పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదివారంనాడు ప్రారంభోత్సవం చేశారు. మంత్రోచ్ఛాటనల మధ్య ఆయన తమిళనాడు పూజారుల చేతులమీదుగా రాజదండం స్వీకరించారు. తమిళనాడు పురోహితులు మోదీని ఆశీర్వదించారు. ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
పార్లమెంటు కొత్త భవనం రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం రాజ్యాంగవ్యతిరేకమా లేక రాజ్యాంగ అనుకూలమా? అనే కొత్త ప్రశ్న మొదలైంది. నిజానికి ఇంత డబ్బు పోసి కొత్త పార్లమెంట్ నిర్మించాలా లేదా అన్నదే గొప్ప ప్రశ్న. కాని ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. ఇంక ప్రారంభించడం న్యాయమా అన్యాయమా అనే ప్రశ్న పనికి రాని ప్రశ్న. రాష్ట్రపతి ప్రారంభించినా ప్రారంభించకపోయినా ఏమీ తేడా లేదు. రాష్ట్రపతి నామమాత్రమే. ఆయన/ఆమె పేరుమీదే రాజ్యం నడుస్తుంది కాని, చేయగలిగిన పనికూడా ఏదీ లేదు.
ప్రతిపక్షాలు వ్యతిరేకించడం వారి కార్యక్రమం అయితే వారి స్వాతంత్రానికి సంబంధించిన విషయం. నిజంగా ఆలోచిస్తే మూడు వ్యవస్థల్లో రాష్ట్రపతి, లోకసభ రాజ్యసభ కలిపితేనే అది పార్లమెంట్ అవుతుంది. పార్లమెంట్ అంతర్నిహమైన ఒక వ్యవస్థను వేరు చేయడం సాధ్యం కాదు. న్యాయం, రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రపతి తో కలిసి లోకసభ స్పీకర్, రాజ్యసభ తో ఉపరాష్ట్రపతి (రాజ్యసభ అధ్యక్షుడు) తో ఉన్నదాన్ని పార్లమెంట్ అంటారు. కాని రాష్ట్రపతేమి స్పీకర్ ఏమి, ఉపరాష్ట్రపతి గొప్పవారా అని చర్చించడం వృధా. రాష్ట్రపతి కాదు ప్రధాని తప్ప ఎవ్వరైనా గొప్పవారేమీ కాదు. పెద్దవారేమీ కాదు. కనుక ప్రారంభించినా ప్రారంభించకపోయినా ఒకటే. ఒక రాజ్యాంగం నియమాలు ఏమన్నా, అనకపోయినా ఒకటే. దీనికి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే వారి అభిప్రాయం వారికి వివరిస్తారు అంతే.
పార్లమెంటు కొత్త భవనం సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది ఆ భవనాన్ని ప్రధానికి బదులుగా రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్‌సభ సచివాలయానికి ఆదేశాలివ్వాలని అడుగుతున్నారు. ప్రధానిని, ఇతర మంత్రులను నియమించేది రాష్ట్రపతేనని.. కార్యనిర్వహణకు సంబంధించి వారు తీసుకునే నిర్ణయాలన్నీ రాష్ట్రపతి పేరు మీదే తీసుకుంటారని అంటున్నారు. రాష్ట్రపతిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడమంటే అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమే అని సుప్రీం కోర్టుకు విన్నవిస్తున్నారు. ఈ గతి, సంగతి వేరు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించడానికి నిరాకరించింది.
(దేశంలో (యూనియన్, సంఘంలో) రాష్ట్రపతి, రాజ్యసభ (రాష్ట్రాల మండలి – కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్), లోక్ సభ (హౌస్ ఆఫ్ ది పీపుల్ – ప్రజల సభ) అనే రెండు సభలతో కలిగిన ఒక పార్లమెంట్ ఉండి తీరాలి.)
అయినా పార్లమెంట్ రాజ్యాంగం ప్రకారం పనిచేయించడం ముఖ్యం కాని కోట్లరూపాయలు వృధా చేసే పనులెందుకు? లోకసభ రాజ్యసభల్లో కాస్త మంచి శాసనాలు చేయించండి. ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ప్రజావ్యతిరేక శాసనాలు ఎందుకు చేయిస్తారు?
విశేషమేమంటే చెన్నై లో తమిళనాడు ప్రభుత్వం ఓ గొప్ప పని చేసింది. గిండిలో అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న ప్రభుత్వాసుపత్రిని జూలైలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభిస్తారని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం చెబుతున్నాడు. గిండిలోని కింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో రూ.230 కోట్లతో 1,000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ హాస్పిటల్ జూలై మొదటి వారంలో ప్రారంభిస్తారట. నూతన భవన ప్రారంభోత్సవానికి గిండి ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవానికి ఎలాంటి సంబంధం లేదట. పనికి కాని ప్రారంభాలకన్న పనికి వచ్చే పనిచేస్తే బాగుంటుంది కదా.
మాడభూషి శ్రీధర్