Sunday, December 22, 2024

స్వాతంత్ర్య సమరయోధులను కాజేయడం నయాభారత్ కు అనివార్యం

నయాభారత్ (న్యూ ఇండియా) నేతలు వారసత్వాలపై జయప్రదంగా దాడులు చేస్తున్నారు. సర్దార్ పటేల్ ను కాజేసి తమ ఖాతాలో జమ చేసుకోవడం దాదాపుగా పూర్తయింది. తాజా దాడి సుభాష్ చంద్ర బోస్ వారసత్వాన్ని సొంతం చేసుకునేందుకు జరుగుతోంది. వారు ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఇంత తేలికగా వారసత్వాలను కాజేయడం నిజంగా దురదృష్టకరం. వారసత్వాలపైన జరుగుతున్న దాడులను దేశప్రజల ఎదుట ఎట్లా సమర్పిస్తున్నారో, సమర్థించుకుంటున్నారో చూస్తే బాధకలుగుతుంది. పాతభారత్ (ఓల్డ్ ఇండియా) రథసారధులు పనికట్టుకొని చారిత్రక పురుషులకు చేసిన తప్పులను సరిచేయడానికి జరగుతున్న ప్రయత్నంగా వారసత్వాలపైన దాడులను అభివర్ణిస్తున్నారు. నిజంగా చారిత్రక తప్పిదాలు జరిగి ఉంటే వాటిని సరిచేసే ప్రయత్నాలను ఎవ్వరూ తప్పుపట్టరు. కొంతమంది ప్రముఖులకు తగిన ప్రాముఖ్యం ఇవ్వకపోవడానికి జవహర్ లాల్ నెహ్రూ కురచబారు బుద్ధి కారణమని ప్రస్తుతం వారసత్వాలపైన దాడులు చేస్తున్నవారు పరోక్షంగానైనా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. మన స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్రనాయకుడూ, నవభారత నిర్మాత అయిన నెహ్రూను తగ్గించి చూపడానికి లేదా చరిత్ర పుటల నుంచి ఆయనకు సంబంధించిన అధ్యాయాన్నిపూర్తిగా చెరిపివేయడానికి చేస్తున్న అసహ్యకరమైన ప్రయత్నాలు వారి చర్యలను అనుమానించేందుకు, ప్రశ్నించేందుకు తావిస్తున్నాయి. నయాభారత్ నేతలు చేస్తున్న దుర్మార్గమైన ప్రయత్నాల గురించి నా ఆలోచనలను మీతో  ఈ రోజు పంచుకుంటాను.

Subhas Chandra Bose, Mahatma Gandhi and Nehru: Admirers or adversaries? A  myth buster - News Analysis News
గాంధీ, బోస్, నెహ్రూ

ఇండియాగేట్ వద్ద సుభాష్ హాలోగ్రాం

సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఇండియా గేట్ దగ్గర ఆయన విగ్రహం స్థాపించబోతున్నామనడానికి చిహ్నంగా హాలోగ్రాం (విగ్రహం కాల్పనిక డిజిటల్ రూపం) ఆవిష్కరించేందుకు మన ప్రధాని ఒక బటన్ నొక్కారు. అక్కడ త్వరలోనే గ్రానైట్ తో తయారైన సుభాష్ విగ్రహాన్ని నెలకొల్పుతారు. హాలోగ్రాం ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగం వింటే నయాభారత్ నేతలు చారిత్రక తప్పిదాలను సరి చేసే సాకుతో వారసత్వాలపైన దాడులు ఏ విధంగా చేస్తున్నారో లేఖామాత్రంగానైనా తెలుస్తుంది. ప్రధాని హిందీ ఉపన్యాసంలో చెప్పిన అంశాన్ని కింద తెలుగులో ఇస్తున్నాను, చదవండి:

‘‘దేశ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు చాలామంది గొప్ప వ్యక్తులు చేసిన త్యాగాలనూ, మహోపకారాలనూ చెరిపివేయడానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రయత్నాలు జరగడం దురదృష్టకరం. లక్షల మంది ప్రజల తపస్సు స్వాతంత్ర్య సమరంలో కలగలసి ఉంది. కానీ వారి చరిత్రను పరిమితం చేశారు. ఆ పొరబాట్లను స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన తర్వాత ఈ రోజున సరిదిద్దుతున్నాం.’’

ఈ ఆరోపణను దేశీయాంగమంత్రి ప్రతిధ్వనించారు. ఆయన ఏమన్నారో మళ్ళీ తెలుగులోకి అనువదించి కింద పొందుపరుస్తున్నాను:

‘‘భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన అటువంటి గొప్ప వ్యక్తులను విస్మృతిలోకి నెట్టివేయడానికి ప్రయత్నాలు జరిగాయి.’’

Also read: భారత భవితవ్యాన్ని నిగ్గు తేల్చే యూపీ ఎన్నికలు

ప్రధాని, నయాభారత్ చేసిన రెండు ప్రయత్నాలు చెప్పుకోదగినవి. నేతాజీ భుజాలపైన తుపాకీ పెట్టి నెహ్రూ మీద కాల్పులు జరపడం మొదటి ప్రయత్నం. బోస్ ను తాము కాజేసి ఆయనను బీజేపీ ఆదర్శ నేతగా చూపించే ప్రయత్నం రెండవది. మన స్వాతంత్ర్య సమర చరిత్ర, బోస్ భావజాల ప్రాథమ్యాల గురించి నయాభారత్ నేతలకు బొత్తిగా పరిజ్ఞానం లేదనే వాస్తవాన్ని ఈ రెండు ప్రయత్నాలూ స్పష్టం చేస్తున్నాయి. బోస్ కీ, గాంధీజీకీ మధ్య అశాంతితో కూడిన, సంఘర్షనాత్మకమైన సంబంధాలను బోస్ కీ, నెహ్రూకీ మధ్య ఉన్నట్టుగా చూపించడానికి జరుగుతున్న కుటిలయత్నం కూడా ఇందులో ఉంది. మన స్వాతంత్ర్య ఉద్యమానికి గాంధీజీ నాయకత్వం అవసరమా, కాదా అనే ఒక్క విషయం మినహా మరే విషయంలోనూ బోస్ కీ, నెహ్రూకీ మధ్య అభిప్రాయ భేదాలు లేనేలేవు. గాంధీ, బోస్ మధ్య కానీ, బోస్, నెహ్రూ మధ్యకానీ ఉండిన విభేదాలు ఎంత తీవ్రమైనప్పటికీ వారిరువురూ స్వాతంత్ర్యోద్యమానికి బోస్ చేసిన సేవలను ఎన్నడూ తగ్గించి చూపలేదు. బోస్ దేశభక్తిని వారు ఎన్నడూ కాదనలేదు, ప్రశ్నించలేదు. వారిద్దరి పట్ల తన ఆగ్రహాన్ని వెలిబుచ్చే సమయంలో కొన్ని సందర్భాలలో దురుసైన మాటలు ప్రయోగించిన వ్యక్తి బోస్. ఈ విషయం వివరించడానికి ముగ్గురు నాయకుల మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలలోని కొన్ని అంశాలను ఉదాహరణ కోసం మీకు మనవి చేస్తాను.

గాంధీపట్ల బోస్ వ్యతిరేకత

గాంధీతో బోస్ ఎన్నడూ సంతోషంగా లేరు. మహాత్ముడి పద్ధతులు ఆయనకు నచ్చేవి కావు. బోస్ ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే జులై 1921లో గాంధీజి మొట్టమొదటిసారి కలుసుకున్నారు. తన ప్రశ్నలకు గాంధీజీ చెప్పిన సమాధానాలను బట్టి చూస్తే ఆయన అయోమయంలోనైనా ఉండి ఉండాలి లేదా కావాలనే తనకు సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేసి ఉండాలని బోస్ ఆ సమావేశం తర్వాత భావించారు. వారిద్దరి మధ్య పెద్ద ఘర్షణ 1929లో లాహోర్ ఏఐసీసీ సమావేశంలో జరిగింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఒక తీర్మానాన్ని బోస్ ప్రవేశపెట్టారు. గాంధీజీ దాన్ని వ్యతిరేకిస్తూ…

‘‘సమాంతర ప్రభుత్వాన్ని ఈ రోజే నెలకొల్పాలని మీరు భావించినట్లయితే ప్రస్తుతానికి వెయ్యి గ్రామాలలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం లేదని చెప్పదలచుకున్నాను.’’

బోస్ చేసిన ప్రతిపాదన సమయస్ఫూర్తి లేనిదనీ, వివేకవంతమైనది కాదనీ గాంధీ భావించారు. అందుకే తిరస్కరించారు.

Also read: రైతులు, ఆర్థికప్రవీణులూ, ప్రజాస్వామ్యం

అయితే, గాంధీ అంటే బోస్ కు ఎంతో గౌరవం ఉంది. కానీ మహాత్ముడి పద్ధతులు తనకు ఆమోదయోగ్యం కావని భావించారు. 1934లో తన జర్మన్ మిత్రులకు బోస్ ఈ విధంగా రాశారు:

‘‘ఆయన (గాంధీ) కంటే ఎక్కువగా నేను గౌరవించే వ్యక్తి మరొకరు లేరు. ఆయన భారత దేశ ముఖచిత్రాన్ని మార్చివేశారు. కానీ రాజకీయంగా ఆయనతో ఇక ఏ మాత్రం అంగీకరించజాలను. బ్రిటిష్ వారితో వ్యవహారంలో ఆయనకు కొన్ని మెతక పద్ధతులు ఉన్నాయి. మన రాజకీయ పురోగతిని ఆ పద్ధతులు ప్రమాదంలో పడవేస్తాయి. బ్రిటీష్ వారిని భారత దేశం నుంచి సాగనంపి స్వాతంత్ర్యం సాధించుకోవాలంటే మరిత కరకు పద్ధతులు అనుసరించాలి.’’

గాంధీ బదులు కొత్త నాయకుడు కావాలన్న బోస్

గాంధీజీ పట్ల బోస్ వైఖరి తెలుసుకోవడానికి ఇక్కడ మరో ఉదాహరణ చూడండి. రాజకీయ నాయకుడిగా గాంధీజీ విఫలమైనారనీ, కొత్త సూత్రాలు, పద్ధతుల ప్రాతిపదికపైన కాంగ్రెస్ పార్టీకి కాయకల్పచికిత్స చేయాలనీ, అందుకు కొత్త నాయకుడు అవసరమనీ విఠల్ భాయ్ పటేల్ తో కలిసి సుభాష్ చంద్ర బోస్ సంయుక్త ప్రకటన జారీ చేశారు. 1935లో ప్రచురించి బోస్ పుస్తకం ‘ద ఇండియన్ స్ట్రగుల్’ లో కూడా గాంధీ అహింసా సిద్ధాంతంపైన దాడి చేశారు. ఆయన ఇలా రాశారు:

‘‘అహింసా సిద్ధాంతానికి సంబంధించి ఇండియాలో కొంత ప్రతిస్పందన వచ్చింది. కానీ ఇటలీ, జర్మనీ, రష్యా వంటి మరే ఇతర దేశంలోనైనా ఆ సిద్ధాంతం గాంధీని శిలువ దగ్గరికి కానీ పిచ్చిఆసుపత్రికి కానీ  నడిపించేది…గాంధీ ఇక ఎంతమాత్రం క్రియాశీలక నాయకుడు కాదు. బహుశా అది వయస్సు మీదపడటం వల్ల కావచ్చు.’’

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బోస్ యోగ్యుడన్న గాంధీ

అయినప్పటికీ, కాంగ్రెస్ కు బోస్ అధ్యక్షుడుగా ఉండటానికి గాంధీ విముఖంగా లేరు. 1937 నవంబర్ లో మహాత్ముడు ఈ విధంగా రాశారు:

‘‘సుభాష్ ఏ మాత్రం ఆధారపడదగిన వ్యక్తి కాదని నేను గమనించాను. కానీ పార్టీ అధ్యక్షుడు కావడానికి ఆయన తప్ప వేరొకరు లేరు.’’

1938 ఫిబ్రవరిలో జరిగిన హరిపురా కాంగ్రెస్ సభలకు బోస్ అధ్యక్షత వహించారు. త్రిపుర కాంగ్రెస్ లో పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నిక కావాలని బోస్ పట్టుపట్టడంతో గాంధీతో ఘర్షణ అనివార్యమెంది. దానికి సంబంధించిన వివరాలలోకి ఇప్పుడు పోనక్కరలేదు. విషయం ఏమిటంటే గాంధీ, బోస్ మధ్య భేదాభిప్రాయాలు లోతైనవీ, భావజాలానికి సంబంధించినవీ. గాంధీజీ నాయకత్వాన్ని బోస్ పదేపదే ప్రశ్నించేవారు.

