యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్
- హైదరాబాద్ సెంట్రల్, మౌలానా ఆజాద్ వర్శిటీలకు విదేశీ విశ్వవిద్యాయాలతో అనుబంధం
- ప్రపంచంలో ఎక్కడైనా పని చేయడానికి అనుగుణంగా విద్య
నూతన విద్యా విధానంలో భాగంగా మన ఉన్నత విద్యను మహోన్నతంగా తీర్చిదిద్దడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ( యూజీసీ) వినూత్నమైన కృషిని ప్రారంభించింది. మన విద్యార్థుల స్థాయిని పెంచడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మరింత మెరుగుపరచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది శుభ పరిణామం. దేశంలోని కనీసం 48 విశ్వవిద్యాలయాలు విదేశీ ఉన్నత విద్యా సంస్థలతో కలిసి సంయుక్తంగా కోర్సులు అందించడానికి సంసిద్ధమవుతున్నాయి. యూజీసీ ఛైర్మన్ ఎం జగదీశ్ కుమార్ మాటలను బట్టి మన విద్యార్ధులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలిసివచ్చే వాతావరణం సమీప కాలంలోనే ఉందని అర్థం చేసుకోవాలి. కొన్ని ఒప్పందాలు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ వివిధ స్థాయిల్లో ఉన్నాయి. 13 విద్యా సంస్థలు ట్విన్నింగ్, 8 జాయింట్ డిగ్రీ, 9 డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. విదేశీ సంస్థలతో జత కట్టడానికి అర్హతలు కలిగిన 26 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో8 విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూజీసీకి వెల్లడించాయి. అందులో హైదరాబాద్ నుంచి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ,యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ ఉన్నాయని సమాచారం.
Also read: చైనా వెనకడుగు నమ్మదగినదేనా?
నాణ్యతకు పెద్దపీట
విదేశీ విద్యా సంస్థలతో కలిసి సంయుక్తంగా కోర్సులు నిర్వహించడానికి ఆ యా విద్యా సంస్థలు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. వాటన్నిటికీ యూజీసీ నుంచి సహజంగానే అనుమతులు వస్తాయి. విద్యా సంస్థలతో పాటు విద్యార్థులకు కూడా నాణ్యతకు పెద్దపీట వేస్తూనే సుహృద్భావ వాతావరణం కల్పించాలన్నది భారతీయ నూతన విద్యా విధానం పెట్టుకున్న ఆశయాలలో ఒకటి. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడంలో కోర్సుల మధ్య చిన్న చిన్న వ్యత్యాసాలున్నప్పటికీ అవన్నీ ఆహ్వానయోగ్యంగానే ఉన్నాయి. విదేశీ సంస్థలతో మనం జత కట్టి ముందుకు వెళ్లడం మంచి పరిణామామే. విదేశాల్లో చదువుకోవాలంటే మామూలు విషయం కాదు. సంపన్నులు, ఆర్ధిక స్థోమత కలిగినవారు తప్ప అందరికీ అంతర్జాతీయ విద్య అందే పరిస్థితులు లేనేలేవు. మన దేశంలోనూ గొప్ప విద్యాలయాలు ఉన్నాయి. గొప్ప గొప్ప అధ్యాపకులు ఉన్నారు. ప్రతిభకు,కృషికి మన దగ్గర కొదవ లేదు. కాకపోతే అంతర్జాతీయ ప్రమాణాలను అందుకొని సాగడం ఆధునిక కాలంలో అత్యవసరం. ఇదిగో ఇప్పుడు చేపట్టిన ఈ విధానాల వల్ల మనకు వెసులుబాటు రావడమే కాక బహుళార్ధ సాధక లక్ష్యాలు నెరవేరనున్నాయి. మన విద్యార్థులకు ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు పెరిగి మనో వికాసం పెరుగుతుంది. అనువైన ఖర్చుతో మరింత నాణ్యమైన విద్య దరిచేరుతుంది. ఇంటి వద్దకే విద్యా ప్రపంచం చేరినట్లవుతుంది. కేవలం కొన్ని సబ్జక్ట్స్ లోనే కాక అనేక సబ్జెక్ట్స్ తో విస్తృతమైన పరిచయం, అధికారం కూడా లభిస్తాయి. ప్రపంచ ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి ప్రపంచానికి ఏవేవి అవసరమో వాటన్నింటిలో జ్ఞాన సంపద, అనుభవశీలత, అవసరమైన మేరకు అవగాహన సంపాయించుకొనే అవకాశాలు లభ్యమవుతాయి. ఇవన్నీ కూడా విదేశీ విద్యాలయాల్లో రాణిస్తున్న సిలబస్ కు అనుగుణంగా ఉండనున్నాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఉద్యోగాన్ని, ఉపాధిని సంపాయించ గలిగిన శక్తి సామర్ధ్యాలను విద్యార్థులు మన దేశం నుంచి కదలకుండానే పొందగలుగుతారు. విదేశీ విద్యా సంస్థలు మనకు పరిచయమవ్వడమే కాక మన విద్యాలయాలు కూడా వాళ్లకు పరిచయమవుతాయి. ఆ విధంగా విదేశీ విద్యార్థులను మన విశ్వ విద్యాలయాల వైపు ఆకర్షించవచ్చు. విదేశీ విద్యా సంస్థలతో కలిసి ప్రయాణం చేసే క్రమంలో మన విద్యా సంస్థల రేటింగ్స్ కూడా అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతాయి.
Also read: నగర పరిరక్షణలో తమిళనాడు ఆదర్శం
విజ్ఞాన్ని ఇచ్చిపుచ్చుకునే సదవకాశం
విదేశీ విద్యా సంస్థలతో మన విశ్వవిద్యాలయాలు జతకట్టడం ఉభయ తారకమనే భావించాలి. ఇరు వైపుల నుంచి జ్ఞాన వినిమయం (ఎక్స్చేంజి అఫ్ నాలెడ్జ్) జరుగుతుంది. ప్రతిభాప్రావీణ్యలను కూడా ఇచ్చిపుచ్చు కోవచ్చు. స్వదేశీ, విదేశీ విద్యా సంస్థల నుంచి పొందిన జ్ఞానాన్ని మన దేశానికి వెచ్చించవచ్చు. విద్యావకాశాలతో పాటు మన దేశంలోనే ఉద్యోగఉపాధులను పెంచడం మన ప్రభుత్వాల బాధ్యత. దేశ సర్వోన్నత ప్రగతి ప్రస్థానానికి కావలసిన విద్య ఎంత అవసరమో, అర్హులు, నిపుణలైనవారికి సమృద్ధిగా ప్రోత్సాహకాలు అందించడం కూడా కీలకం. పరిశోధనలో మనం చాలా వెనకబడి ఉన్నాం. జ్ఞానం వేరు -సర్టిఫికెట్స్ వేరు. ఎక్కువ శాతం మంది పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వడానికి కావాల్సిన జ్ఞానానికే పరిమితమవుతున్నారు. పీహెచ్ డీ పట్టాల తీరు కూడా అంతే. ఈ తీరు మారాలి. చదువుకున్న చదువు వల్ల విద్యార్థికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి, మానవాళికి ఉపయోగపడాలి. అప్పుడే చదువుకు సార్ధకత. ఉత్తమమైన విద్యయే ఉన్నత విద్య. కొత్త విద్యా విధానంపై ఇంకా సమీక్షలు జరగాల్సిన అవసరం ఉంది. అవసరమైన చోట ప్రక్షాళనలు కూడా చేపట్టాలి. ప్రతిష్ఠాత్మకమైన యూజీసీ సంస్థను ప్రస్తుతం మన తెలుగువ్యక్తి నడుపుతున్నారు. అది మనందరికీ ఆనందాన్ని ఇచ్చే అంశం. రసజ్ఞత, సర్వజ్ఞత కలిగిన చదువుల వైపు ప్రయాణం సాగాలని ఆకాంక్షిద్దాం.
Also read: పుతిన్ పైన మరోసారి హత్యాయత్నం