వోలేటి దివాకర్
డాక్టర్… యాక్టర్…మళ్లీ డాక్టర్. ఇలా ఏడాదికి ఒకరు చొప్పున నాలుగేళ్లలో అధికార వైఎస్సార్సిపి ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన వాణిజ్య, సాంస్కృతిక, రాజకీయ కేంద్రం రాజమహేంద్రవరంలో నలుగురు సమన్వయకర్తలను మార్చాల్సి వచ్చింది. దీన్ని బట్టి రాజమహేంద్రవరంలో అధికార పార్టీ పరిస్థితిని, బలాన్ని అంచనా వేసుకోవచ్చు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో రాజమహేంద్రవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కొద్దికాలం సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆతరువాత ఎపిఐఐసి మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం, ఆతరువాత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పార్టీలో నెలకొన్న ఆధిపత్యపోరు వల్ల రౌతు, శ్రీఘాకోళపు పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొద్దికాలం హడావుడి చేసి పార్టీని గాడిన పెట్టే ప్రయత్నంలో డాక్టర్ ఆకుల సత్యనారాయణ పేషెంట్గా మారిపోయారని చెబుతారు.
దీంతో ఎంపి భరత్ రామ్ రాజమహేంద్రవరంను తన అడ్డాగా ప్రకటించుకుని పార్టీ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం పార్టీని, నగరాభివృద్ధిని భరత్ శాసిస్తున్నారు. అయితే ఎంపి భరత్ నగర మౌలిక వసతులను విస్మరించి నగర సుందరీకరణ పేరిట కూడళ్లలో రాళ్లు, విగ్రహాలు, వీధుల్లో విందులు, వినోదాలకు ప్రాధాన్యతనిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక దశలో ఆయనే రాజమహేంద్రవరం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అన్న ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల ఫలితాలపై అనుమానంతోనో ఏమో ఆయన సమన్వయకర్త పగ్గాలను చాతి వైద్య నిపుణుడు గూడూరి శ్రీనివాస్ కు అప్పగించేలా పావులు కదిపారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ వైసిపి అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎన్నికల బరిలో నిలిచే అవ కాశాలు కనిపిస్తున్నాయి.
శ్రీనివాస్ సతీమణి, న్యాయవాది రాధిక గతంలో రాజమహేంద్రవరం కార్పొరేషన్లో కార్పొరేటర్ గా సేవలందించారు. ఆ తరువాత ఈ దంపతులు పెద్దగా రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించలేదు. భరత్ చొరవతో అనూహ్యంగా డాక్టర్ శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. ప్రస్తుతం పార్టీలోని పరిస్థితులు గమనిస్తే ఆయన నియామకం పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు, పార్టీలోని కీలక నాయకులు రౌతు సూర్యప్రకాశరావు, శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యంలకు, పార్టీ శ్రేణులకు పెద్దగా ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. దరిమిలా పార్టీకి చికిత్స చేసి, గ్రూపులుగా విడిపోయిన వైఎస్సార్ సిపిని ఏకతాటి పైకి తేవడం కొత్త డాక్టర్ కు పెద్ద సవాల్ గా మారుతుంది.
మరోవైపు ప్రత్యర్థి పార్టీల ఇన్చార్జిలు నాలుగేళ్ల నుంచి స్థిరంగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కూడా దాదాపు వారికే ఖరారయ్యారయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీలోనే ఆధిపత్యపోరు.. అంతర్గత కుమ్ములాటల వల్ల గ్రూపులుగా విడిపోయింది. ఇటీవల ఆడంబరంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని రౌతు సూర్యప్రకాశరావు, వైశ్య శంఖారావం, ఉగాది వేడుకలు నిర్వహించి శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం రాజకీయంగా ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేశారు. ఆ ఇద్దరికీ కొన్ని రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసిపిని ఏకతాటి పైకి తెచ్చి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపకపోతే వైఎస్సార్సిపి రాజమహేంద్రవరం అసెంబ్లీ సీటును కైవసం చేసుకోవడం డాక్టర్ గూడూరికి కష్టం కావచ్చు. అలాగే భరత్ కు మళ్లీ ఎంపి సీటును నిలబెట్టుకోవడం కూడా కత్తి మీద సామే.