Thursday, December 26, 2024

గుజరాత్ లోనూ గెలుపుగుర్రం ఎంపిక

పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైన భారతీయ జనతా పార్టీ, వ్యూహరచనలో దూకుడు పెంచుతోంది. వివిధ రాష్ట్రాలలో బలహీనంగా ఉన్న ముఖ్యమంత్రులను వరుసగా మార్చుకొంటూ వెళ్ళిపోతోంది. ఉత్తరాఖండ్,అస్సాం,కర్ణాటక మొదలైన రాష్ట్రాలలో చోటుచేసుకున్న పరిణామాలే దానికి ఉదాహరణ. తాజాగా గుజరాత్ లోనూ అదే జరిగింది. ఈ సందర్భం నేడు వార్తల్లో చర్చనీయాంశమైంది. గుజరాత్ లో ముఖ్యమంత్రుల మార్పు కొత్త కాదు, ఇది మూడోసారి. ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ పదోన్నతి పొందిన సమయంలో,ఆయన స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ ను నియమించారు. వయసు రీత్యా 2016 ఆగష్టు 4వ తేదీన ఆమె ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అప్పటికే ఆమె 75 ఏళ్ళకు చేరువయ్యారు.ఆమె స్థానంలో విజయ్ రూపాణీని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపికచేశారు. 2018లో ఆమెను మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. ఛత్తీస్ ఘడ్ కు గవర్నర్ గా కొంతకాలం అదనపు బాధ్యతలను నిర్వహించారు. 2019 జులై నుంచి ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. తాజాగా, విజయ్ రూపాణీని తప్పించి భూపేంద్ర పటేల్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టారు.

Also read: వీగిపోయిన అగ్రరాజ్యహంకారం

ఆనందీబెన్ పటేల్ ప్రాబల్యం

ప్రస్తుత గుజరాత్ రాజకీయాలలో మాజీ ముఖ్యమంత్రి, నేటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ కీలకంగా మారారు. 2022 డిసెంబర్ లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. సుమారు 15 నెలలు సమయం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా బిజెపి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోతోందని, పార్టీకి ప్రతికూల వాతావరణం ముసురుకుంటోందని గుర్తించిన అగ్రనేతలు ఉన్నపళంగా మార్పులు చేసేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల లోపు పార్టీని మరింతగా బలోపేతం చేయకపోతే, ఆ ఎన్నికల్లోనూ, తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ భారీమూల్యం తప్పదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ సమయంలో, ముఖ్యంగా రెండో వేవ్ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే వార్తలు వెల్లువెత్తాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీ ఆర్ పాటిల్ -విజయ్ రూపానీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ప్రచారం జరుగుతోంది. రూపానీకి అమిత్ షా మనిషిగా పేరుంది. షా అండదండలతోనే ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకుంటారు. ముఖ్యమంత్రిని మార్చకపోతే, పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆర్ ఎస్ ఎస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. క్షేత్రస్థాయి వాస్తవాలు,ఆర్ ఎస్ ఎస్ ఆరోపణల మధ్య రూపాణీని మార్చక తప్పలేదు. అమిత్ షా కూడా మార్పుకు సమ్మతించినట్లుగా తెలుస్తోంది. రూపాణీ స్థానంలో సమర్ధవంతమైన నాయకత్వానికి పట్టంకట్టడం అనివార్యమైంది. అదే సమయంలో, ఎన్నికల్లో సామాజిక వర్గ ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను ఎంపికచేసినట్లు భావించాలి. భూపేంద్ర పటేల్ ఎంపికలో ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ సలహాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నరేంద్రమోదీ సొంత రాష్ట్రం, ముఖ్యమంత్రిగా పదేళ్లు ఉండేలా చేసిన ప్రాంతం, నేడు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగేలా బలమైన పునాదులు వేసిన గుజరాత్ అంశాలను అధిష్టానం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటోంది. అధికార, ప్రధాన వర్గాలలోనూ గుజరాతీయులే నేడు అన్నెడలా చక్రం తిప్పుతున్నారన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో నాయకత్వ సమర్ధతతో పాటు, సామాజిక వర్గాల ప్రభావం విస్మరించలేనిది. నేటి ముఖ్యమంత్రి మార్పులోనూ అవే ప్రభావితం చేశాయని చెప్పాలి.

Also read: తెలుగు సాహిత్య విశ్వరూపం విశ్వనాథ

బీజేపీ ఎదుగుదలకు 1960ల నుంచే క్షేత్రస్థాయిలో కృషి

నేటి బిజెపి ఎదుగుదలకు, 1960ల ప్రాంతం నుంచే క్షేత్ర స్థాయిలో నిర్మాణం జరుగుతూ వచ్చింది. 1980లలో స్థానిక ఎన్నికల్లో అమేయమైన గెలుపును సాధించడంతో పార్టీ ప్రాభవం ప్రారంభమైంది. ప్రతిదశలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్ ) పాత్ర వెలకట్టలేనిది. గ్రామీణ -పట్టణ ప్రాంతాలలో సమాంతరంగా పార్టీని విస్తరించుకుంటూ వచ్చారు. 1995 నుంచి బిజెపి అప్రతిహతంగా దూసుకుపోతోంది. పార్టీ ఎదుగుదలలో బనియా, బ్రాహ్మణ సామాజిక వర్గాల పాత్ర కూడా చాలా పెద్దది. సౌరాష్ట్ర నుంచి వచ్చిన రాజ్ పుట్స్ మరో బలంగా మారారు. 1980ల నుంచి పటేల్ /పాటీదార్ సామాజిక వర్గం కూడా పార్టీవైపు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా, 1998-2001 మధ్య పార్టీ ఎదుగుదల మరోదశకు చేరింది. పటేల్ సామాజిక వర్గ ప్రభావం పార్టీపై మరింతగా పెరిగింది. ఈ క్రమంలో 1998లో కేశూభాయ్ పటేల్ ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. 2000ల నుంచి పార్టీ అంతర్గత రాజకీయాల్లో మార్పులు ఆరంభమయ్యాయి. కేశుభాయ్ వర్గం – అప్పటి ప్రధాన కార్యదర్శి నరేంద్రమోదీ వర్గంగా రెండు చీలికలు వచ్చాయి. ఈ ప్రస్థానంలో,2001 నుంచి నరేంద్రమోదీ ఆధిక్యం పెరగడం ప్రారంభమైంది.తర్వాత కథ తెలిసిందే. గుజరాత్ రాజకీయాల్లో,14 శాతం ఉన్న పటేల్ సామాజిక వర్గం బలమైందిగా ప్రభావితం చేస్తోంది. పార్టీ గెలవాలంటే వీరి అండ తప్పనిసరిగా మారిపోయింది. నేటి పరిణామాల్లోనూ అదే ప్రభావం చూపించింది.

Also read: అన్నదాత ఉసురు తగులుతుంది, జాగ్రత్త!

పటేల్ కే పట్టం శ్రేయస్కరం

పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే పఠేల్ సామాజిక వర్గాన్ని మంచిచేసుకోవడం అవసరమని బిజెపి పెద్దలు భావించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రిగా ఎంపికైన భూపేంద్ర పటేల్ అదే సామాజిక వర్గానికి చెందిన నేత. ఆనంద్ బెన్ కు సన్నిహితుడు. రేపటి ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆమె అండదండలు కూడా అవసరమని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. అందుకే, ఆమెకు అనుకూలమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించినట్లు ప్రచారంలో ఉంది. పటేల్ కు సమర్ధుడనే పేరుంది. కీలకమైన గుజరాత్ లో భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. పార్టీ చేపట్టిన ‘ముఖ్యమంత్రుల మార్పు విధానం’ ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో కాలంలో తేలుతుంది.

Also read: ఆగ్రహంతో రగిలిపోతున్న అఫ్ఘాన్ మహిళలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles