మొన్న ఒక మిత్రుడు అన్న మాటలతో నేను ఆలోచించడం ప్రారంభించాను. మన బహిరంగ సంభాషణ (పబ్లిక్ డిస్కోర్స్) ఎంత వరకూ వచ్చిందంటే మీరు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ కాశీ విశ్వనాథ్ నడవ ప్రారంభోత్సవాన్ని పొగిడితే మీరు జాతీయవాది, దేశభక్తులు. ఆకలి, నిరుద్యోగం వంటి మౌలికాంశాల గురించి మాట్లాడటం మొదలుపెడితే మీపైన జాతికి వ్యతిరేకమైన వ్యక్తిగా, అర్బన్ నక్సలైట్ గా ముద్రవేస్తారని ఆ మిత్రుడు అన్నాడు. స్థూలంగా చెప్పాలంటే అతడి అవగాహన సరైనదే. ప్రభుత్వం, అధికారపార్టీ, వాటి మద్దతుదారులు సాగిస్తున్న పరస్పర వైరుధ్య (బైనరీస్ ) విధానం ఇదే. ఈ విధానం తాలూకు సందేశాలతోనే మన సోషల్ మీడియా, వెనువెంటనే సమాచారం బట్వాడా చేయగల వాట్సప్ వంటి సాధనాలు నిండిపోయాయి. మన పత్రికలూ, టీవీ చానళ్ళలో ప్రభావవంతమైన మాధ్యమాలలో చాలా వరకూ ఈ విధాన పరిభాషనే ప్రతిబింబిస్తున్నాయి. మన జాతీయ రాజకీయ చర్చలో ప్రధానమైన లక్షణాల గురించి ఈ రోజు వ్యాఖ్యానించాలని అనుకుంటున్నాను.
ఆ పని చేయడానికి ముందు నా కార్యక్రమం ‘మిడ్ వీక్ మ్యాటర్స్’ ఎపిసోడ్లకు వస్తున్న స్పందన గురించి చెప్పడానికి అవకాశం ఇవ్వండి. మన బహిరంగ సంభాషణ (పబ్లిక్ డిస్కోర్స్) ఎట్లా ఉన్నదో కొన్ని నిర్దిష్టమైన ఉదాహరణలతో వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ నిర్దిష్టమైన ఉదాహరణలూ, వాటి వివరణలూ పూర్తయినాక దేశంలో బహిరంగ సంభాషణ పోకడలు ఎట్లా ఉన్నాయో చెబుతాను.
Also read: మోదీ నవభారతం, నెరవేరని ప్రజాభిమతం
రకరకాల విమర్శలు, విమర్శకులు
నా మిడ్ వీక్ మ్యాటర్స్ ఎపిసోడ్స్ కి వచ్చిన స్పందనలన్నింటినీ చదివి జవాబు ఇవ్వడం నాకు ఆనవాయితీ అన్న సంగతి మీరు గమనించే ఉంటారు. స్పందనలు స్థూలంగా రెండు రకాలు. ఒకటి, ఎపిసోడ్లు నచ్చి మెచ్చుకుంటూ వచ్చిన స్పందనలు. రెండు, నేను వ్యాఖ్యానించడానికి ఎంపిక చేసుకున్న అంశాలను, నేను విశ్లేషించే విధానాన్ని విమర్శించే స్పందనలు. విమర్శలు కూడా రెండు రకాలు. నా వ్యాఖ్యలను వ్యక్తిగతంగా ఆపాదించుకొని, నేలబారుగా, కొన్ని సందర్భాలలో చెత్తగా దుర్భాషలాడేవి మొదటి రకం. అటువంటి విమర్శలను నేను పట్టించుకోను. నేను చాలాకాలంగా ఈ సమాజంలో జీవిస్తున్నాను కనుక అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలను తట్టుకొని నిలబడే స్థయిర్యం నాకు ఉంది. నా వాదనను ఖండించేందుకు అవసరమైన సత్తా, సరుకు లేనివారే అటువంటి బరితెగించిన వ్యాఖ్యలకు తెగబడతారు. రెండో రకమైన విమర్శలు మర్యాదగా ఉంటాయి. కానీ సాధారణంగా వాటిలో విషయం ఉండదు. ఈ అంశానికి సంబంధించిన కొన్ని ప్రాతినిథ్య వ్యాఖ్యలను మనవి చేస్తాను.
Also read: పంజాబ్ లో కాంగ్రెస్, ఆప్ మధ్యనే నువ్వా-నేనా?
నేను నకారాత్మకంగా (నెగెటీవ్ గా) ఉంటానని కొందరు నన్ను విమర్శిస్తారు. ‘ప్రభుత్వం చేస్తున్న పనులలో మంచి పని ఒక్కటైనా మీకు కనబడదా’ అని అడుగుతారు. ప్రభుత్వ వ్యతిరేకిగా, ప్రధానివ్యతిరేకిగా నాపైన ముద్ర వేయడానికి కొందరు ప్రయత్నిస్తారు. ‘ప్రత్యామ్నాయం ఘోరంగా ఉంటుందని తెలియదా, మీరు ఫలానా వ్యక్తిని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారా?’ అని అడుగుతారు. ‘వారు వస్తే పరిస్థితి అధ్వానంగా ఉంటుందని తెలియదా?’ అని ప్రశ్నిస్తారు. ‘పరకాలగారూ, మీరు మీ ఏసీ గదిలో కూర్చొని సమస్యలను ఏకరవుపెడుతున్నారు. వాటిని పరిష్కరించేందుకు మీరు ఏమి చేస్తున్నారో చెప్పండి. కేవలం మాటలు చెబుతే కుదరదు. ఏదైనా చేయండి’ అంటారు కొందరు. ‘మీరు పరిష్కారాల గురించి కూడా మాట్లాడాలి. సమస్యలు అందరికీ తెలుసును’ అని మరికొందరు అంటారు.
Also read: 5 రాష్ట్రాలలో ఎన్నికల రంగం – వివిధ పార్టీల బలాబలాలు
తప్పులు ఎత్తి చూపడమే పరమావధి
ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఎర్ర జెండా చూపించి ప్రమాద సూచికలను ఎగరవేయడమే మిడ్ వీక్ మ్యాటర్స్ ప్రధాన లక్ష్యం. మన గణతంత్రం (రిపబ్లిక్) పరిపూర్ణంగా విశ్వసించే ప్రజాస్వామ్యానికీ, బహుళత్వానికీ, ఉదారవాదానికీ, లౌకికవాదానికీ హాని కలిగించే క్రమాన్ని విడమరచి చెప్పడం కర్తవ్యం. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రత్యేకంగా ఎత్తి చూపడానికి దేశంలో వార్తావేదికలూ, మీడియా సంస్థలూ దండిగా ఉన్నాయి. ప్రభుత్వానికి బలమైన, విస్తృతమైన ప్రచార వ్యవస్థ ఉన్నది. అధికారపార్టీ అధీనంలో నిధులు పుష్కలంగా కలిగిన డిజిటల్ సైన్యం ముమ్మరంగా ప్రభుత్వానికి అనుకూల ప్రచారం చేస్తున్నది. అంతా బ్రహ్మాండంగా ఉన్నదని ఈ ప్రచార వేదికలు చెబుతాయి. పత్రికలలోనూ, టీవీ చానళ్ళలోనూ, డిజిటల్ మీడియాలోనూ ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలూ, వ్యాఖ్యలూ పెద్దఎత్తున చొప్పించి విమర్శకుల గొంతుక వినపడకుండా, తెరమీద వారి బొమ్మలు కనిపించకుండా, వారి అభిప్రాయాలను కుదించి, వాటిని ముంచెత్తే విధంగా బహిరంగ సంభాషణను దూకుడుగా నిర్వహిస్తున్నారు. కొన్ని మినహాయింపులను వదిలేస్తే మీడియా వ్యవస్థలోఅత్యధిక భాగం ప్రస్తుత ప్రభుత్వానికి చప్పట్లు చరుస్తూ ప్రశంసలు కురిపిస్తూ వందిమాగధ సంస్థలలాగా తయారైనాయి. ఇబ్బందికరమైన, విమర్శనాత్మకమైన కీలక ప్రశ్నలను ఈ మీడియా సంస్థలలో ఎక్కువ భాగం అడగవు. నోరులేని వర్గాల, వెనకబడిన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి శక్తిమంతంగా ప్రయత్నించవు. కొన్ని వేదికలు ప్రభుత్వ, అధికారపార్టీ అజెండాలను ముందుకు తీసుకుపోవడానికి బహిరంగంగానే ప్రయత్నిస్తాయి. ఈగుంపులో చేరడం మిడ్ వీక్ మ్యాటర్స్ కు సుతరామూ ఇష్టం లేదు. మన చుట్టూ, మన గణతంత్రంలో సంభవిస్తున్న పరిణామాలను విమర్శనాత్మకంగా పరిశీలించడం ఈ సంస్థకు పరమావధి. ప్రస్తుత ప్రభుత్వాన్ని బేషరతుగా అభిమానించేవారిని మెప్పించడం కోసం అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని మంచి మాటలు చెప్పే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. మిడ్ వీక్ మ్యాటర్స్ అనేది నిస్సంకోచంగా విమర్శించే గొంతుక. అపరాధ భావం లేకుండా అసమ్మతిని చాటే వ్యవస్థ.
Also read: పెగసస్ పై సుప్రీంకోర్టు, ప్రభుత్వం మధ్య ఘర్షణ అనివార్యం
ఎవ్వరికీ అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు
మరోసారి చెబుతున్నాను – మిడ్ వీక్ మ్యాటర్స్ ఫలానావారికి వ్యతిరేకమో, ఫలానా వ్యవస్థకు వ్యతిరేకమో కాదు. మన ప్రజాస్వామ్య, బహుళాత్మకమైన, ఉదారవంతమైన గణతంత్రం వ్యవస్థీకృత లక్ష్యాలకు సంబంధించిన సూత్రాలకూ, ఆదర్శాలకూ కట్టుబడి ఉండే సంస్థ. నేను ఏ వ్యక్తికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ పని చేయను. ఏ ఒక్క రాజకీయ వేదికకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండను. తమ నాయకులనూ, ప్రభుత్వాలనూ ప్రజలు ఎన్నుకుంటారు. వారి అభిమతాన్ని, నిర్ణయాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో మిడ్ వీక్ మ్యాటర్స్ వంటి చిన్న కార్యక్రమం ఉంటుందని నేను అనుకోవడం లేదు. నా పని చాలా సరళవంతమైనదీ, నిర్దిష్టమైనదీ, పరిమితమైనదీ, సమగ్ర దృష్టితో కూడినట్టిదీ. గణతంత్రం ఆదర్శాలకూ, ప్రకటిత విధానాలకూ, ప్రజలకు ఇచ్చిన హామీలకూ దూరంగా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ, ఇతర నాయకులు కానీ జరిగినప్పుడు ఎత్తిచూపడం నా బాధ్యత. అధికారంలో ఉన్నవారికి సత్యం చెప్పే చిరుప్రయత్నం నాది. ప్రత్యామ్నాయాలతో నాకు సంబంధం లేదు. నాకు నేను నిర్దేశించుకున్న భూమిక అది కాదు. అధికారంలో ఉన్నవారు సమర్థంగా పని చేయాలని నేను కోరుకుంటాను. వారు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని భావిస్తాను. ప్రజాస్వామ్య ప్రమాణాలను నిలబెట్టాలని ఆకాంక్షిస్తాను. మన గణతంత్రం బహుళ, ఉదార, లౌకిక లక్షణాలను పరిరక్షించాలని ఆశిస్తాను. ఈ పనులు వారు చేయకపోతే నా గొంతు లేస్తుంది. లోపాలు ఎత్తి చూపుతాను. నా కృషి వల్ల ఒనగూరే ప్రభావం కానీ ఫలితం కానీ పరిగణనలోకి తీసుకోకుండా నా పని నేను చేస్తాను. పౌరధర్మాన్ని నిర్వర్తిస్తాను.
Also read: టీకామహోత్సవంలో ఏమున్నది గర్వకారణం?
విమర్శించేందుకు అర్హత కావాలా?
ఒక పౌరుడిగా ఏదైనా సమస్య గురించి ఎలుగెత్తాలంటే అందుకు అర్హతలు సంపాదించుకోవలసిన అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఒక సమస్యను ఎత్తి చూపాలంటే దానికి పరిష్కారం నాదగ్గర సిద్ధంగా పెట్టుకోవాలని కూడా భావించడం లేదు. పరిణతి చెందిన ప్రజాస్వామ్యంలో ప్రజలూ, ప్రవీణులూ సంబంధిత సమాచారం ఆధారంగా బహిరంగ చర్చలో పాల్గొని సమాలోచన చేయడం ద్వారా పరిష్కారం లభిస్తుందని నా విశ్వాసం. అప్పుడప్పుడు ప్రభుత్వం గురించీ, నాయకుల గురించి రెండు మంచి మాటలు చెప్పడం ద్వారా ప్రభుత్వాన్నీ, నాయకులనూ విమర్శించే హక్కును సంపాదించుకోవలసిన అగత్యం ఉన్నదని కూడా నేను అనుకోవడం లేదు. ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని పొగడకుండానే నేను విమర్శనాస్త్రాలు సంధించగలను. అది నన్ను తక్కువ వస్తునిష్టంగా కానీ తక్కువ నిస్పక్షపాతంగా కానీ నిలపదు. నిస్పక్షపాతం, వస్తునిష్టత విషయంలో నేను కపటంగా వ్యవహరించనక్కరలేదు. ‘చూడండి నేను ప్రభుత్వాన్ని ఆ విషయంలో ప్రశంసించాను. కనుక ఇప్పుడు విమర్శిస్తున్నానంటే నేను సమదృష్టితో ఉన్నానన్న మాట’ అని చెప్పుకోవలసిన అవసరం ఉన్నదని నేను అనుకోవడం లేదు. అది నా పద్ధతి కానేకాదు. నా మనసులో ఉన్న విషయాలను ప్రభుత్వానికి చెప్పే సంపూర్ణమైన, అణచివేయజాలని ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటాను. సంస్కారవంతంగా ఆ పని చేస్తాను. వాస్తవాలకు విధేయంగా ఉంటూ వాటికి నిజం చెప్పే అవకాశం కల్పిస్తాను. దురుసుగా దుర్భాషభూయిష్టంగా చేసే వ్యాఖ్యలు కానీ, పని కట్టుకొని నన్ను అదేపనిగా దూషించడం, వేధించడం వల్ల కానీ నేను నిరుత్సాహం చెందను. నాలో న్యూనతాభావం కలగదు.
Also read: ఆర్ఎస్ఎస్ బలం పెరిగింది, దృష్టి మందగించింది
మోదీని అభిమానిస్తేనే దేశభక్తులు
మన బహిరంగ సంభాషణ మొత్తం మీద ఎట్లా ఉన్నదో చూద్దాం. ప్రభుత్వానికి అనుకూలమైన, అధికార వ్యవస్థకు సానుకూలమైన ధోరణి ప్రజలలో న్యూనతాభావం కలిగించే స్థాయికి చేరింది. ఈ ఉదాహరణలు చూడండి. ప్రధాని జన్మదినం నాడు రెండుకోట్ల కొవిద్ టీకాలు వేసి, ఆ తర్వాత వందకోట్ల టీకాలు పూర్తి చేసిన తర్వాత జరిగిన ప్రచారార్భటి కారణంగా గతంలో టీకాల విషయాన్ని ప్రభుత్వం జటిలం చేయడం వల్ల ప్రజలు పడిన ఇక్కట్లను ఇప్పుడు మరచిపోయే అవకాశం ఉంది. డిజిటల్ ధనం లావాదేవీలు పెరుగుతున్నాయంటూ వార్తాసంస్థలు ఊదర కొట్టడం మూలంగా తలకాయలేని పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల కోట్లాదిమందికి కలిగిన బాధలను, భారీ ఆర్థిక పతనాన్నీ, నెలల తరబడి పడిన కష్టాలను ప్రజలు మరచిపోయే అవకాశాలు ఉన్నాయి. జమ్మూ-కశ్మీర్ వార్తలనూ, వ్యాఖ్యలనూ అణచిపెట్టడం వల్ల 370వ అధికరణను రద్దు చేసిన మీదట రాష్ట్ర రాజకీయ నాయకులను సుదీర్ఘకాలం జైలులో నిర్బంధించడం వల్ల రగిలిన ఆగ్రహజ్వాలను ప్రజలు విస్మరిస్తారని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రభుత్వం పట్టించుకోని కారణంగా వేలాది వలస కార్మికులు స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అనుభవించిన నరకయాతనని ఇప్పుడు జాతి విస్మరించింది. దేశవిభజన సమయంలో సంభవించిన హత్యాకాండకు సంబంధించిన భయానకమైన జ్ఞాపకాలను అవి జరిగి 75 సంవత్సరాలు అయినా మళ్ళీ ప్రజలకు గుర్తు చేయాలనీ, వాటిని జాతీయ అజెండాలోకి తీసుకురావాలనీ ప్రధాని అనుకున్నారు. కానీ ఇటీవల తన ఆధ్వర్యంలో వలస కార్మికుల కష్టాలను ప్రజలు మరచిపోవాలని కోరుకుంటున్నారు. కాశీ, కేదార్ నాథ్ పునరుజ్జీవన కార్యక్రమాలను వారసత్వ పునరుద్ధరణ ఉత్సవాలుగా పరిగణించాలని ఆయన ప్రభుత్వం తలపోస్తోంది. ఆ విధంగా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలోని ప్రజలు లేని వికాస్ (అభివృద్ధి) గురించి ఆలోచించకుండా, పెరుగుతున్న నిత్యవాసర వస్తువుల ధరలను, నిరుద్యోగాన్నీ, దుందుడుకు ముఠాలు శాంతిభద్రతలను ఛిద్రం చేయడాన్నీ పట్టించుకోకుండా ఉంటారనీ, సమాజాన్ని మత ప్రాతిపదికన చీల్చడం, విద్వేషభరితమైన మాటలూ, చేతలతో అతలాకుతలం చేయడం పట్ల ప్రజలు ఉత్సాహం ప్రదర్శిస్తారని వారి అంచనా.
Also read: లఖీంపుర్ ఖేరీ: బీజేపీ, మోదీ మన్ కీ బాత్
భ్రమలు కల్పించేందుకు బృహత్ ప్రయత్నాలు
భ్రమలు కల్పించే వాతావరణం మనుషుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. కోవిద్ మరణాల గురించి మనం వ్యధచెందడం లేదు. అవి మనలను చలింపజేయడం లేదు. కోవిద్ మృతులు గంగానదిలో తేలుతూ రావడాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఆ దృశ్యం మనలను స్పర్శజ్ఞానం కోల్పోయేట్టు చేసింది. చైనా దురాక్రమణ గురించీ, మన భూభాగంలో చైనా గ్రామాల నిర్మాణం గురించీ మాట్లాడటం లేదు. మన మనసులు మొద్దుబారి పోయాయి. చట్టసభలలో సంఖ్యాధిక్యం లేకుండా పలు రాష్ట్రాలలో అనైతికంగా అధికారం హస్తగతం చేసుకోవడాన్ని మనం మరచిపోయాం. ఒక బీజేపీ ముఖ్యమంత్రి చేత తెల్లవారుజామున ప్రమాణం చేయించడాన్నీ, అతగాడు వెంటనే అవమానకరంగా నిష్క్రమించడాన్నీ పెద్దగా పట్టించుకోం. పెద్దనోట్ల రద్దు వల్ల వస్తాయన్న లాభాలు రాలేదన్న విషయం మరచిపోయాం. పరిస్థితులను చక్కబెట్టటానికి 50 రోజుల సమయం ఇవ్వండి చాలంటూ ప్రధాని చేసిన బూటకపు విజ్ఞప్తిని మొద్దుమారిన మన మనసులు గుర్తుపెట్టుకోలేదు.
భ్రమలు కల్పించి ఆత్మన్యూనత కలిగించడంతో పాటు ముద్రలు వేయడం అదనం. ఎవరైనా ప్రశ్నిస్తే, సమ్మతించకపోతే, వ్యతిరేకిస్తే, విభేదిస్తే వారిపైన ప్రభుత్వ వ్యతిరేకులనే ముద్రవేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం మోదీని వ్యతిరేకించడమే. మోదీకి వ్యతిరేకమంటే జాతికి వ్యతిరేకం. భారత్ కు వ్యతిరేకం. దేశభక్తిహీనం. దేశభక్తులూ, జాతీయతావాదులూ కావాలంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి. మోదీని అభిమానించాలి. ఈ విధానాన్ని నిజంగా, మనస్ఫూర్తిగా విశ్వసించేవారు ఉన్నారు. ఈ విశ్వాసాన్ని వారు ప్రచారం చేస్తారు. ఇందుకు వారిని నిందించనక్కరలేదు. వారు ఒక కనికట్టు ప్రభావానికి లోనై ఉన్నారు. వారు అధికారపార్టీకి చెందినవారూ, ప్రభుత్వంలో పని చేస్తున్నవారూ. ఇందులో ఆశ్చర్యం లేదు. కానీ విద్యాసంస్థలలో, వ్యాపారంలో, పరిశ్రమలలో, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులలో (ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసెస్), వివిధ వృత్తులలో అటువంటివారు ఉన్నారు. ఆశ్చర్యకరంగా మీడియాలో కూడా ఉన్నారు. నిజంగానే మంచిపనులు జరుగుతున్నాయని వారు విశ్వసిస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, మన రాజ్యాంగసంస్థలను నిర్వీర్యం చేయడం, మన ప్రజాస్వామ్య పద్ధతులను భ్రష్టుపట్టించడం, పార్లమెంటరీ విధానాలను కాలరాయడం, ప్రాథమిక హక్కులనూ, ప్రైవసీ (వ్యక్తిగత ఏకాంతత)నీ ఉల్లంఘించడం, పెగసస్ వంటి సాఫ్ట్ వేర్ తో డిజిటల్ చొరబాటు వంటి పనులు చేయడం వారికి పట్టవు. ఈ ప్రభుత్వం తలపెట్టిన భవ్యమైన, దివ్యమైన నాగరికత పునరుద్ధరణ ప్రణాళిక సాధనకు ఇటువంటి చిన్న చిన్న మూల్యాలు చెల్లించక తప్పదని భావిస్తారు.
