Sunday, November 24, 2024

బిజెపి తెరపైకి కొత్త ముఖాలు, సరికొత్త కోణాలు

మాశర్మ

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా జెపి నడ్డా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయస్థాయిలో  కొత్త బృందాన్ని నిర్మించడాన్ని  కీలకమైన పరిణామంగా భావించాలి. ముఖ్యంగా దక్షిణాది, తెలుగురాష్ట్రాల్లో బలపడడం కోసం కొత్త కసరత్తులు ప్రారంభించారు. పురందేశ్వరి, లక్ష్మణ్, డి కె అరుణకు కీలకమైన పదవులు కట్టబెట్టారు. రామ్ మాధవ్, మురళీధర్ రావు, జి వి ఎల్ నరసింహారావులను ప్రస్తుతం ఉన్న పదవుల నుండి తప్పించారు. దీని వెనకాల ఉన్న వ్యూహం, భవిష్యత్తులో వీరిని ఏ ఏ స్థాయిల్లో సద్వినియోగం చేసుకుంటారో  తెలియాల్సి వుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో బడా నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ సేవలను ఏ మేరకు  ఉపయోగించుకుంటారో తేలాల్సి వుంది. కొత్తగా వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొన్ని మిత్ర పక్షాలు సైతం  తీవ్ర వ్యతిరేకతను  వ్యక్తం చేశాయి. అకాలీదళ్ నాయకురాలు, కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఎన్ డి ఏ ప్రభుత్వం నుండి వైదొలిగారు. బీహార్ లో త్వరలో ఎన్నికలు కూడా జరుగ నున్నాయి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో, కొత్త సభ్యుల నియామకం వెనుకాల ఏదో బలమైన వ్యూహమే ఉందని భావించాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే…పురందేశ్వరి, డి కె అరుణ, డాక్టర్ కె లక్ష్మణ్ తో పాటు సత్యకుమార్ కు మంచి స్థానాలు దక్కాయి. ఇందులో సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవిని మరోమారు పొడిగించారు. మొత్తంగా చూస్తే, 70మంది సభ్యులుగా ఉన్న బిజెపి బృందంలో కొత్త, పాతల కలయికతో పాటు సమర్థులు, సామర్ధ్యం నిరూపించుకోవాల్సిన వాళ్లు, అనుభవశాలురు ఉన్నారు.

పెద్ద నేతలపై చిన్నచూపా?

ముఖ్యంగా రాంమాధవ్, మురళీధరరావును జాతీయ ప్రధాన కార్యదర్శి పదవుల నుండి తప్పించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశీస్సులు పుష్కలంగా పొంది, అనూహ్యంగా ఉన్నతమైన రాజ్యసభ సీటు దక్కించుకున్న జి వి ఎల్ నరసింహారావు గొంతుకు ఎందుకు బ్రేక్ వేశారో ఆలోచించాల్సిన అంశం. దక్షిణాదిలో బలోపేతం అవ్వాలనే బలమైన ఆలోచనల్లో ఉన్న బిజెపి ఏ ఒక్క నాయకుడినీ  పొరపాటున కూడా ఒదులుకోదు. ఆకర్ష్ పేరుతో మిగిలిన పార్టీ నాయకులను తమ పార్టీలోకి రప్పించాలనే ఎత్తుగడలు వేస్తున్న బిజెపి అధిష్ఠానం  రాంమాధవ్, మురళీధర్ రావు, జివి ఎల్ నరసింహారావును వంటి పెద్ద నాయకుల పట్ల  చిన్న చూపు ఎందుకు చూస్తుంది?  వీళ్ళందరికీ సాధ్యమైనంత త్వరలో సరికొత్త పదవులను తప్పక కట్టపెడుతుంది. రాంమాధవ్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు ఎప్పటి నుండో వింటున్నాం. మురళీధర్ రావుకు రాజ్యసభ కేటాయిస్తారనే వార్తలు ఆ మధ్య వచ్చాయి.ఇదే నిజమైతే ఆశ్చర్యం లేదు. వీరిద్దరికీ  ప్రస్తుతం లోక్ సభ, రాజ్యసభ సభ్యత్వాలు కూడా లేవు. రెండు రాజ్యసభ సభ్యత్వాలు కేటాయించాల్సి వస్తుంది. వీళ్ళిద్దరికీ రాజ్యసభ సభ్యత్వం కేటాయించి మంత్రి పదవులు ఇస్తారా? అన్నది చర్చగా మారింది. అదే సమయంలో,  జివిఎల్ పాత్ర ఎలా ఉండబోతోందో.. అన్న అంశం కూడా ఆసక్తిగా ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యులుగా వుండి, బిజెపిని,ప్రధాని  నరేంద్రమోదీని తీవ్రంగా విమర్శించి, వ్యతిరేకించి బయటకు వచ్చిన సుజనా చౌదరి, సీ ఎం రమేష్ లను తమ పార్టీలోకి కలిపివేసుకున్న బిజెపి, ఎన్నో ఏళ్ళపాటు  నమ్మకస్తులుగా కీలకమైన భూమికలు పోషించిన రాం మాధవ్, మురళీధర్ రావులను అధిష్ఠానం ఎట్టి పరిస్థితుల్లో చిన్నచూపు చూడదు. ఇంకా ముఖ్యమైన పాత్రల్లో వారిని సద్వినియోగం చేసుకుంటుందనే విశ్వసించాలి. సముచితస్థానం ఇచ్చి తీరుతుందనే భావించాలి.గతంలో వీరు చేపట్టిన బాధ్యతల్లో కొన్ని వైఫల్యాలు ఉండిఉండవచ్చు. ఆ సాకుతో వీరిని పక్కన పెట్టారనుకోడానికి వీలే లేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నియామకాలను పరిశీలిస్తే, సామాజిక సమతుల్యత పాటించారని చెప్పాలి.

