రేవ్ పార్టీ సంస్కృతి ముదిరిన హైదరాబాద్ నగరంలో ప్రముఖుల పిల్లలు మాదక ద్రవ్యాలకు బానిసలై తల్లిదండ్రుల పరువు తీస్తున్నారు. సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్నవారూ, ఉన్నత హోదాలు అనుభవిస్తున్నవారూ, సంపన్నుల పిల్లలు రేవ్ పార్టీల చక్కర్ లో పడి అడ్డంగా దొరికిపోతున్నారు. సినిమా ప్రముఖులు, అధికార ప్రముఖుల పిల్లలు ఈ డ్రగ్స్ విరివిగా వినియోగించే పబ్ లో దొరికిపోవడం నేటి సంచలన వార్త.
నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పైన అర్ధరాత్రి గం.2.30కు నార్తె జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి వందమందికి పైగా యువతీయువకులను పట్టుకున్నారు. పార్టీలో మాదక ద్రవ్యాలు వాడినట్టు సమాచారం అందడంతో డ్రగ్స్ కోసం పోలీసులు అన్వేషించారు. చాలామందిపైన పోలీసులు కేసు పెట్టారు. నిందితుల్లో ప్రముఖ ర్యాప్ సింగర్, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్టు సమాచారం. లోగడ ఒక సారి ఇదే విధంగా అరెస్టయిన రాహుల్ దొరికిపోవడం ఇది రెండో సారి. అరెస్టయినవారిలో 99 మంది పురుషులు, 39 మంది స్త్రీలు, 19 మంది పబ్ సిబ్బందీ, హోటల్ యజమానులూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూతురు, నటి నీహారిక సైతం అరెస్టయినవారిలో ఉన్నట్టు సమాచారం అందింది.
ఎల్ ఎస్ డి పౌడర్, గంజాయి, కొకైన్ లతో నిండిన సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. పోలీసుల రాకను గమనించిన కొందరు సిగరెట్లను కిటికీల నుంచి బయటకు విసిరివేశారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పబ్ యజమానులపైన కేసు నమోదు చేశారు. నిర్వాహకులు అభిషేక్ ఉప్పల్, అనిల్ కుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలామందికి నోటీసులు ఇచ్చి, కౌన్సిలింగ్ చేసిన పోలీసు అధికారులు వారిని ఇళ్ళకు పంపినట్టు చెబుతున్నారు.
బంజారా హిల్స్ సీఐ శివచంద్రను కమిషనర్ ఆనంద్ సస్పెండు చేశారు. బంజారాహిల్స్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ విరివిగా వాడుతున్నారని లోగడ కొంతమంది ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు పట్టించుకోలేదు. పోలీసు స్టేషన్ సమీపంలోనే ఉన్న పబ్ లో మాదక ద్రవ్యాల వినియోగం జరగడం, ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో పోలీసు అధికారులపైన చర్య తీసుకున్నారు.