Tuesday, January 21, 2025

సరికొత్త సంసద్  సౌధం

  • భవనంతో పాటు ప్రజాస్వామ్య భావన కూడా విశాలం కావాలి
  • అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం పెరగాలి

నూతన సంసద్ సౌధం ఈ నెలాఖరుకు ప్రారంభిస్తారని వార్తలు వినపడుతున్నాయి. నరేంద్రమోదీ ప్రధానమంత్రి పీఠం ఎక్కి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంలోనే ఈ సంబరం కూడా చేయాలనే ఆకాంక్షలో కేంద్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కొత్త సెక్రటేరియట్ రాజమహల్ స్థాయిలో నిర్మించి, ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. సరే! ఆంధ్రప్రదేశ్ ది వేరే కథ! ఈ విషయాలు ఇట్లుండగా, దేశ రాజధానిలో మరికొన్ని రోజుల్లోనే ఆవిష్కరణకు ముస్తాబవుతున్న సంసద్ సౌధం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఆత్మనిర్భర్ లో భాగంగా, స్వావలంబన దిశగా, ప్రజాస్వామ్య పరిపుష్ఠి లక్ష్యంగా, నేటి భారతానికి దృశ్యంగా, భావి భారతానికి పునాదిరాళ్ళుగా  అత్యాధునిక పార్లమెంట్ భవన (సంసద్ ) నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2020లో శంకుస్థాపన చేశారు. 2022కల్లా ఈ భవనం సిద్ధమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ,కాస్త ఆలస్యమై 2023 పూర్వార్ధంలో ఆ ముహూర్తం ఫలించనుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి సరిగ్గా 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో చేద్దామని అప్పట్లో అనుకున్నారు. వజ్రోత్సవం వేళకు సిద్ధం చేయాలనే వజ్రసంకల్పంతో ముందుకు వెళ్ళారు. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు అన్నట్లు, ఎందరో మహనీయులు ప్రస్తుత పార్లమెంట్ భవనంలో నడయాడారు. రాజ్యంగ నిర్మాణం ఇక్కడే జరిగింది. బ్రిటిష్ వారి నుంచి  స్వాతంత్య్రం పొందిననాటి నుంచి, ఇచ్చోటనే సర్వస్వామ్యములు విలసిల్లాయి. ఇది బ్రిటిష్ ఇండియాలో జరిగిన నిర్మాణం.

Also read: సెమీఫైనల్స్ కు రంగం సిద్ధం

లార్డ్ ఇర్విన్ ప్రారంభించిన భవనమిది

భవనానికి 1912-13ప్రాంతాలలోనే రూపురేఖలు తీర్చిదిద్దారు. 1921లో నిర్మాణం ప్రారంభించి, 1927కు పూర్తి చేశారు. వైస్ రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. అప్పుడు ఇది ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం. ఎడ్విన్ ల్యూటెన్స్, హెర్బర్ట్ బేకర్ అర్చిటెక్ట్స్ గా వ్యవహరించారు. రూపశిల్పులు భారతేతరులైనా, నిర్మించింది మాత్రం భారతీయ సాంస్కృతిక పునాదులపైనే కావడం విశేషం. మితౌలిలోని చౌసద్  యోగిని దేవాలయం మోడల్ లో ఈ భవన నిర్మాణం చేపట్టారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ ప్రాచీన దేవాలయం మధ్యప్రదేశ్ లో ఉంది. 64మంది యోగినులు, దేవి ఇందులో ఉంటారు. గ్వాలియర్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దేవాలయన్ని 11వ శతాబ్దంలో ((1055-1075) రాజా  దేవపాల నిర్మించారు. జ్యోతిష్యశాస్త్రానికి, గణితశాస్త్రానికి వేదికగా యోగిని దేవాలయం విలసిల్లింది. ఆర్కియాలజికల్ సర్వే అఫ్ ఇండియా దీన్ని చారిత్రక స్మృతిగా గుర్తించింది. కొండపైన కొలువుతీరిన ఈ అద్భుత కట్టడం భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలకు కూడా చెక్కు చెదరకుండా ఉంది. వెయ్యేళ్ళు అవుతున్నా సౌష్టవం దెబ్బతినకుండా నిర్మించిన అప్పటి భారతీయ నిర్మాతలకు, ఇంజినీరింగ్ నిపుణులకు, వారి దూరదృష్టికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఇంత గొప్ప చారిత్రక భవనాన్ని ప్రేరణగా తీసుకొని, నాడు బ్రిటిష్ వాళ్ళు నేటి పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు 75ఏళ్లకే కొత్త భవనం నిర్మించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

Also read: అమ్మకు ఒకరోజు!