రెడ్డి సామాజికవర్గానికి న్యాయం

 డి కె అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవిని కేటాయించారు. తెలంగాణలో రాజకీయ రంగంలో కీలకమైన రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం చేసినట్లయింది.గతంలో బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన క్రమంలో,  రెడ్డి వర్గాల్లో అసంతృప్తి మొదలైంది. నేటితో దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మరో సీనియర్ నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్ కు ఓ బి సీ మోర్చా అధ్యక్ష పదవి చేపట్టడంతో బిసీలకు న్యాయం జరిగిందని చెప్పవచ్చు. పార్టీ బలమైన మున్నారు కాపులు, రెడ్లు, బీసీలకు తెలంగాణలో పెద్దపీట వేసి వ్యూహాత్మకమైన అడుగు వేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు త్వరలో జాతీయ పార్టీ స్థాపించి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యూహంలో ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటివరకూ కె సి ఆర్ అధికారికంగా ధ్రువీకరించలేదు. గాలివార్తలుగానే కొట్టి పారేశారు.

బీజేపీ తెలంగాణలో నయం

ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణలో బిజెపి కాస్త మెరుగ్గా ఉంది. అధికారంలోకి వచ్చేంత బలం ప్రస్తుతానికి లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో,  ప్రస్తుతం బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీపై తొలి దెబ్బ కొట్టాలనే వ్యూహంలో బిజెపి ఉంది.అందులో భాగంగా జనసేనతో పొత్తు కుదుర్చుకుంది. కొత్త అధ్యక్షుడుగా ఇటీవలే సోము వీర్రాజును నియమించుకుంది. కొత్త బృందం కూడా ఏర్పాటైంది. సోము వీర్రాజు-పవన్ కళ్యాణ్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఇద్దరూ సామాజికంగా బలమైన కాపు వర్గానికి చెందినవారు. తెలుగుదేశంను దెబ్బకొట్టాలంటే చంద్రబాబుకు బాగా వ్యతిరేకమైన వ్యక్తి కావాలి.

