- చివరి క్షణం వరకూ నిర్విరామంగా ఉండటం మేలు
- కాలపరీక్షలో నిలిచి గెలవడం అసాధ్యం కాదు
కాలచక్రం చకచకా శరవేగంగా నడుస్తూనే ఉంటుంది. అది ఎవరికోసం ఆగదు. ఆ సంగతి మనకూ తెలుసు. కాకపోతే, కాలం విలువ ఎరిగి సద్వినియోగం చేసుకొనేవారు తక్కువమంది ఉంటారు. కాలానికి ఎవ్వరూ అతీతులు కారు. విశిష్ట మార్గంలో నడచి కాలాతీతవ్యక్తులుగా పేరెన్నికగన్న మహనీయులూ ఈ భూమిపై ఎందరో ఉన్నారు. ఆ మార్గం అనితరసాధ్యమని చాటిచెప్పిన మనీషామూర్తులు ఎందరో నిన్నమొన్నటి వరకూ మన మధ్యనే నడచివెళ్లారు. కాలపరీక్షలో నిలవడం సాధ్యం కాదని అనుకోరాదు. మంచి ప్రయత్నం చేసినవారంతా నిలిచి గెలిచినవారే. దేవతలను త్రిదశులు అంటారు. అంటే వారి వయస్సు ఎప్పటికీ ముప్పైఏళ్ళే! అట్లే కొందరి మానసిక వయస్సు ఎప్పటికీ ఇరవైఏళ్ళే. తమను నిత్యనూతనంగా మలుచుకొనే మహిమలు వాళ్ళ చేతుల్లోనే, చేతలలోనే ఉంటాయి. వారంతా భౌతికంగా ఈ ప్రపంచాన్ని వీడేంత వరకూ తమను తాము నిర్విరామంగా ఉంచుకుంటారు. సమాజహితమైన పనులు ఏవో ఒకటి చేస్తూనే ఉంటారు. రేపటి తరాలకు కానుకలుగా ఇచ్చి వెళ్తూ ఉంటారు. కాలంలో బంధాలు, సంబంధాలు మారిపోతూ ఉంటాయి. స్నేహం, శత్రుత్వం వాటి వెనకాల తిరుగుతూ ఉంటాయి. శాశ్వత శత్రుత్వం, మిత్రత్వం ఉండవనే మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం.కానీ, భావోద్వేగాలను అణుచుకోలేం. క్షణికావేశానికి చాలా నష్టపోతూ ఉంటాం. మానవ జీవన సూత్రాలను అర్థం చేసుకుంటే, ఆచారణాత్మకమైన ఆలోచనలు కలిగిఉంటే, కోరికల పరిధులు తెలుసుకుంటే దుఃఖం దూరమవుతుందని పెద్దలు చెప్పనే చెప్పారు.
Also read: దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డడే!
శుభాకాంక్షలు పంచుకుందాం
వెలుగునీడల, చీకటివెలుగుల, కష్టసుఖాల కాలం చేసే ప్రయాణం అనంతం. రాతిరి మరనాడే పగలు వస్తుంది. కష్టం అంతమవ్వగానే సుఖం వస్తుంది. ఆర్ధిక మాంద్యం, వైరస్ భయాలు, ధరల దడదడలు, కరెన్సీ పతనాలు, నిరుద్యోగం, ప్రకృతి వైపరీత్యాలు…ఇవ్వేవీ లోకానికి,మానవాళికి కొత్తవి కాదు. కాలగమనంలో చవిచూచినవే. కాలచక్రంలో సర్దుకున్నవే. పాత సంవత్సరం పోవడం, కొత్త సంవత్సరం రావడం ఎవరికీ కొత్తకాదు. ఇంగ్లిష్ లెక్కల ప్రకారం ఇది 2023వ సంవత్సరం. చరిత్ర ప్రకారం చూస్తే కొన్ని లక్షల సంవత్సరాలు గడచిపోయాయి. కొన్ని కోట్ల జీవరాసులు పుట్టిగిట్టాయి. మళ్ళీ పుడుతూనే ఉన్నాయి, ఉంటాయి. కొత్త ఏడాది నాడు సరికొత్త కలలు కందాం, కొత్త వెలుగుపూలు పూయించుకుందాం, జీవితాన్ని కొంగ్రొత్తగా కోటి దీపకాంతుల మధ్య పండించుకుందాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు పంచుకుందాం.
Also read: జమిలి ఎన్నికలు అభిలషణీయమా?