ముందు చూపులో పూర్వులే నయం

నేటి కారణాలు, ఆధునిక అవసరాలు ఏమైనప్పటికీ, ముందుచూపులో పూర్వుల ముందు మనం  వెనుకబడిపోయామనే చెప్పాలి. ప్రస్తుతం,బిజెపి హయాంలో, నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పార్లమెంట్ భవనానికి పునాదులు పడినప్పటికీ, సరికొత్త నిర్మాణం చేపట్టాలనే ఆలోచనలు ఎప్పటి నుంచో ఉన్నాయి.2010లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్ మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిపాదనలకు పునాదులు పడ్డాయి. నిర్మాణం పాతదైపోవడం, సభ్యులు, సిబ్బంది సంఖ్యకు చాలినంతగా  విశాలంగా లేకపోవడం, భవనాల్లో అక్కడక్కడా నిర్మాణలోపాలు తలెత్తడంతో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం గురించి రకరకాలుగా ఆలోచనలు చేశారు.ఈ నేపథ్యంలో, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2019లో సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ ప్రాజెక్టు ఏర్పరచారు. భవిష్యత్తులో లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉంది. పెరుగుతున్నా జనాభా దృష్ట్యా, 2026కల్లా లోక్ సభ సభ్యుల సంఖ్య 848 కు పెంచే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద నూతన భవన నిర్మాణానికి పునాదులు పడ్డాయి. రాబోయే ఎన్నికలకు ముందే అయోధ్య రామమందిరంతో పాటు, సరికొత్త సంసద్ భవనం కూడా సిద్ధమవుతుందని అప్పట్లో సంకల్పం చేసుకున్నారు. రెండూ సిద్ధించాయి. కొత్త నిర్మాణాన్ని స్వాగతిద్దాం. అణువణువునా భారతీయత ప్రతిబింబించేట్లు రూపకల్పనం చేయడం ఆదర్శప్రాయమే.

Also read: కర్ణాటక ఫలితాలు దేనికి సంకేతం?

రూపకల్పనలో గడుసుదనం

అదే సమయంలో, రాజ్యసభ పైభాగంలో విరబూసిన కమలం ఆకృతితో పైకప్పు రూపకల్పన చేయడంలో గడుసుదనం కూడా లేకపోలేదు. విరబూసిన కమలం జాతీయ పుష్పమే ఐనప్పటికీ, తెలివిగా బిజెపి ముద్ర ఉండేట్టుగా చూసుకున్నారనే వ్యంగ్య బాణాలూ దూసుకొస్తున్నాయి. హలో లక్ష్మణా! అంటూ లక్షలాది రైతులు అదే హస్తినాపురిలో ఆకలికేకలు వేస్తూవుంటే, పెద్దలు రోమ్ చక్రవర్తి వలె సంబరాల్లో  మునిగిపోయారనే  విమర్శలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి. నిజంగా శంకుస్థాపన అంశం ఎప్పటి నుంచో ఉంది. దీనికి -రైతు ఉద్యమకాలానికి సంబంధం లేదు. ప్రతిపక్షాలు, ఆక్రోశంతో ఉన్నవారు ఈ రీతిన విమర్శలు చేయడం సహజమేనని కొందరు కొట్టిపారేశారు కూడా. వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా  ఉంటుందని,భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈరోజు ఎంతో ప్రత్యేకమైనదని,ఇది 75ఏళ్ళ స్వాతంత్ర్య సంబరాల స్మృతి భవనమని శంకుస్థాపన సందర్బంగా ఆరోజు చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వందలఏళ్ళ  ప్రజాస్వామ్య వ్యవస్థల పునాదులపై భారత్ నడిచిందని, నడుస్తూనే ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు. నిజమే, ప్రజాస్వామ్యమే సామాన్యులను  కూడా పాలకులుగా అందలం ఎక్కించింది. రాజ్యంగమే వారికి రక్షణకవచంగా నిలిచింది. ఈ మౌలిక సత్యాలను మరచిపోతున్న కాలంలోనే మనం నడుస్తున్నాం.

Also read: పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కత్తులు

పెత్తనం కొందరిదే కాకూడదు

అందరికీ ఫలాలు అందడం లేదు. స్వేచ్ఛ దొరకడం లేదు. పెత్తనం కొందరి చేతిలోనే ఉంటోంది.అదే  విషాదం. ముందు దాని నుంచి బయటపడాలి. గతమెంతో ఘనకీర్తితో ఉన్నా, ప్రస్తుతం నైతిక నిర్మాణాలు కూలిపోతున్నాయి. భవిష్యత్తు ఇంకా ఎంత ప్రమాదకరంగా మారుతుందనే భయాలు చుట్టుముడుతున్నాయి. కొత్త భవనాల నిర్మాణాల మాటున నిన్నటి నాయకులు ప్రోదిచేసి పెట్టిన విలువలు పాతపడకూడదు. ఎందరు త్యాగాలు చేస్తే స్వాతంత్య్రం సిద్ధించిందో, నిబద్ధత,నిజాయితీలతో ఎందరు నేతలు నిప్పులా మెలిగితే మచ్చలేని చరిత మిగిలిందో, ఎందరు మహనీయులు ఇదే భవన ప్రాంగణంలో దేశం కోసం, హుందాను మరువక, గొంతెత్తి మాట్లాడితే ఈ ప్రాంతానికి దేవాలయం అనే కీర్తి కుసుమించిందో, దాన్ని గుర్తుపెట్టుకొని,ఆచరిస్తేనే సార్ధకత అవుతుంది.  “దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్ ” అన్నాడు గురజాడ . కొత్త భవనమంటే  ఆకాశహర్మ్యాలు, ఇసుక, రాళ్లు, ఏసీ మెషీన్లు, కంప్యూటర్లు, కార్పెట్లు, విశాలమైన హాళ్లు, నగిషీల సింహాసనాలు కాదు. దేవాలయంలా భావించే ఆ ప్రాంగణంలో ప్రవర్తించే తీరు, ప్రజల అవసరాలు, బాధలు, కష్టాల పట్ల సభ్యులు నడిచే విధానమే మూలం, ముఖ్యం. సరికొత్త సంసద్ భవనం భారతీయ సంస్కృతికి  ప్రతిబింబంగా, సర్వతోన్నత ప్రగతికి ప్రతిధ్వనిగా ప్రతిఫలిస్తుందని విశ్వసిద్దాం.

Also read: భారాస భవిష్యత్తు ఎమిటి?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles