ఆకాశవాణిలో నాగసూరీయం -15
“…ఇదేంటి సర్, మీతో వ్యాసం రాయమని అడిగితే – ట్రాన్స్ ఫర్స్ ను సమర్థిస్తూ ఇలా రాస్తే ఎలా?” – అని ప్రశ్నించారు మిత్రుడైన సహోద్యోగి ఒక పదహారేళ్ళ క్రితం!
“మిస్టర్ వేణుగోపాల్, మీకు ఊళ్ళు వెళ్ళడం ఇష్టం కదా! తిరుపతి బదులు కోయంబత్తూరుకు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళవచ్చుకదా…”- అని ఆరేళ్ళ క్రితం మదరాసు సహోద్యోగి సలహాతో (ఎవరికో) సాయం చేయాలని ప్రయత్నించింది!!
“… నమస్కారం సార్, … ఇక్కడే ఉన్నారా? లేదా మళ్ళీ ట్రాన్స్ ఫర్ కాలేదు కదా! – అని మరో (అ) మిత్రుడి ఫోన్ పల్కరింపు”!!!
ఇవేకాదు, మరికొన్ని కూడా వైవిధ్యమైన వ్యూ పాయింట్స్ ఉన్న ఫళంగా చెప్పవచ్చు. అయితే, ఈ సమయంలో – పదవీ విరమణ అయిన తర్వాత చెప్పాలంటే మా ఆవిడ హంస మాటల గురించి చెప్పాలి. “నిజమే… అప్పుడు లగేజీ వేసుకుని, ఇళ్ళు మారుతూ, ఊళ్ళు తిరగడం కష్టమే – కానీ ఆ ఇబ్బందుల ఫ్రూట్స్ ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఏ తెలుగు ప్రాంతం వెళ్ళినా ఆ ప్రాంతపు భాష, వంటలు, పంటలు, స్థలాలు, స్వభావాలు ఎంతో కొంత బోధ పడ్డాయి. ఏ ఊరు వెళ్ళినా తెలిసినవారు తారస పడుతున్నారు. ఎంతో హాయిగా ఉంది… !” అని ఆవిడ ఇపుడు మిత్రులకు చెబుతూ ఉంటారు!
Also read: పదిలంగా సాగిన ఉద్యోగ రథం!
ప్రత్యక్ష జ్ఞానం మిన్న
పుస్తక జ్ఞానం కన్నా ప్రత్యక్ష జ్ఞానం మిన్న. కదా! పనాజి (గోవా), అనంతపురం, విజయవాడ అనంతపురం, విశాఖపట్నం, హైదరాబాదు, కడప, మద్రాసు, తిరుపతి, హైదరాబాదు – ఇవి బదిలీ మీద చూసిన, పూర్తి నివాసమున్న నగరాలు లేదా ఊళ్ళు. నాలుగు రాష్ట్రాలు, ఎనిమిది ఊళ్ళు! ఇవి కాక , ఢిల్లీలో కొన్ని నెలలు పాటు చాలా సార్లు ఉద్యోగం చేయడం. ఢిల్లీ తప్పా, గోవా కాకుండా ప్రతి చోటకు సకుటుంబంగా ఆరేడు వేల పుస్తకాలతో బదిలీ బాదరాయణం అనుభవిస్తూ వచ్చాం. ఇందులో ఉద్యోగం, ఊరు, ఉద్యోగులు, కళాకారులు, దినసరి రవాణా వగైరా నాకు మారితే; ఆమెకు ఇల్లు, పనిమనిషి, కూరల మార్కెట్టు, దినసరి వస్తవుల కొనుగోలు! మా సొంత ఊళ్ళకు వెళ్ళడం వంటివి కూడా ప్రతిసారీ ప్రతిబంధకాలే!
అనంతపురం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు, మద్రాసు, తిరుపతి – వంటి చోట్ల ఒక్క ఆహారం, వంటలు, కూరల విషయంలోనే ఎంతో వైవిధ్యం చూస్తాం. తరచి చూస్తే ఈ విషయాల వెనుక ఆర్థికపరమైన, సంస్కృతీపరమైన నేపథ్యాలు, తారతమ్యాలు ద్యోతక మవుతాయి. సర్దుకోవడానికి, సుమారుగా అలవాటు పడటానికి కుటుంబపరంగా సంవత్సరం పడుతుండేది. మూడు, నాలుగు సంవత్సరాలకు ట్రాన్స్ ఫర్ ఉన్నపళంగా ఊడి పడేది. సవాలుగా స్వీకరించి వెళ్తూ పోయాము – వారం, పదిరోజుల్లో చేరడం; నెల, నెలన్నరలో ఫ్యామిలీనీ, లగేజిని తెచ్చుకోవడం! ఇదీ మా బదిలీల వ్యవహారం.
Also read: లేచి వచ్చిన లేపాక్షి బసవడు!
