చరాచర ప్రకృతి ఒళ్లు విరుచుకుని లేచే వేళ
శీతల బాధను తప్పించి, వెచ్చని సూర్య కిరణాలు హాయినిచ్చే వేళ
మందకొడితనం వదలి, శరీరం, మనసు
పరిశ్రమకు ఉపక్రమించే వేళ
మంచుబిందువులను విదిల్చి వెచ్చదనం పులుముకునే వేళ
ప్రకృతి పులకరించి పునరుత్పత్తికి నడుంకట్టే వేళ
అన్ని ఋతువుల కంటే ప్రకృతి అందంగా కనిపించే వేళ
శుభాలను అందించిన శుభకృత్ వెళ్లి పోతూంది
శుభాలన్నిటిని శోభాయమానం చేసే శోభకృత్ వస్తున్నది
వసంతుని తోడు చేసుకొని వస్తున్నది
చిగుళ్లు, మొగ్గలు, రెమ్మలతో
అచర ప్రకృతిని అలంకరించడానికి
కోయిల కుహూ కుహూ రాగాల మేళంతో
సర్వాంగ సుందరంగా వస్తున్నది
కవుల హృదయాలు ఉప్పొంగి
కవితలు పొంగి పొర్లగా
వస్తున్నది తెలుగు సంవత్సరాది శోభకృత్
పంచాంగ శ్రవణంతో భవిష్యత్తుకు బాటలు వేస్తూ
రాశుల ఫలితాలు వెతుకుతూ
తమ సంక్షేమానికి శాంతులు తెలుసుకుంటూ
ఉజ్వల భవిష్యత్తుకు చేయవలసింది ఆలోచిస్తూ
చేసిన తప్పులు మళ్లీ చేయకూడదని నిర్ణయిస్తూ
మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం ఈ పర్వదినాన్ని
శుభాలకు ఆరంభంగా భావించే యుగాదిని.
Also read: “ఉగాది శోభ”
Also read: “స్త్రీ”
Also read: “కామ దహనం”