ఓ సంవత్సరం వెళ్లి పోతూంది, కొన్ని జ్ఞాపకాలు మిగిల్చి.
బాధలు, సంతోషాలు, ఆరాటాలు, పోరాటాలు,
వ్యధలు, కధలు, ఆశలు, నిరాశలు కలబోసి
పండుటాకులు రాలి కొత్త చిగుళ్ళు వేసినట్లుగా
లౌకిక బంధాలు విడి, అలౌకిక బంధాలు పెనవేసి
పసివాడి నవ్వులు వసివాడిన ముదిమికి సవాలుగా నిలిపి
ఆరోగ్యానికి అనారోగ్యానికి పరుగు పందెం పెట్టి
తట్టుకోలేనంత పని ఒత్తిడి ఒక వైపు
వేల కట్టలేనంత అవ్యాజ ప్రేమానురక్తి మరో వైపు
విషాన్నికుడా క్రమబద్ధంగా మింగాల్సిన పరిస్థితి
ఒకరికి సాయం చెయ్యకపోయినా
ఒకరి సాయం అందుకోవలసిన స్థితి లేకుండా
పూజలు, జపాలు చెయ్యక పోయినా
ఆ గణనాధుని మరువకుండా గడచి పోతూంది
వీడ్కోలు చెబుతూ పోతూంది ఈ వత్సరం.
మరి రాబోయే సంవత్సరం?
గతం మీద కట్టిన మేడ ప్రస్తుతం
దీనిపైన నిలిపే ఉద్యానవనం రేపు
నిన్నటికంటే, నేటికంటే దివ్యంగా ఉండాలని ఆశ
నేరవేర్చుకోగల తాహతు ఉంటే ఆనందం.
పిచ్చిగా కాలం మారిందంటాం
కాని మనమే మారుతాం
కాలాన్నిబట్టి మనం మారడం కాదు
కాలాన్ని మనమే మారుస్తాం, మన ఆచరణలో మార్పుతో
అసూయా ద్వేషాలు పెచ్చరిల్లుతున్న సమాజంలో
అహంకారం ఆబోతులా కాలు దువ్వుతుంటే
ధనదాహం, కీర్తి కండూతి గజ్జిలా సలుపుతుంటే
కులాలు, మతాలు శాసించే రాజకీయాలవుతుంటే
అమితాన్ని అదిమి మితంగా వుండడం
నిరాశకు మూలమైన పేరాశను వదలి
ఉన్నదానితో సంతృప్తి పడడం
అర్ధ కామాల్నే కాకుండా
ధర్మాన్ని నిర్వర్తించడం
బిక్ష వేయడం, దానం చేయడం కాకుండా
ధర్మం చేయ గలగడం
అదే వినూత్న సంవత్సరం
మనల్ని తరింపజేసే సరికొత్త భవిష్యత్ కాలం.
Also read: ఈశ్వరా
Also read: లాస్ట్ అండ్ ఫౌండ్
Also read: సశేషం
Also read: మలుపు
Also read: జీవితం