ఒకే ఒక్క సూట్ కేసుతో పనాజికి
1988 ఏప్రిల్ 13న హిందూపురం నుంచి ఒక సూట్ కేసుతో పనాజీ వెళ్ళి, మూడు సంవత్సరాలు పనిచేశాను. 1991 ఏప్రిల్ లో మూడు, నాలుగు కార్టన్ బాక్సులు, రెండు సూట్ కేసుల లగేజీతో గోవా నుంచి అనంతపురం వచ్చేశాను. అప్పటికి పెళ్ళి కాలేదు. తమ్ముడు సురేంద్రనాథ్ గోవా వచ్చాడు. అతనూ, నేనూ కలసి గోవాకు టాటా చెప్పాం. తెలియని భాషల ప్రసారం ఉండే పనాజి ఆకాశవాణి కేంద్రంలో నేను ఎక్కువ కార్యక్రమాలు చేయలేదు కానీ – రేడియో మాధ్యమ రసాయన సమీకరణం కొంత దాకా అవగతం చేసుకున్నాను. గోవాలో ఉన్న మూడేళ్ళలో యూ పి ఎస్సి ఇంటర్వ్యూకి వెళ్ళాను కనుక, ఆ సమయంలో హెచ్. ఆర్. లూథ్రా రాసిన ‘ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్’ పుస్తకం దాదాపు కంఠోపాఠం అయ్యింది. మన దేశం లో రేడియో ప్రసారాల మొదలు, తొలి రోజులు తర్వాత పోకడలు గురించి కొంత ఆకళింపు చేసుకున్నాను.
మద్రాసు, విజయవాడ రేడియో ప్రసారాల గొప్పతనం గురించి చాలా పుస్తకాలలో, పత్రికలలో చదివాను. కనుక, ఒకరకమైన ఆరాధన ఉండేది. ఈ రెండు కేంద్రాలే ఎందుకు? 1938, 1948లో మొదలైన తొలి తెలుగు రేడియో కేంద్రాలివి. ఈ రెండు ఊళ్ళ నుంచే పత్రికలు చాలా నడిచాయి– హైదరాబాదుకు అవి బదిలీ కాకముందు. ఈ రెండు కేంద్రాలలో పనిచేసిన ఉద్దండులైన రచయితలు, కవులు రాసిన గ్రంథాలు నాకు ఎక్కువ కనబడి ఉండవచ్చు, లేదా నేను చదివి ఉండవచ్చు. అదృష్టవశాత్తు ఈ రెండు చోట్ల నేను పనిచేయడం బదిలీ కల్గించిన అయాచిత అవకాశం!
Also read: విజయదశమి కనకదుర్గ తెప్పోత్సవం
రెండు చోట్లా నా ఉద్యోగం, రేడియో కార్యక్రమాలు సంబంధించి కొంత పోలిక ఉంది. విజయవాడలో ఉదయం 7.15 నుంచి 8.00 గం. దాకా, మద్రాసులో ఉదయం 8.15 నుంచి 9.00 గం. దాకా, నా పర్యవేక్షణలో కార్యక్రమాలు సాగేవి. రేడియో వినడం, వార్తాపత్రికలు చదవడం అనేవి వ్యక్తిగతమైన దినచర్యలో అంతర్భాగం. వారి ఉద్యోగం, వారి బాధ్యతలు బట్టి అనుకూల సమయంలో రేడియో వింటారు. అలా విన్న కార్యక్రమాలు నచ్చితే వింటారు, లేదా తర్వాత పట్టించుకోరు. నచ్చితే మళ్ళీ వింటారు, మిత్రులకు వినమని చెబుతారు. కనుక ఆ కార్యక్రమాలను వినేవాళ్లు ప్రతిరోజూ వింటారు. ఉదయం పూట కావడం వల్ల రేడియో ప్రతిబంధకం కల్గించకుండా ఉంటుంది. తమ పనులు తాను చేసుకుంటూ రేడియో వింటారు.
ఉదయరేఖలు, మల్లెపూదండ
అందువల్ల విజయవాడ ‘ఉదయరేఖలు’, మద్రాసు ‘మల్లెపూదండ’కు చాలా ‘డివోటెడ్ లిజనర్స్’ ఉండేవాళ్ళు! దీనికి మరో కారణం – విజయవాడ 1996-2002 కాలానికి న్యూస్ టెలివిజన్ తెలుగులో మొదలు కాకపోవడం కాగా, మద్రాసులో మరే యితరంగా తెలుగువారి భాగస్వామ్యంతో నడిచే వినోద సదుపాయం అక్కడ లేకపోవడం! ఫలితంగానే నేటికీ విజయవాడ, మద్రాసు కేంద్రాల ఆకాశవాణి శ్రోతలు ఎంతో యిష్టంగానే నా కార్యక్రమాలు గుర్తు పెట్టుకుని, సందర్భంగా వచ్చినపుడు ప్రస్తావిస్తూ ఉంటారు!
అట్లని మిగతా కేంద్రాల సంగతులు తక్కువ కాదండోయ్, వాటిని ముందు ముందు చెప్పుకుందాం!
Also read: అనంతపురం పల్లెకళల దిగంతం!!
డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్: 9440732392