Also read: నవభారతం: మతి పోకుండా ఉండటం ఎట్లా?

నెహ్రూ-బోస్ సంబంధాల విషయం చూద్దాం.  మనం ముందుకు వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. బోస్ ‘ద ఇండియన్ స్ట్రగుల్’ పుస్తకం ప్రచురించిన సమయంలోనే నెహ్రూ తన ఆత్మకథను ప్రచురించారు. గాంధీ ప్రాపంచిక దృక్పథంతో, కార్యక్రమాలతో తనకున్న విభేదాల గురించి చర్చించేందుకు నెహ్రూ ఆత్మకథలో రెండు అధ్యాయాలు కేటాయించారు. కానీ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించలేదు. భారత వాస్తవికతకు గాంధీ బాహ్యంగా ఉన్నట్టు కూడా ఎక్కడా వ్యాఖ్యానించలేదు. ఒకే విధమైన భావాలు ఉన్న మిత్రులుగానే నెహ్రూ, బోస్ ఒకరిపట్ల ఒకరికి సానుకూలత ఉండేది. గాంధీజీ నాయకత్వాన్ని బోస్ ధిక్కరించిన విషయం మినహా అన్ని విషయాలలోనూ నెహ్రూ బోస్ తో కలసి పని చేసేవారు. డొమినియన్ స్థాయికీ, సంపూర్ణ స్వరాజ్యవాదానికీ మధ్య ఏది మెరుగు అనే వాదన జరిగినప్పుడు నెహ్రూ, బోస్ ఇద్దరూ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని సవాలు చేశారు. 1936లో నెహ్రూ అధ్యక్షతన  లక్నో కాంగ్రెస్ జరిగినప్పుడు గాంధీని వదిలించుకొని పార్టీని మౌలికంగా మార్చివేయడంలో తనతో చేతులు కలపవలసిందిగా బోస్ ప్రతిపాదించారు. 1936 మార్చిలో నెహ్రూ బోస్ ఈ విధంగా లేఖ రాశారు:

‘‘ఈ రోజున్న అగ్రనాయకులలో పార్టీని ప్రగతిబాటలో నడిపించే వ్యక్తిగా మిమ్ములను పరిగణిస్తున్నాం.’’

కానీ నెహ్రూ అంగీకరించలేదు.

Also read: మోదీ నవభారతం, నెరవేరని ప్రజాభిమతం

బోస్ అరెస్టు పట్ల నిరసన ప్రకటించాలని నెహ్రూ పిలుపు

బోస్ కు అనంతరం జరిగిన అవమానమే నెహ్రూకూ లక్నోలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధ్యక్షత వహించిన తర్వాత జరిగింది (బోస్ తెగేవరకూ లాగాడు నెహ్రూ రాజీ పడ్డారు). సోషలిస్టు అజెండాను నెత్తికెత్తుకుంటే దేశ స్వాతంత్ర్య సాధన అనే ప్రధాన లక్ష్యం దెబ్బతింటుందని వాదిస్తూ ముగ్గురు సోషలిస్టులు మినహా  12 మంది కార్యవర్గ సభ్యులూ రాజీనామా చేశారు. గాంధీ జోక్యం చేసుకొని అమితోత్సాహం ప్రదర్శించినందుకు నెహ్రూను మందలించి సంక్షోభాన్ని నివారించారు. మహాత్ముడి అభిప్రాయాన్ని గౌరవించాలని నెహ్రూ భావించడంతో పరిస్థితి చక్కబడింది. ఇందుకు భిన్నంగా బోస్ తనను తాను గాంధీకి ప్రతిద్వందిగా భావించారు. బోస్ ను అరెస్టు చేసినప్పుడు 10 మే 1936ను ‘సుభాష్ డే’గా పరిగణించి నిరసన ప్రకటించాలని నెహ్రూ పిలుపిచ్చారు. అంతర్జాతీయ పరిస్థితి గురించి బోస్ అవగాహన లోపభూయిష్టంగా ఉన్నదనే అభిప్రాయం నెహ్రూకు ఉన్నప్పటికీ బోస్ అరెస్టుకు నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. యూరప్ సందర్శించినప్పుడు బోస్ ముస్సోలినీ (ఇటలీ నియంత), గోయెరింగ్, ఇతర ఫాసిస్టు నాయకులను కలుసుకున్నారు. ప్రపంచ చరిత్రలో అనంతర ఘట్టంలో కమ్యూనిజానికీ, ఫాసిజానికీ నడుమ మిశ్రమ సిద్ధాంతం పుట్టుకొస్తుందని ఊహిస్తూ బోస్ వార్తాపత్రికలకు రాసిన వ్యాసాలలోనూ, తాను రాసిన పుస్తకం ‘ద ఇండియన్ స్ట్రగుల్’ లోనూ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అటువంటి సిద్ధాంతమే ఇండియాలో కూడా వేళ్ళూనుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. బ్రిటన్ పట్ల ఎటువంటి మానసిక బంధం, మొహమాటం (సెంటిమెంటు) లేని వైఖరిని అవలంబించాలని బోస్ కోరేవారు. ‘బ్రిటన్ ను బలోపేతం చేసేది ఏదైనా మనకు మంచిది కాదు. ఆ దేశాన్ని బలహీనపరిచేది ఏదైనా మనం ఆహ్వానించదగింది,’’ అన్నది బోస్ అభిమతం. తన సోదరుడు విఠల్ భాయ్ పటేల్ వదలి వెళ్ళిన నిధులపైన ఎవరి అజమాయిషీ ఉండాలనే విషయంలో వల్లభ్ భాయ్ పటేల్ కూ, బోస్ కూ భేదాభిప్రాయాలు ఉండేవి. త్రిపుర కాంగ్రెస్ లో తిరిగి ఎన్నికలలో పోటీ చేయాలని బోస్ రంగంలో దిగినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా వల్లభ్ భాయ్ పటేల్, తదితరులు తయారు చేసిన ప్రకటనను ఆమోదించేందుకు నెహ్రూ నిరాకరించారు. తన వామపక్ష వైఖరిని సమర్థించకుండా తనకు  నెహ్రూ అపకారం చేశారని బోస్ భావించారు. ఆయన ఈ విధంగా రాశారు:

‘‘వ్యక్తిగతంగా నాకూ, మా లక్ష్యానికి పండిట్ నెహ్రూ చేసినంత అపకారం మరెవ్వరూ చేయలేదు.’’

Also read: పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్యనే నువ్వా-నేనా?

నెహ్రూ రెండు గుర్రాల స్వారీపై బోస్ విమర్శ

నెహ్రూ ఊగిసలాటలో ఉంటూ రెండు గుర్రాలపైన స్వారీ చేస్తూ మితవాదులతో (రైటిస్టులతో) మిలాఖత్ అవుతున్నారంటూ బోస్ నిందించారు. మొత్తం మీద నెహ్రూ, బోస్ ల మధ్య విభేదాలు గాంధీజీ నాయకత్వానికి సంబంధించిన అంశాలకే పరిమితం. మహాత్ముడికి నెహ్రూ విధేయుడుగా ఉండగా గాంధీజీని నాయకత్వ స్థానం నుంచి దించివేయాలని బోస్ కోరుకున్నారు. 1928 నుంచి బోస్ మరణించే వరకూ ఆయనకు వ్యతిరేకంగా నిలిచినవారు గాంధీజీ, వల్లభ్ భాయ్ పటేల్. నెహ్రూ కాదు. నయాభారత్, వారసత్వాలపైన దాడులు చేస్తున్న దాని నేతలు ఈ విషయాన్ని గుర్తించడం లేదు. లేదా వారికి కూడా విషయం తెలిసి ఉండకపోవచ్చు. మనం దాన్ని పట్టించుకోకుండా వదిలివేయాలని వారి అభిలాష. వారి భావజాలాన్ని కూడా మనం చూసీచూడకుండా వదిలివేయాలని వారు కోరుకుంటున్నారు. రాజీలేని వామపక్షవాదిగా బోస్ తనను తాను అభివర్ణించుకునేవారు. ఈ విషయంలో నెహ్రూతో సామీప్యం ఉన్నది. హిందూ- ముస్లిం సంబంధాల పట్ల బోస్ అభిప్రాయాలు నయాభారత్ నాయకత్వం భావజాలానికి పూర్తి విరుద్ధం. తాను రాసిన పుస్తకం ‘ద ఇండియన్ స్ట్రగుల్’లో ఏమన్నారో ఉటంకిస్తున్నాను, చదవండి:

‘‘మహమ్మదీయులు రావడంతో ఒక కొత్త సంయోగం (న్యూ సింథసిస్) క్రమంగా కుదిరింది. వారు హిందూ మతాన్ని అంగీకరించకపోయినప్పటికీ ఇండియాలోనే స్థిరపడి ప్రజల సామాజిక జీవనంలో పాలుపంచుకున్నారు. వారి సుఖదుఃఖాలలో భాగస్వాములైనారు. పరస్పర సహకారం ద్వారా కొత్త మెలకువ, సరికొత్త సంస్కృతి అవతరించాయి…’’

ఔరంగజేబునూ, టిప్పూ సుల్తాన్ నూ కుక్క అరుపులాగా, నక్క ఊలలాగా  పదేపదే ప్రస్తావించడం అలవాటు చేసుకున్న నయాభారత్ నేతల విధానానికి  బోస్ వైఖరి పూర్తిగా విరుద్ధమైనది.

Also read: 5 రాష్ట్రాలలో ఎన్నికల రంగం – వివిధ పార్టీల బలాబలాలు

అనివార్యమైన పరిణామం

నయాభారత్ పటేల్ ను తన ప్రతీకగా సంభావిస్తే, ఆ మహాసమూహంలో బోస్ సరిపోరు. నిజానికి, ఆర్ఎస్ఎస్ నూ, హిందూమహాసభనూ వ్యతిరేకించిన పటేల్ కూడా నయాభారత్ ప్రతీక కాజాలరు. ఆ సమూహంలో సావర్కర్, గాడ్సే ఉంటే గాంధీజీ ఉండజాలరు. కానీ గాంధీజీనీ, సావర్కర్ నూ, గాడ్సేనూ, పటేల్ నూ, ఇప్పుడు బోస్ నూ తమ దేశభక్తికి  ప్రతీకలుగా చేసుకునేందుకు నయాభారత్ ఒక చిత్రమైన మిశ్రమాన్ని తయారు చేసింది. భారతదేశం స్వరూపస్వభావాలు ఎట్లా ఉండాలనే విషయంలో తాము కాజేసిన, కాజేయాలనుకుంటున్న నేతల అభిప్రాయాలకూ, తమ అభిప్రాయాలకూ పూర్తి వైరుద్ధ్యం ఉన్నప్పటికీ వారి భుజాలపై తుపాకీ పెట్టి నెహ్రూపైన కాల్పులు జరపాలన్న తమ లక్ష్యం సిద్దించే వరకూ వాటిని పట్టించుకోరు. స్వాతంత్ర్య సమరానికి దూరంగా ఉంటూ, బ్రిటన్ తో చేతులు కలిపి స్వాతంత్ర్య సమరానికి వ్యతిరేకంగా పావులు కదిపినప్పటికీ తాము దేశభక్తులమని చాటుకోవడానికి కొందరు దేశభక్తులను కాజేసి తమ శిబిరంలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.  స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న వారసత్వం లేకపోగా అద్భుతమైన స్వాతంత్ర్య సమరంలో రూపు దిద్దుకున్న లౌకిక, ఉదారవాద, బహుళత్వ భారత్ అనే విలువలే వారికి బొత్తిగా అపరిచితమైనవి. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనకపోవడం వల్ల ఏర్పడిన డొల్లతనాన్ని అధిగమించేందుకు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తులను కాజేస్తూ వారసత్వాలపైన నయాభారత్ నేతలు దాడి చేస్తున్నారు. ఇది అనివార్యమైన పరిణామం.   

Also read: పెగసస్ పై సుప్రీంకోర్టు, ప్రభుత్వం మధ్య ఘర్షణ అనివార్యం

(MwM 44 కి స్వేచ్ఛానువాదం)

Dr. Parakala Prabhakar
Dr. Parakala Prabhakar
The author is an Economist, Policy Consultant, Former Adviser to Government of Andhra Pradesh. Managing Director of RightFOLIO, a knowledge enterprise based in Hyderabad.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles