- నియామకానికి గవర్నర్ ఆమోదం
- ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా
ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ గా సీఎం ముఖ్య సలహాదారు, మాజీ సీఎస్ నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమె పేరును ఆమోదించారు. ఈనెల 31తో ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్‌ఈసీ ఎంపిక కోసం ముగ్గురు విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. వీరిలో నీలం సాహ్ని నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.
Also Read: ఎన్నికల నిర్వహణకు సమయం లేదు మిత్రమా!
పలు బాధ్యతలు నిర్వహించిన నీలం సాహ్ని:
నీలం సాహ్ని గతంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. సీఎస్‌గా పదవీ విరమణ అనంతరం సీఎం ముఖ్య సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్నిఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా, టెక్కలి సబ్‌కలెక్టర్‌గా, నల్గొండ జాయింట్ కలెక్టరుగా పనిచేశారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శి హోదాలో విధులు నిర్వహించారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె ఆ తర్వాత ఏపీ సీఎస్‌గా నియమితులయ్యారు.
నీలం సాహ్ని రాజీనామా ఆమోదించిన ప్రభుత్వం:
మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారుగా ఉన్న నీలం సాహ్ని తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. నిమ్మగడ్డ పదవీకాలం పూర్తవగానే నీలం సాహ్ని కొత్త కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Also Read: బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం