఘోరంగా విఫలమై చెడ్డపేరు మూట గట్టుకున్నారు. లక్షలాది మంది ఉపాధి నేడు ప్రశ్నార్ధకంగా మారింది. 10లక్షల ఉద్యోగాల కల్పన అంటూ, తాజా ఎన్నికల్లో ఎదుర్కొన్న సవాల్ ను స్వీకరించి, ఆచరణలో నియామకాలు సాగిస్తేనే ప్రజల్లో మళ్ళీ విశ్వాసం పెరుగుతుంది. ప్రస్తుతం జె డి యు తెచ్చుకున్న ఫలితాలను చూస్తే, ముఖ్యమంత్రి పదవిలో నితీశ్ ఉన్నప్పటికీ, బిజెపి ఆధిక్యమే రాజ్యమేలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యువత, మహిళల్లో నితీశ్ ప్రాముఖ్యత కోల్పోయారు. అదే సమయంలో, తేజస్వీ యాదవ్ ఈ వర్గాల నుండి మంచి మద్దతు పొందుతున్నారు.
నితీశ్ పక్కలో బల్లెం బీజేపీ
నితీశ్ కు ప్రతిపక్షమైన ఆర్ జె డి తో పాటు, బిజెపి కూడా పక్కలో బల్లెంగానే ఉన్నాయి. జెడియు సభ్యులంతా అదే పార్టీలో కొనసాగుతారా, బిజెపిలోకి జంప్ అవుతారా చెప్పలేం. అలాగే, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బిజెపి వైపు గోడ దూకే అవకాశాలు లేకపోలేదు. రాజకీయపరమైన సవాళ్లతో పాటు, రాష్ట్ర అభివృద్ధిలోనూ అనేక సవాళ్లు ఎదురుగా కనిపిస్తున్నాయి. కరోనా ప్రభావంతో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయింది. రైతాంగం, కార్మికుల సమస్యలతో పాటు పరిశ్రమల పునర్నిర్మాణ అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. యువతకు ఉద్యోగ కల్పన కూడా పెద్ద సవాలే. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది కాబట్టి, ఢిల్లీ నుండి ప్రోత్సాహం ఆశించిన స్థాయిలో ఉండవచ్చు.
ముఖ్యమంత్రి పదవిపైన బీజేపీ కన్ను
అదే సమయంలో, బలాన్ని పెంచుకున్న బిజెపికి, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచన కూడా బలంగా ఉంటుంది. పదవి కోసం సంకీర్ణాలను పలు రకాలుగా మార్చుకున్న నితీశ్ పై బిజెపి అధిష్ఠానానికి ఏ మేరకు విశ్వాసం ఉంటుందన్న విషయం కూడా ఆలోచించాల్సిన అంశమే. ఏది ఏమైనా, నితీశ్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఐదు సంవత్సరాల పాటు సంపూర్ణంగా పదవిలో కొనసాగితే అద్భుతమేనని చెప్పాలి. ఒక వేళ, ఈలోపే ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోతే, కేంద్ర మంత్రి పదవిని కేటాయించి, బిజెపి నైతికతను చాటుకునే అంశాన్ని కొట్టిపారేయలేం. సమర్ధవంతమైన, సుపరిపాలన అందించి, నితీశ్ కుమార్ తను దక్కించుకున్న “సుశాన్ బాబు” అనే పేరును నిలబెట్టుకుంటారని ఆశిద్దాం.