Also read: కాంగ్రెస్ పార్టీ కోలుకోవాలంటే…
స్వప్రయోజనాలకోసం విలువలకు తిలోదకాలు
కానీ ఇతరులు కూడా ఉన్నారు. వారికి ఈ ప్రణాళికలో విశ్వాసం లేదు. భౌతిక ప్రయోజనాలకోసం నైతిక విలువలను త్యాగం చేయడానికి సంకోచించని ఈ వర్గం ఈ ప్రణాళికను బలపరుస్తుంది. గణతంత్రానికి అది విషాదం. వారి వైఖరి వల్ల ఎటువంటి నష్టం జరుగుతున్నదో వారికి తెలుసు. కానీ తమకు వ్యక్తిగతంగా వస్తున్న లాభాలూ, నెరవేరుతున్న ప్రయోజనాలూ చూసుకుంటున్నారు. కొందరు విజేతలవైపు ఉండాలని కోరుకుంటారు. అందువల్ల వారికి ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు. వారు కూడా మన బహిరంగ సంభాషణకు అంతే నష్టాన్ని కలిగిస్తారు. కొందరు ప్రభుత్వం శక్తిని తట్టుకొని నిలబడలేరు. వారి వ్యాపార ప్రయోజనాలే వారి బలహీనత. ఈ వ్యక్తులు అందరూ ఒకరిని పోలినవారు ఒకరు కాదు. వారి లక్ష్యాలు వేర్వేరు. వారి ప్రయోజనాలు భిన్నమైనవి. కానీ వారంతా అధికార వ్యవస్థ ద్వంద్వ వైరుధ్యానికి సేవలు అందించేందుకు కలిసిపోతారు. ప్రభుత్వాన్ని విమర్శించేవారిపైనా, అసమ్మతివాదులపైనా ముద్రలు వేస్తారు. జాతి మనసు మొద్దుబారేటట్టు చేస్తారు. కపట వ్యవస్థ నడవడానికి దోహదం చేస్తారు. కుట్రనూ, దృష్టి మరలించే పనినీ కొనసాగిస్తారు. కాశీ, కేదార్ నాథ్, అయోధ్య వంటి బ్రహ్మాండమైన దృశ్యప్రధానమైన కార్యక్రమాలవైపు ప్రజల దృష్టిని మరల్చడం ఒక వైపు, వందకోట్ల కోవిద్ టీకాలు వేసిన సందర్భంగా జరిగే టీకామహోత్సవం మరోవైపు, విదేశీ పర్యటనలూ, ప్రభుత్వ కార్యక్రమాలను అద్భతమైన ప్రచార సంరంభంతో, కళ్ళు చెదిరే సన్నివేశాలతో ప్రారంభించడం ఇంకోవైపు. వీటన్నిటినీ చూసి గణతంత్రం (రిపబ్లిక్) ఆదర్శాలపైన ప్రభుత్వ జరుపుతున్న దాడిని గమనంలోకి తీసుకోనంతగా పౌరుల మనసులు మొద్దుబారి పోతున్నాయి.
గ్లాడియేటర్ సినిమాలో సంభాషణ
గ్లాడియేటర్ సినిమాలో ఇద్దరు సెనేటర్ల మధ్య జరిగిన సంభాషణ నాకు గుర్తువస్తున్నది. మార్కస్ అరీలియస్ కుమారుడూ, వారసుడూ అయిన కొత్త సీజర్ కొమోడస్ గురించిన సంభాషణ ఇలా సాగుతుంది:
మొదటి సెనేటర్: నూటాయాభై రోజులపాటు ఆటలా?
రెండో సెనేటర్: నేను అనుకున్నదానికంటే అతడు తెలివైనవాడు.
మొదటి సెనేటర్: ప్రేటోరియన్లను చూసి అంతగా భయపడితే రోమ్ నగరమంతా అతణ్ణి చూసి పగలబడి నవ్వుతుంది.
రెండో సెనేటర్: భయం, ఆశ్చర్యం. శక్తిమంతమైన కలయిక.
మొదటి సెనేటర్: ప్రజలు దానికి లొంగిపోతారని మీరు నిజంగా అనుకుంటున్నారా?
రెండో సెనేటర్: రోమ్ అంటే ఏమిటో అతనికి తెలుసు అని నేను అనుకుంటున్నా. రోమ్ అంటే జనం. మంద. వారికోసం ఒక మాయ కనిపెట్టితే దానితో వారి దృష్టి మరలుతుంది. వారి స్వేచ్ఛలను రద్దు చేసినా వారు ఆ మాయలో పడి ఉద్వేగంతో కేకలు వేస్తూనే ఉంటారు. కొట్టుకునే రోమ్ గుండె సెనేట్ లోని చలువరాయి వంటిది కాదు. రోమ్ నగర మధ్యంలో ఉన్నపోరాట వేదిక కొలోసియంలోని ఇసుక. వారికి అతడు మృత్యువును ప్రసాదిస్తాడు. అందుకు వారు అతడిని ప్రేమిస్తారు.
MwK (Midweek Matters)-40 వ ఎపిసోడ్ కి అనువాదం