ఇప్పుడు అప్పటి పేరు లేదు,
ఇంటి పేరు లేదు…
అలా పిలిచేవారు లేరు.
సంతోషంతో ఉప్పొంగడం లేదు
దుఃఖంతో గుండె బరువెక్కి కృంగిపోవడమూ లేదు.
ఇక్కడ అందరూ ఒకటే…
మట్టి కప్పు క్రింద, ప్రశాంతంగా ఒకరిప్రక్కన ఒకరు…
గాఢాంధకారంలో వికసించిన
వేయి వెలుగుల వినూత్న జ్ఞాన ప్రపంచంలో,
విగతజీవుల వెచ్చని కాష్టాల మధ్య,
ఎలుగెత్తి పాడే ఎముకల పోగుల పాటలు వింటూ…
నిశ్శబ్దతలో నుంచి నిర్మలంగా ప్రవహించే
నిగూఢ జ్ఞానంతో దాహం తీర్చుకొంటు…
ఇదీ ఒక జీవితమే…
జీవితం తరువాతి నవ్య జీవితం …
కొంగ్రొత్త అనుభవంకాని అనుభవం అనుభవిస్తూ
బ్రతుకు కాని బ్రతుకు బ్రతికేస్తూ!
పాత పగలు లేవు, అప్పటి వాత్సల్యాలు లేవు!
ఎవరికి ఎవరో…అయినా అందరూ ఒక్కటే.
ఇక్కడ కులం, మతం, రంగు భేదం లేదు;
పొడుగు, పొట్టి అని తేడా లేదు,
పండిత పామర వ్యత్యాసం లేదు,
భాషలు లేవు, భావాలు లేవు, భావ వ్యక్తీకరణలు లేవు.
ప్రేమలు లేవు, ద్వేషం లేదు, నీది నాదని లేదు.
కోరికలు లేవు, నిరాశ లేదు, విరక్తి లేదు, వైరాగ్యం లేదు,
భవిత గురించిన చింతన, చింత లేవు.
ఆత్మ గౌరవం, అహంకారం,
ఎప్పుడో అగ్నిలో దగ్ధం కాగా
మిగిలిన బూడిద కూడా లేదు.
ఎంత అదృష్టవంతులో …
కపట, వికృత, వికార మానవారణ్యం వదిలి
ఇక్కడికి మంచి పొరుగు లోకి వచ్చి చేరారు….
నక్కలు, పాములు, తేళ్లుస్వేచ్ఛగా తిరిగే
సురక్షిత లోకానికి!
అవును…ఇది స్మశానం
బ్రతికి ఉండగా అడుగుపెట్టడానికి భయపడే ఖనన భూమి…
చనిపోయాక తప్పక వచ్చిచేరు మనసున్న మరుభూమి.
Also read: ఎవరతను?!
Also read: ప్రయాణం
Also read: నడమంత్రపు సిరి
Also read: మళ్లీ మనిషిగా పుడదాం
Also read: నేటి భారతం