• భారీగా పెరిగిన ధరలు
• రాయితీలకు స్వస్తి పలికిన ప్రభుత్వం
పార్లమెంటు క్యాంటీన్ లో అన్ని ఆహార పదార్థాలు చాల తక్కువకే లభిస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. టీ, కాఫీలనుంచి బిర్యానీల వరకు ఏదీ తిన్నా కారు చవకే. అలా అని నాణ్యతకు ఢోకాలేదు. ఫైవ్ స్టార్ హోటల్ కు ఏమాత్రం తీసిపోదు. తక్కువ ధరలకు లభించే ఈ నాణ్యమైన భోజనాన్ని పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలు, కేంద్రమంత్రులు ఆరగిస్తారు. అయితే ఇపుడు క్యాంటీన్ లో లభించే అహార పదార్థాల రేట్లను పెంచుతూ లోక్ సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది.
పార్లమెంటు క్యాంటీన్ లో ఎంపీలకు అందిస్తోన్న రాయితీలకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. క్యాంటీన్ రేట్లను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లోక్ సభ సెక్రటేరియట్ పెంచిన ధరలతో కూడిన మెనూను విడుదల చేసింది.
క్యాంటీన్ లో చవకగా చపాతీ 3 రూపాయలకు లభిస్తుండగా నాన్ వెజ్ బఫేను 700 రూపాయలకు పెంచింది. వెజ్ బఫే 500 రూపాయలకు పెంచారు. ఇన్నాళ్లూ 65 రూపాయలగా ఉన్న హైదరాబాద్ మటన్ బిర్యానీ 150 రూపాయలకు పెంచారు. రేపటి నుంచి (జనవరి 29) నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పెంచిన రేట్లతో ప్రతి సంవత్సరం 8 కోట్లు ఆదా కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్యాంటీన్ ను ఇండియా టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ నిర్వహించనుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
ఇది చదవండి: సెంట్రల్ విస్టా నిర్మాణ పనులకు నేడే శ్రీకారం