గతం గతః. నూతన సంవత్సరం వచ్చేసింది. పండుగ వాతావరణం ఆరంభమైంది. సంక్రాతి శోభలు పరుచుకుంటున్నాయి. కొత్త ఉత్సాహం కొత్త ఊపిరి ఊదుతోంది. సరికొత్త ఐడియాలు చుట్టుముట్టుతున్నాయి. కొంగ్రొత్తగా ప్రపంచం ఆవిష్కారమవ్వడానికి సిద్ధమవుతోంది. పాలకుల నుండి హాలికుల వరకూ అందరికీ ఒకటే తలపులు. ఈ సంవత్సరమంతా విజయపరంపరగా ఆనందంగా సాగాలని ఆకాంక్ష.
కొత్త కలలకు వేళాయె
పాత సంవత్సరపు పీడకలలు మరచి, ఆశయాలు, సంకల్పాలు సిద్ధించే కొత్త కలలు కనడానికి వేళ అయ్యింది, సాకారం చేసుకోడానికి 12నెలల సమయమూ ఉంది.వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయని అంటున్నారు, కొత్త స్ట్రెయిన్లను అవి తట్టుకుంటాయినీ చెబుతున్నారు. ఇంకా కొత్త వ్యాక్సిన్లు ఎన్నో రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. కాబట్టి, ఇక కరోనా గురించి ఆలోచించడం మరచిపోదాం. జాగ్రత్తలు మాత్రం తీసుకుందాం. మన పనులు మనం చేసుకుందాం. పునః నిర్మాణానికి పునాదులు వేసుకుందాం. శారీరక నిర్మాణం నుండి ఆర్ధిక నిర్మాణం వరకూ ఇది సాగాల్సిందే.
సమాఖ్య వ్యవస్థ బలోపేతం
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చెయ్యడం, సమాఖ్య వ్యవస్థను (ఫెడరల్ విధానం ) ఆచరణలో మరింతగా నెరవేర్చడం, భారీ వినియోగంపై దృష్టి సారించడం, ఉత్పాదాకతను పెంచడం, దిగువన జీవించేవారి ఆదాయాలు పెంచే చర్యలు చేపట్టడం ప్రభుత్వాల బాధ్యత.రాజకీయ స్వార్ధాలు ఎలా ఉన్నా, ఈ సంవత్సరం దేశం గురించి కాస్త ఎక్కువ ఆలోచించకపోతే, ప్రజలు నష్టపోవడమే కాదు, అధికార పార్టీలు కూడా తగు మూల్యం చెల్లించక తప్పదని ఆర్ధికశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఊపందుకుంటున్న డిజిటైజేషన్ ను మరింతగా అందిపుచ్చుకోవాలి. బ్రాడ్ బ్యాండ్ వేగం అందించిన ఫలాలను పట్టుకొని సాఫ్ట్ వేర్ రంగం మరింత ఉరకలు వేయనుందని నిపుణులు అంటున్నారు.
కొత్త ఉద్యోగాల ఊసులూ, ఆశలూ
ఈ ఏడు, వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి కొనసాగినా, పెరిగినా ఉద్యోగాలకు ఢోకా లేకపోగా,కొత్త ఉద్యోగాల కల్పన కూడా ఎక్కువగా ఉండవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి.సినిమా హాళ్లు కూడా తెరుచుకుంటున్నాయి. కొత్త సినిమాలు పెద్దతెరపై ప్రదర్శనకు నోచుకుంటున్నాయి.టీవీ ఛానల్స్ లో కొత్త కార్యక్రమాలు కూడా షురూ అవుతున్నాయి. ఓ టీ టీ వేదికలతో పాటు, యూట్యూబ్ యవనికలు పెరుగుతున్నాయి. వెబ్ సీరీస్ సంఖ్య పెరుగుతోంది. వినోదం ఎట్లా ఉన్నా, ఉపాధి అందడానికి ఆశావహ వాతావరణం అలముకుంటోంది.స్వదేశీ తయారీ, వస్తువుల వాడకంపై ఉద్యమస్ఫూర్తితో ముందుకెళదాం అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్తవ్యాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. పాలకులు మంచి ఆలోచనలు చేస్తే, ప్రజలు ఎట్లాగూ అభినందిస్తారు, ఆచరిస్తారు. అది పాలకుల చిత్తశుద్ధి, సంకల్పబలం, ఆచరణశీలంపై ఆధారపడి ఉంటుంది.
కోవిద్ పాఠాలు నేర్చుకోవాలి
కోవిడ్ నుండి నేర్చుకోవాల్సిన పాఠాల్లో క్రమశిక్షణతో పాటు, పెచ్చుపెరుగుతున్న భూతాపం (గ్లోబల్ వార్మింగ్ ) పట్ల అత్యంత స్పృహతో కదలడం అత్యంత అవసరం. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు దట్టమైన చెట్ల మధ్య తప్ప, రోడ్డు పై, వీధుల్లో నడిచే పరిస్థితి కూడా లేదు. సూర్యుడిని చూడకుండా, స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చకుండా చేసే వాకింగ్ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇళ్లల్లో సైక్లింగ్ చేసుకుంటూ స్వేదం చిందించడం తప్ప వేరే మార్గం లేదు. పైసా ఖర్చు లేకుండా చేసే నడక వల్ల వచ్చే ఆరోగ్యం ఇంతా అంత కాదు. మరి నడిచే పరిస్థితులే లేవు. ఈ కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
వాతావరణపరంగా కీలక సమయం
ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత కూడా. దాన్ని నువ్వు కాపాడుకుంటే, అది నిన్ను కాపాడుతుంది. లేకపోతే, ప్రస్తుతం అనుభవిస్తున్న దుర్గతే శరణ్యం. వాతావరణ పరంగా రాబోయే 30 ఏళ్ళు చాలా కీలకమని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన చుట్టూ వుండే వాతావరణం, పర్యావరణాన్ని కాపాడుకోడానికి కనీసం ఈ ఏడాది నుండైనా దృష్టి పెట్టాలి. ఇందులో అందరూ భాగస్వామ్యులు కావాల్సిందే. అభివృద్ధి-భూతాపాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. కొత్త సంవత్సరం వేడుకలు ఆడంబరాలకు పోకుండా జరుపుకుంటే వచ్చే నష్టమేమీ లేదు.
సమూలంగా మారనున్న విద్యావ్యవస్థ
అంతా కలసిసొస్తే, 2021డిసెంబర్ 31నాడు బాగా జరుపుకోవచ్చు. విద్యా విధానం కూడా కొత్తరూపు సంతరించుకుంటోంది. అంతర్జాల వేదికగా బోధన సాగుతోంది. పరీక్షలు అదే రీతిన జరిపే వ్యవస్థ నిర్మాణమవుతోంది. సమూలంగా భారతీయ విద్యా విధానాన్నే మార్చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషనల్ పాలసీని తీసుకొచ్చింది. విద్యకు సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నప్పటికీ, కేంద్రం సమన్వయం చేసుకుని, మేధావులు, నిపుణలతో మరింత చర్చించి ముందుకు వెళ్తే మంచిది. కూడు పెట్టని చదువు, ఊరికి ఉపయోగపడని తెలివి వృధా అనే పాత సామెతలను పూర్వపక్షం చేసేలా, వ్యక్తి నుండి దేశం వరకూ ఉపయోగపడే విద్యా విధానాన్ని రూపకల్పన చేసుకుని, ప్రపంచంలో మన జెండా రెపరెపలాడేలా నిర్మాణం చేసుకోవాలి.
వ్యవసాయరంగాన్ని కాపాడుకోవాలి
ఉన్నపళంగా, కరోనా వచ్చినప్పుడు వైద్య విధానంలో, మౌలిక వసతుల్లో, మానవ వనరుల్లో మన డొల్లతనం మొత్తం తేటతెల్లమైంది. వ్యవసాయ రంగం మన దేశాన్ని ఎంత ఆదుకుందో,2020 తెలిపింది. ఈ దేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. మన గ్రామీణ భారతం బాగుంటేనే మన దేశం బాగుంటుంది. రైతులు చేస్తున్న మహోద్యమానికి శుభం పలికేలా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. వ్యవసాయ భారత అభివృద్ధికి రైతుల నుండి, శాస్త్రవేత్తల నుండి సరికొత్తగా ఆలోచనలను, ప్రతిపాదనలను ఆహ్వానించి, వ్యవసాయానికి కొత్త రూపు, కొత్త ప్రాపు అందించాలి. అన్ని రంగాలను పునః సమీక్ష చేసుకుంటూ, తప్పుఒప్పులు తెలుసుకొని ప్రభుత్వాలు వ్యవహరించాలి. 2021లో దేశం ఊపిరి పీల్చుకుని, నవభారతంవైపు వేగంగా నడుస్తుందని ఆకాంక్షిద్దాం. ఎల్లరకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.