పురందేశ్శరికి ప్రాధాన్యం

ఈ ఆలోచనతో పురందేశ్వరికి ఎంతో ప్రాధాన్యత కలిగిన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు.ఎన్టీఆర్ కుమార్తెగా, బలమైన కమ్మ సామాజిక వర్గ ప్రతినిధిగా ఈమెకు ఈ పదవి దక్కిందని భావించాలి. కమ్మ సామాజిక వర్గం నూటికి 99శాతం తెలుగుదేశం అభిమానులు. ఈ నేపథ్యంలో, ఒకవేళ కొందరు నాయకులను బిజెపిలోకి మళ్లించినా, ఓటింగ్ లో ఏ మేరకు ఫలితాలు వస్తాయన్నది అనుమానమే. అధికార వై సి పి పై, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చెయ్యడంలో పురందేశ్వరి ముందు ఉంటారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన తొలిరోజు నాడే ప్రభుత్వంపై,  వై సి పి పై  తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే దీనికి అద్దం పడుతున్నాయి. అమరావతిలోనే రాజధాని ఉండడానికి తన మద్దతును బలంగా ప్రకటించారు. అటు తెలుగుదేశంపార్టీ,  చంద్రబాబునాయుడు-ఇటు వై సి పి ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చెయ్యడానికి ఈమె బాగా ఉపయోగపడతారు.      వై సి పి నుండి బిజెపిలోకి లీడర్లను, క్యాడర్ ను ఆకర్షించడంలో ఏ మేరకు సత్ ఫలితాలను సాధిస్తారో వేచి చూడాల్సిందే. డి కె అరుణ లాగానే  పురందేశ్వరి కూడా కాంగ్రెస్ నుండి బిజెపి లోకి చేరిన నాయకురాలు. గతంలో విశాఖపట్నం నుండి కాంగ్రెస్ తరపున లోక్ సభ స్థానానికి నిలబడి గెలిచి కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. 2014 ఎన్నికల్లో బిజెపి తరపున లోక్ సభకు విశాఖపట్నం, విజయవాడ స్థానాలను ఆశించారు. కడప జిల్లాలోని రాజంపేట కేటాయించడంతో ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానానికి నిలబడి మళ్ళీ ఓడిపోయారు. ప్రారంభంలో బాపట్ల నుండి కాంగ్రెస్ లోక్ సభకు ఎంపికయ్యారు. తదనంతర పరిణామాల్లో విశాఖపట్నం, విజయవాడ వైపు పురందేశ్వరి ఎక్కువ మక్కువ చూపించారు. అమరావతి రాజధాని అంశానికి జైకొట్టడంతో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర వాసుల ఆగ్రహం ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుంటూరు, విజయవాడ ప్రజలు ఏ మేరకు అభిమానిస్తారో కాలంలోనే తెలుస్తుంది.

సత్యకుమార్ పదవి పొడిగింపు

జాతీయ కార్యదర్శిగా రెండవ పర్యాయం పదవిని చేపట్టిన సత్యకుమార్ రాయలసీమలోని ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపకు చెందిన బీసీ వర్గీయుడు. వీటన్నింటి కంటే ముఖ్యంగా మొన్నటి వరకూ ఎం వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా చాలా ఏళ్ళపాటు సేవలందించిన వ్యక్తి కావడం విశేషం. సత్య కూడా  వై సి పి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. అమరావతి రాజధాని అంశాన్ని బలపరుస్తున్నారు. బిజెపి ఎదుగుదలలో సత్యకుమార్ ప్రభావం ఏ మేరకు ఉంటున్నది ఇప్పుడే చెప్పలేం. నిన్నటి వరకూ వెంకయ్యనాయుడు వ్యక్తిగానే పేరుంది. నాయకుడుగా ఇంకా పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఈ మూడు నాలుగేళ్లల్లో నిరూపించుకుంటారేమో చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు, హిందూ ప్రతిమలు ధ్వంసం కావడం, అన్యమత ప్రచారాలు మొదలైన సున్నితమైన అంశాలను బిజెపి కొత్త బృందం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుండీ బిజెపి బలహీనంగానే ఉంది. 2019ఎన్నికల సమయం నుండి మరింత బలహీనమయ్యింది. అధికారంలో ఉన్న వై సి పి ప్రస్తుతానికి చాలా బలంగా ఉంది. టిడిపికి సీట్లు తక్కువగా వచ్చినా, ఓటింగ్ శాతం బలంగానే వుంది.

టీడీపీ నుంచి ఫిరాయింపులు

తాజాగా విశాఖపట్నం టీడీపి ఎం ఎల్ ఎ వాసుపల్లి గణేష్ కుమార్ వై సి పి లో చేరారు. మరో పెద్ద నాయకుడు గంటా శ్రీనివాస్ ఊగిసలాటలో ఉన్నారు. గణబాబు మొదలు మరికొందరు టిడిపి ఎంఎల్ ఏలు  వై సి పి తీర్ధం తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.  టిడిపి పాత నాయకుడు గద్దె బాబురావు పార్టీని వీడారు. తాజాగా  ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలోనూ కొత్త బృందం వచ్చింది. అచ్చెయ్యనాయుడు కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. చంద్రబాబునాయుడు మళ్ళీ నరేంద్రమోదీకి దగ్గరవ్వడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మోదీ చంద్రబాబును ఎంతవరకు నమ్ముతారన్నది అనుమానమే. మొత్తంమీద, మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ సందడి ప్రారంభమైంది. 2024 ఎన్నికల్లోపు ఇంకెన్ని పరిణామాలు, చిత్రవిచిత్రాలు జరుగుతాయో… రాజకీయ రంగస్థలంలో చూడాల్సిందే.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles