- కొత్త వేరియంట్ కు కేంద్రం దక్షిణాఫ్రికా
- ఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదం
- స్వయం నియంత్రణ ప్రధానం
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిందన్నది వాస్తవమే కానీ పూర్తిగా సమసి పోలేదు. జాగ్రత్తగా ఉండడమే శ్రేయస్కరం. కొత్త వేరియంట్లు చికాకు పెడుతూనే వున్నాయి. డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందే బి.1.1.529 వేరియంట్ దక్షిణాఫ్రికాలో అలజడి సృష్టిస్తోంది. దీని ప్రభావం మిగిలిన దేశాలపైనా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వ్యాప్తిని అరికట్టకపోతే మరో కోవిడ్ ముప్పు తప్పదని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. దీనిలోని అధిక మ్యుటేషన్ కారణంగా గతంలో వచ్చిన వేరియంట్ల కంటే వ్యాప్తి వేగం అధికంగా ఉండే ప్రమాదం ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్ ఐ వి రోగిలో ఈ వేరియంట్ ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ రోగులున్న దేశం దక్షిణాఫ్రికా. కొత్త వేరియంట్ అక్కడే బయటపడింది. గతంలో బయటపడిన బీటా వేరియంట్ కూడా దక్షిణాఫ్రికాలోని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు నుంచే కావడం గమనార్హం. తాజాగా వ్యాప్తిలో ఉన్న బి.1.1.529 భిన్నమైనదిగా తెలుస్తోంది. దీనిలో మొత్తం 50 మ్యుటేషన్లు ఉన్నాయి. ఇప్పటి వరకూ 100కేసులు బయటపడ్డాయి. అవి పెరిగే అవకాశం, ఇతర దేశాలకు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచే ఉన్నాయి. బోట్స్ వానా, హాంగ్ కాంగ్ వంటి పలుదేశాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
Also read: దేశంలో తగ్గుతున్న పునరుత్పత్తి
తగు జాగ్రత్తలు పాటించాలి
ఈ ముప్పును అరికట్టాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇతర దేశాలవారి రాకపోకలపై ఆంక్షలు విధించాలి. ఇప్పటికే యునైటెడ్ కింగ్ డమ్, ఇజ్రాయల్ వంటి దేశాలు ఆఫ్రికా దేశాల విమానాల రాకపోకలను ఆపేశాయి. ఆస్ట్రేలియా కూడా అప్రమత్తమైంది. మన దేశం కూడా మరింత అప్రమత్తం కావాల్సి వుంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రజారోగ్యానికి ప్రమాదం రాకుండా చూసుకోవడంలో ప్రభుత్వాలదే బాధ్యత. స్క్రీనింగ్ పరీక్షలు కఠినంగా నిర్వహించాలి. వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చెయ్యడం, కరోనా నియమాలను కఠినంగా అమలుచేయడం కీలకం. పౌరులు స్వయం క్రమశిక్షణను పాటించడం అన్నింటి కంటే ముఖ్యం. లాక్ డౌన్ సడలించిన సమయంలో విచక్షణా రహితంగా ప్రవర్తించడం వల్ల కరోనా వ్యాప్తి అపరిమితంగా పెరిగింది. ఆ దుష్పరిణామాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పౌర జీవనం సాధారణ స్థితికి వచ్చినప్పటికీ, దేశ ఆరోగ్య, ఆర్ధిక పరిస్థితులు ఇంకా సవాళ్లు విసురుతూనే ఉన్నాయి.
Also read: ఉద్యమబాట వీడని రైతులు
విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థులు
విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థులకు చాలా దేశాల నుంచి ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా వంటి దేశాలు మన విషయంలో కఠినంగా ఉన్నాయి. ఆసియా దేశాలకు అనుమతి ఇచ్చినా, మన విద్యార్థులకు చైనా నిరాకరిస్తోంది. రెండు దేశాల మధ్య విమాన సేవలు నిలిచే ఉన్నాయి. ఈ ఆంక్షల వల్ల వేలమంది విద్యార్థులు, వందలమంది వ్యాపారవేత్తలు చైనా వెళ్ళలేక ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉన్నారు. కరోనా కట్టడికి కఠిన నియమాలను అవలంబిస్తూనే, సందర్భం, అత్యవసరాలను బట్టి పట్టువిడుపులను పాటించడం కూడా అంతే ముఖ్యం.
Also read: నిలిచి గెలిచిన రైతు