• గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ల బదిలీలను తిరస్కరించిన ఎస్ఈసీ
ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఎన్నికల సంఘం ఎన్నికలను రీషెడ్యూల్ కూడా చేసింది. ఈ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వివాదస్పదమవుతున్నాయి. తాజాగా పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ బదిలీ వ్యవహారం గందరగోళంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతాధికారుల బదిలీల ప్రదిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ బదిలీ ప్రతిపాదనలను నిమ్మగడ్డ తిరస్కరించారు. ఎన్నికల ప్రక్రియ కీలకదశలో ఉన్నందున బదిలీలు సరికాదని స్పష్టం చేశారు. బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తే విధివిధానాలు పాటించాలని సూచించింది.
ఇదీ చదవండి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సర్వోన్నత న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ తెలిపారు. నోటిఫికేషన్ రీ షెడ్యూల్ చేశామని ఈ సమయంలో ఇద్దరు అధికారుల బదిలీ సరైన చర్చ కాదని ఎస్ఈసీ అభిప్రాయపడ్డారు. కొత్తగా వచ్చిన అధికారులు ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొనే అవశాశం ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
బదిలీలను పట్టించుకోమన్న పెద్దిరెడ్డి:
ఎస్ఈసీ ఎంతమందిని బదిలీ చేసుకున్నా మేం పట్టించుకోమంటూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ ప్రకటన జారీచేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: సుప్రీం తీర్పుతో ఏపీలో వేగంగా మార్పులు
ద్వివేది, గిరిజాశంకర్ లపై చర్యలకు ఎస్ఈసీ ఆదేశాలు:
మరోవైపు ఏపీ పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ లపై చర్యలకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని ఎస్ఈసీ స్పష్టం చేశారు. అధికారుల అలసత్వం కారణంగా రాష్ట్రంలో 3.61 లక్షల మంది యువ ఓటర్లు ఓట్లు హక్కు కోల్పోయారని అన్నారు. న్యాయపరమైన ఇబ్బందుల వల్ల 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు నిమ్మగడ్డ వివరించారు. ఇద్దరు అధికారులు విధినిర్వహణలో విఫలమైనందున నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీచేశారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై తెగని పంచాయతీ