- యుద్ధం ముగిసినందుకూ, మరణాలు ఆగినందుకూ సంతోషించా
- యుద్ధంలో 30 ఏళ్ళు పెరిగిన వ్యక్తిగా యుద్ధబాధలు తెలిసినవాడిని
- నా వ్యాఖ్యను వక్రీరించారు
- తమిళులు చస్తుంటూ ముత్తయ్య ఫిడేల్ వాయించాడు : భారతీరాజా
- బయోపిక్ నుంచి తప్పుకుంటే విజయ్ చరిత్రలో మిగులుతాడు : రాందాస్
(స్పెషల్ కరస్పాండెంట్)
శ్రీలంకలో అంతర్యుద్ధం జరిగినప్పుడు తాను వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశానంటూ మీడియాలో వస్తున్న వార్తలను శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీథరన్ ఖండించారు. ‘800’ టైటిల్ తో తన బయోపిక్ నిర్మాణం సందర్భంగా వచ్చిన వార్తలపైన మురళీథరన్ స్పందించారు. 2009లో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారనీ, అంతర్యుద్ధంలో అమాయక తమిళులను చంపడాన్ని తాను ఎన్నడూ సమర్థించలేదనీ, తమిళుల మరణం తర్వాత తాను సంబరాలు చేసుకున్నట్టు వచ్చిన వార్తలు బాధ్యతారహితమైనవనీ, అమానవీయమైనవనీ ప్రఖ్యాత బౌలర్ అన్నారు.
‘యుధ్దం, ఇరుపక్షాల వైపు మరణాలూ 2009లో ఆగిపోయినందుకు నేను సంతోషం వెలిబుచ్చాను. దానిని తమిళులను చంపి గుట్టపోసిన రోజును నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అని అన్నట్టు వక్రీకరించారు. అమాయకులను చంపడాన్ని నేను ఎన్నడూ సమర్థించలేదు. సమర్థించబోను,‘ అంటూ వివరించారు మురళీథరన్.
బయోపిక్ లో ముత్తయ్య మురళీథరన్ పాత్రలో నటించడానికి విజయ్ సేతుపతి అంగీకరించినప్పటి నుంచి ఈ దుమారం చెలరేగింది. తమిళనాడు రాజకీయ నాయకులూ, సినీ ప్రముఖులు ముత్తయ్యపైన మండిపడ్డారు. అతని పాత్రలో నటించడానికి అంగీకరించినందుకు విజయ్ ను తప్పుపట్టారు. విజయ్ అభిమానులు అతడిని నిందిస్తూ ట్విట్టర్లో ట్రోల్ చేశారు.
తన తల్లిదండ్రులకూ, చిన్ననాట తనకు క్రికెట్ నేర్పినవారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో తాను ఈ బయోపిక్ నిర్మించడానికి సమ్మతించినట్టు మాజీ క్రికెటర్ మురళీథరన్ తెలియజేశారు. ‘యుద్ధం ఎంత బాధాకరమో నాకు తెలుసు. యుద్ధం మధ్య నేను 30 సంవత్సరాలు పెరిగాను. నాకు ఏడేళ్ళ వయస్సు ఉన్నప్పుడు మా తండ్రిని నరికివేశారు. చాలా సందర్భాలలో మేము వీధుల్లో పడ్డాము,’ అని చెప్పారు. శ్రీలంక తమిళుల పట్ల సింహళీయులు వివక్ష ప్రదర్శించారనే ఆరోపణలు దశాబ్దాల తరబడి ఉన్నాయి. ఎల్ టీటీఈ అనే తమిళ వేర్పాటువాద సంస్థ ప్రభాకరన్ నాయకత్వంలో శ్రీలంక ప్రభుత్వంపైన కొన్ని సంవత్సరాలపాటు సాయుధ పోరాటం చేసింది. లక్షమంది తమిళ పౌరులు ఈ అంతర్యుద్ధంలో చనిపోయారు. శ్రీలంక సైన్యం తమిళ తిరుగుబాటుదారులను నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. ఎల్ టీటీఈ పైన జరిగిన పోరాటం చివరి భాగంలో సైన్యం బాంబులు ప్రయోగించి అనేక మరణాలకు కారణమైంది.
‘లంక తమిళులను శ్రీలంక సైన్యం ఊచకోత కోస్తుంటే ముత్తయ్య ఫిడేల్ వాయిస్తూ వినోదించాడు. తన సొంత మనుషుల చనిపోతుంటే నవ్విన వ్యక్తి క్రీడాకారుడిగా ఎన్ని ఘనవిజయాలు సాధించినా ఏమి ప్రయోజనం,’ అంటూ ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజా వ్యాఖ్యానించారు. విజయ్ సేతుపతి కనుక ఈ బయోపిక్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వస్తే తమిళ చరిత్రలో అతడి పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రముఖ రాజకీయ నాయకుడూ, పీఎంకే అధినేతా డాక్టర్ రాందాస్ అన్నారు. ఇంతవరకూ కోలీవుడ్ ప్రముఖులు ఒక్కరు కూడా విజయ్ సేతుపతి నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడలేదు. విజయ్ కూడా ఇంతవరకూ ఈ వివాదంపైన స్పందించలేదు.
ప్రఖ్యాత నటుడు రజినీకాంత్ కూడా ఇటువంటి సందిగ్ధావస్థలోనే మూడేళ్ళ కిందట కొట్టుమిట్టాడారు. శ్రీలంకలో తమిళులకు ఇళ్లపట్టాలు పంచిపెట్టడానికి వెళ్ళవలసి ఉన్న రజనీకాంత్ తమిళ నాయకులు నివారించడంతో పర్యటనకు స్వస్తి చెప్పారు. రజినీకాంత్ శ్రీలంకలో పర్యటిస్తే శ్రీలంక ప్రభుత్వం తమిళుల పునరావాసానికి చర్యలు తీసుకుంటున్నదనే అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలో కలిగే ప్రమాదం ఉన్నదని కొందరు రాజకీయవాదులూ, జర్నలిస్టులూ, సినిమా దర్శకులూ రజినీకాంత్ కు వివరించారు. ఎందుకొచ్చిన వివాదమని రజిని పర్యటన రద్దు చేసుకున్నారు. ముత్తయ్య మురళీథరన్ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో 800 వికెట్లు తీసుకున్న బౌలర్ క్రికెట్ చరిత్రలో ఇంతవరకూ లేరు. మున్ముందు ఉండే అవకాశం కూడా లేదు. ఆ ఘనత దక్కించుకున్న బౌలర్ ప్రపంచంలో మురళీథరన్ ఒక్కడే. మురళీథరన్ టెండూల్కర్, ద్రావిడ్, లక్మణ్ ల సమకాలికుడు. బౌలింగ్ లో మేధావిగా, వ్యూహరచనా ప్రావీణ్యం కలిగిన క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు.