Thursday, November 21, 2024

‘మా’ ఎన్నికలలో బాహాబాహీ

  • ఎన్నికల వేడి వెంటనే చల్లారాలి
  • సినిమా పరిశ్రమలో సౌభ్రాతృత్వం వెల్లివిరియాలి
  • అందరూ కలసి సమష్టిగా కృషి చేస్తేనే సినిమా ఆడుతుంది

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు దగ్గరబడ్డాయి. 10వ తేదీ నాడు ఆ తంతు ముగుస్తుంది. ముగిసిన కొన్ని గంటల్లోనే ఫలితాలు వస్తాయి. ఏ ప్యానల్ సభ్యులు గెలిచారో, ఓడారో, ఎవరెవరు విజేతలో, పరాజితులో తేలిపోతుంది. కొన్ని కోట్లమందికి ఆనందాన్ని ఇచ్చే వినోదరంగం కాబట్టి అందరి కళ్ళు దానిపై ఉంటాయి. మీడియా, సోషల్ మీడియా పెరిగిన నేపథ్యంలో  ప్రేక్షకులలో ఉత్సుకత బాగా పెరిగిపోయింది. కొన్నేళ్ల క్రితం వరకూ ఇలా ఉండేది కాదు. ‘మా’ అధ్యక్షుడు, కార్యదర్శి గురించి కేవలం సమాచారం మాత్రమే తెలిసేది. ప్రజలు కూడా పెద్దగా పట్టించుకొనేవారు కారు. ఇప్పుడు రూటే మారిపోయింది. ఎన్నికలు సంచలన వార్తలకు కేంద్రంగా మారిపోయాయి. అసోసియేషన్ లో సుమారు 900మంది సభ్యులు ఉన్నారు. వారి బాగోగులు చూసుకుంటూ ‘తెలుగు సినిమా’ ప్రతిష్ఠను చాటి చెప్పడం ‘మా’బాధ్యత. అటువంటి సదాశయాలతోనే అసోసియేషన్ రూపుదిద్దుకుంది. చాలాకాలం అందరూ కలిసిమెలిసే సాగారు.

దుమారంగా మారిన చిరుగాలులు

వ్యక్తిగతంగా అహంకారాలు, అసూయలు, అవసరాలు, స్వార్థం ఉన్నప్పటికీ అవన్నీ తెరవెనుకకే పరిమితమై ఉండేవి. 2007లో ‘వజ్రోత్సవం’ జరిగిన సందర్భంలో ‘లెజెండ్’ అనే అంశంలో మోహన్ బాబు – చిరంజీవి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. అది తప్ప ఆ ఉత్సవం బాగానే జరిగింది. తెలుగు సినిమా ప్రతిష్ఠను చాటిచెప్పేలా ఆ వేడుక ముగిసింది. నటుల మధ్య, పరిశ్రమ వర్గీయుల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గాలివానలు వస్తూ వెళ్తూ ఉన్నాయి. మళ్ళీ అందరూ కలిసి సినిమాలు చేసుకుంటూ ఎవరి బిజీలో వారు ఉంటున్నారు. ఇదిగో ఇలా ఎన్నికలు జరిగినప్పుడు అలజళ్ళు హద్దులు మీరుతున్నాయి. పోయినసారి జరిగిన ఎన్నికలప్పటి నుంచీ ఈ వాతావరణం ప్రారంభమైందని చెప్పాలి.

చిరంజీవి, దాసరి నారాయణరావు

పెద్దదిక్కుగా దాసరి స్థానంలో మెగాస్టార్

తోటి కళాకారులకు, పరిశ్రమకు సేవ చేయాలనే దృక్పథంతో పాటు, వ్యక్తిగత గుర్తింపును కూడా కొందరు కోరుకుంటున్నారు. మంచిదే. మంచిపనులు చేస్తే ఎలాగూ అదే మంచిపేరును తెచ్చిపెడుతుంది. ఆ వాస్తవాన్ని ఎరిగి నడుచుకుంటే చాలు. నిన్నటి వరకూ దాసరి నారాయణరావును పెద్దదిక్కుగా భావించేవారు. ఆయనకు చేతనైనంత పరిథిలో తన పెద్దరికాన్ని నిలబెట్టుకొనే ప్రయత్నం చేశారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కొంత శూన్యత వచ్చింది. అగ్రనాయకుడు చిరంజీవి దానిని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమకు సంబంధించిన మంచిచెడులలో  చాలామంది ఆయనను ఆశ్రయిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర చిరంజీవికి మంచి గౌరవం ఉండడం వల్ల, పరిశ్రమకు పెద్దదిక్కుగా ఆయన ఉన్నారనే విశ్వాసం పరిశ్రమ వర్గాల్లో పెరిగింది. ఇది ఇలా సాగుతుండగా, ‘మా’ ఎన్నికల సందర్భం వచ్చేసింది. గతానికి మించిన రచ్చ పెరిగింది. ప్రారంభంలో నలుగురు పేర్లు ప్రముఖంగా వినపడ్డాయి. చివరకు ప్రకాష్ రాజ్ – విష్ణు రెండు ప్యానెల్స్ బరిలోకి దిగాయి. తెలంగాణ ప్యానెల్ పేరుతో నటుడు, న్యాయవాది నరసింహారావు తెరపైకి వచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉంటారని భావించిన బండ్ల గణేష్ ఇండిపెండెంట్ గా జీవితకు వ్యతిరేకంగా కార్యదర్శి పదవికి బరిలోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు బండ్ల గణేష్ తాజాగా ప్రకటించి మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఇది మంచి నిర్ణయమేనని పరిశ్రమ వర్గీయులు కూడా భావిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కు మద్దతుగా ఉంటానని ఆయన చెబుతున్నారు.

హోరాహోరీ పోరు

ప్రకాష్ రాజ్ -విష్ణు ప్యానెల్ మధ్య పోరు హోరాహోరీగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ తో పోల్చుకుంటే విష్ణు బాగా యువకుడు. తండ్రి మోహన్ బాబు అండదండల వల్ల మరి కొందరు పెద్దల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకూ అసోసియేషన్ లో కీలకమైన పదవిలో వ్యవహరించిన నరేష్ మద్దతు విష్ణు వైపే ఉంది. జయాపజయాలు ముందుగా ఎవ్వరు చెప్పలేరు. రేపు ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా తమ వృత్తిలో భాగంగా కలిసిమెలిసి పనిచేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. మామూలు రాజకీయ పార్టీలు వేరు, ‘మా’ వేరు. అక్కడ అధికార – ప్రతిపక్షం అనే రెండు వర్గాలు ఉంటాయి. సినిమా పరిశ్రమలో అటువంటి వర్గాలకు తావే లేదు. 24 విభాగాలు ( క్రాఫ్ట్స్ ) ఉన్నాయి. ఈ విభాగాల నిపుణులందరూ సమిష్టిగా సినిమాను నిర్మించాల్సి వుంటుంది. అక్కడ రాజకీయాలు చేసుకొని, వర్గపోరు పెట్టుకుంటే నష్టపోయేది సినిమా పరిశ్రమ, దానిపై ఆధారపడిన బతుకులు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేలమంది సినిమా పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. గతంలోనూ మహానటులు, దర్శకుల మధ్య విభేదాలు ఉండేవి. ఎన్టీఆర్ – ఏ ఎన్ ఆర్ మధ్య కొంత రాజకీయాలు నడిచాయి. కృష్ణ – ఎన్టీఆర్ మధ్య కొన్ని విభేదాలు ఉండేవి. దాసరి నారాయణరావు – అక్కినేని నాగేశ్వరావు మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. కానీ, అవేవీ సినిమా పరిశ్రమను దెబ్బతీయలేదు. మనస్పర్ధలు ఉన్నప్పటికీ ఆ తరం వారంతా హుందాగానే ప్రవర్తించారు. తెలుగుసినిమా గౌరవాన్ని ద్విగుణీకృతం చెయ్యడంలో ఆణువణువూ అంకితమై పనిచేశారు. ఆ తీరుతో అటు పరిశ్రమకు – ఇటు వ్యక్తిగతంగా వారికి మంచి ప్రతిష్ఠ దక్కింది.  ‘మా’ ఎన్నికలు, మధ్య మధ్యలో మామూలు రాజకీయ విభేదాలతో కొందరి నుంచి వినిపిస్తున్న మాటలు ఏ మాత్రం సభ్యతగా లేవు. కులాల కుంపట్లు కూడా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత అసూయ, అహంకారం, స్వార్థం కూడా కొందరి ప్రవర్తనలో ప్రతిధ్వనిస్తున్నాయి. తెలుగు సినిమా గౌరవానికి ఇవన్నీ మచ్చతెచ్చేవే.

కరోనా కొట్టిన దెబ్బ

కరోనా కాలం ప్రారంభమైనప్పటి నుంచీ దెబ్బతిన్న రంగాల్లో తెలుగు సినిమా పరిశ్రమ కూడా ప్రముఖంగా ఉంది. ఎవరో చాలా తక్కువమంది తప్ప, ఎక్కువమంది ఆర్ధికంగా అంత ఉన్నతులు కారు. రెక్కల కష్టం మీద ఆధారపడినవారే. నిరుపేద, పేద, దిగువ, మధ్య తరగతి కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు పరిశ్రమ చల్లగా ఉండేలా చూసుకోవడం అందరి బాధ్యత. పరిశ్రమ అనేక సవాళ్ళను ఎదుర్కుంటోంది. ప్రభుత్వాల నుంచి తగిన సహకారాన్ని పొందడం ముఖ్యం. పరిశ్రమకు చెందిన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడం కీలకం. సినిమా పెద్దలు ఏకమవ్వడం కూడా అంతే ముఖ్యం. అల్లు రామలింగయ్య శత జయంతి ప్రారంభ వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరంలో జరిగిన సభలో మురళీమోహన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమకు పెద్దదిక్కుగా దాసరి నారాయణరావు తర్వాత ఆ స్థానంలో చిరంజీవి ఉన్నారని ప్రకటనాత్మక ధోరణిలో అన్నారు. దాసరి నారాయణరావుకు అత్యంత ఆత్మీయులలో మురళీమోహన్ తొలివరుసవారని తెలిసిందే. ‘మా’ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిశ్రమకు చెందిన పిన్నలు పెద్దలు కలిసి ఒక సమావేశం నిర్వహించుకోవడం ఉత్తమం. పరిశ్రమ ప్రగతికి దోహదపడే విధంగా ఉమ్మడి నిర్ణయాలు తీసుకొని కలసిమెలసి ముందుకు సాగడం వివేకం. తెలుగుసినిమా ప్రతిష్ఠ, గౌరవం కాపాడుకోవడంలో అందరూ భాగస్వామ్యులవ్వాలి. ఈ ఎన్నికల తీరు, ఈ మాటల హోరు మారితే మంచిది.

Previous article
Next article
Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles