న్యూయార్క్ టైమ్స్ పత్రిక భారత ప్రధాని నరేంద్రమోదీని ఈ భూమిపైన మిగిలిన ఆఖరి, అత్యుత్తమమైన ఆశగా అభివర్ణించినట్టు ఎవరో తప్పుడు వార్త ప్రచురించి ప్రచారం చేశారు. నరేంద్రమోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో ఫోటోషాప్ చేసి కల్పించిన ఈ వార్త న్యూయార్క్ టైమ్స్ పత్రిక మొదటిపేజీలో ప్రముఖంగా ప్రచురించిట్లు వాట్సప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలలో చక్కెర్లు కొట్టింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక పబ్లిక్ రిలేషన్లు విభాగం ఉపయోగించే ట్విట్టర్ నుంచి వచ్చిన సందేశం ఇది ఎవరో కల్పించి సృష్టించిన బూటకపు ఇమేజ్ అనీ, అభూత కల్పన అనీ, వాస్తవం కాదనీ, ఈ తప్పుడు ఇమేజ్ సోషల్ మీడియాలో తిరుగుతోందనీ స్పష్టం చేసింది.. ‘‘ప్రపంచంలో కెల్లా అత్యధికంగా ప్రేమపాత్రుడైన, అత్యంత శక్తిమంతుడైన నాయకుడు మమ్ములను ఆశీర్వదించేందుకు ఇక్కడికి వచ్చారు (World’s Most Loved and Most Powerful Leader Is Here To Bless Us)’’ అని శీర్షిక ఉన్నది. అయితే, న్యూయార్క్ టైమ్స్ లో ఉపయోగించే అక్షరాల స్వరూపం, ఈ వార్తలో ఉపయోగించిన అక్షరాల స్వరూపం వేర్వేరనీ, అదే విధంగా డేట్ లైన్ ముందు సెప్టెంబర్ అన్న మాటలో స్పెల్లింగ్ తప్పు ఉన్నదనీ న్యూయార్క్ టైమ్స్ పీఆర్ విభాగం వెల్లడించింది. నిజమైన, నమ్మకమైన జర్నలిజం ప్రస్తుతం అత్యవసరం కాగా ఇటువంటి బూటకపు వార్తను ఎంతమందికి షేర్ చేస్తే అంత నష్టమని పీఆర్ విభాగం వ్యాఖ్యానించింది.
బీజేపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రోహిత్ చహాల్ ఈ బూటకపు వార్తను రీట్వీట్ చేశారనీ, ఆ తర్వాత తొలగించారనీ ‘ప్రింట్’ పత్రిక వెల్లడించింది.