న్యూఢిల్లీ: ఉబెర్, ఓలా సహా ఇతర క్యాబ్ సేవల సంస్థలను మోటారు వాహనాల (సవరణ) పరిధిలోకి తెస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. కాలుష్య నియంత్రణ, వ్యాపారంలో పారదర్శకత, తదితర ప్రయోజనాలకోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2020 మోటారు వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. కాబ్ ఆపరేటర్లు బాదుతున్న సర్ చార్జీలకు బ్రేక్ వేసింది. అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో 1.5 రెట్లు బేస్ ఛార్జీలకు కోత పెట్టింది. అలాగే అవి అందించే డిస్కౌంట్‌ను బేస్ ఛార్జీలలో 50 శాతానికి పరిమితం చేసింది. బేస్ ఛార్జీ రూ 25-30గా ఉండాలని, అగ్రిగేటర్లతో అనుసంధానమైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని ఆ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. అయితే బేస్ ఛార్జీలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
ఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతిన్న డ్రైవర్లను ఆదుకునేలా ప్రతీ రైడ్ ద్వారా వచ్చిన దానిలో కనీసం 80 శాతం వారికి అందాలని ప్రభుత్వం ఆదేశించింది., డ్రైవర్లకు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా,రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ మొత్తం ప్రతి సంవత్సరం 5 శాతం పెంచాలి.
సవరించిన సెక్షన్ 93 మార్గదర్శకాల ప్రకారం క్యాబ్ సంస్థలు తమసేవలను, కార్యకలాపాలను ప్రారంభించడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం.
డ్రైవర్లకు నిబంధనలు
డ్రైవర్లు 12 గంటలకు మించి పనిచేయడానికి లేదు. పది 10 గంటల విరామం తప్పనిసరి. ఒకటి కంటే ఎక్కువ కంపెనీలలో పనిచేసే డ్రైవర్లు 12 గంటల పనిదినం నిబంధనను ఉల్లఘించకుండా అగ్రిగేటర్లు చూసుకోవాలి. వారి భద్రత, ప్రయాణీకుల భద్రత నిర్ధారణకు ఈ పనిగంటలను పర్యవేక్షించేందుకు ఆయా యాప్‌లో ఒక యంత్రాంగాన్ని తీసుకురావాలని కోరింది.