• కొత్త సంవత్సర వేడుకలపై కేంద్రం నిఘా
• వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి
• డ్రంక్ అండ్ డ్రైవ్ లతో మందుబాబులకు టెన్షన్
కరోనా విజృంభిస్తున్న వేళ కొత్త సంవత్సర వేడుకలకు ప్రపంచం సిద్ధమయింది. అసలే కరోనాతో జనం భయపడుతుంటే కొత్త రూపు సంతరించుకొని స్ట్రెయిన్ రూపంలో వస్తున్న కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ సమయంలో కొత్త సంవత్సనారికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ రోజు రేపు ఢిల్లీ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూను విధించింది. ఈ రోజు రేపు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి సమయంలో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.రాత్రి 8 గంటల తరువాత ఇండియా గేట్, రాజ్ పథ్, విజయ్ చౌక్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలలో సాధారణ ప్రజల సంచారంపై ఆంక్షలు విధించింది. కన్నౌట్ ప్లేస్, మార్కెట్ ప్రాంతాల్లో కూడా ఆంక్షలు విధించారు. రాత్రి కర్ఫ్యూ ఉన్నప్పటికీ అంతరాష్ట్ర ప్రయాణాలు, సరకు రవాణాకు ఆంక్షలు వర్తించవని ఉత్తర్వుల్లో తెలిపారు.
ముంబయిలో పరిమితులు:
ముంబయిలోనూ కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. బార్లు, రెస్టారెంట్లు, పబ్ లు , బీచ్ లలో కొత్త సంవత్సరం సందర్భంగా ఎలాంటి పార్టీలు జరపడానికి అనుమతి లేదని తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంబయి వ్యాప్తంగా డ్రోన్లతో నిఘాపెట్టినట్లు తెలిపారు.కొత్త సంవత్సరం నేపథ్యంలో కరోనా వ్యాప్తికి దోహదంచేసే సామూహిక సమావేశాలు, సంబరాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిపై నిఘా పెట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేస్తూ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. అధిక సంఖ్యలో జనం సమావేశం కావడాన్ని నివారించాలని, స్థానిక పరిస్థితులను బట్టి ఆంక్షలు విధించడానికి వెనకాడవద్దని చెప్పినట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా వేడుకలపై పరిమితులు విధించింది. రిసార్టులు, పబ్బులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచేఉంటాయని ఆబ్కారీ శాఖ తెలిపింది. బార్లు, క్లబ్ లు ఒంటిగంట వరకు తెరిచే ఉంటాయని అయితే వైన్ షాపులు, బార్లు, క్లబ్ ల వద్ద కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. మాస్క్ లు ధరించాలని, విధిగా శానిటైజర్లు వాడాలని హెచ్చరికలు చేసింది.
డ్రంక్ అండ్ డ్రైవ్:
మద్యంతాగి వాహనాలను నడిపి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లు విస్తృతంగా చేపడతామని సీపీ సజ్జనార్ చెప్పడంతో మందు బాబులకు కొత్త టెన్షన్ మొదలైంది. తాగడానికి అర్ధరాత్రి వరకు పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వం తాగి బయటకు రాగానే డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో టెస్టులు చేయడాన్ని తప్పబడుతున్నారు. తాగి వాహనాలను నడిపితే ఎంతటివారినైనా వదిలేది లేదని స్పష్టం చేశారు.
ఇది చదవండి: గడ్డు ఏడాది గడిచిపోయింది