- అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- యూకేకు విమానసర్వీసులు రద్దు
బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూడటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. దాదాపు అన్ని దేశాలు ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. కరోనా వైరస్ కంటే భయానక పరిస్థితులను సృష్టించే సామర్థ్యం కొత్త వైరస్ కు ఉందని వైరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి దేశంలోకి చేరుకున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టులోనే టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. సోమవారం యూకే నుంచి 266 మంది ప్రయాణికులు ఢిల్లీ చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో దిగిన వెంటనే పరీక్షలు నిర్వహించగా ఐదుగురు ప్రయాణికులు విమాన సిబ్బందికి కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో వీరిని క్వారంటైన్ కు తరలించారు. కనెక్టింగ్ విమానం ద్వారా చెన్నై వెళ్లిన మరో వ్యక్తికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వీరి నమూనాలను సేకరించి నేషనల్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు పంపించారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు
బ్రిటన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆదేశానికి విమాన సర్వీసులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెలాఖరు వరకు నిషేధం అమలులో ఉంటుంది. ఇప్పటికే బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించకోవాలని స్పష్టం చేసింది. బ్రిటన్ నుంచి భారత్ కు వస్తున్న ప్రయాణికుల్లో వైరస్ కేసులు నిర్దారణ అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపధ్యంలో వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ కరోనా టెస్టులు చేయాలని సూచించింది.
ప్రంపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
బ్రిటన్ లో వ్యాపిస్తున్న కొత్త వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా నియంత్రణకు పాటించిన నిబంధనలకు ఇపుడూ పాటించాలని సూచించింది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ కరోనా నిబంధనల్ని పాటించాలని సూచించింది. ఏమరుపాటు పనికిరాదని ఆజాగ్రత్త వహిస్తే పెను ప్రమాదం తప్పకపోవచ్చని ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
అలర్టయిన తెలంగాణ ప్రభుత్వం
యూకేలో కరోనా స్ట్రెయిన్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ స్పష్టం చేసింది. విదేశాలనుంచి వస్తున్న ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:కరోనా టీకా పంపిణీకి కమిటీల ఏర్పాటు